అనుమానంతో భార్యను చంపిన భర్త

Fri,May 31, 2019 10:21 PM

husband kills wife in peddapalli dist

పెద్దపల్లి: వారిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కులాలు వేరైనా ఇరువురు పెద్దలను ఎదిరించి కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే కడదాక తోడుంటా అని బాస చేసిన భర్త అనుమానంతో భార్యను దారుణంగా ఇనుపరాడుతో దాడి చేసి హతమార్చిన విషాద సంఘటన గోదావరిఖనిలోని గాంధీనగర్‌ సింగరేణి క్వార్టర్‌లో జరిగింది. వన్ టౌన్ పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. గోదావరిఖని నగరంలోని జీఎం కాలనీకి చెందిన నారుకట్ల మౌనిక (25) గాంధీనగర్‌కు చెందిన దుర్గం శ్రావణ్‌ను పది సంవత్సరాల క్రితం పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నది.

వీరికి అక్షయ్ (8), నిక్షయ్ (6) అనే ఇద్దరు పిల్లలున్నారు. అయితే శ్రావణ్ ప్రైవేటు డ్రైవర్‌గా పని చేస్తూ ఎప్పుడూ ఇంటి వద్దే ఉండేవాడు. ఈ క్రమంలో ఇటీవల భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. శ్రావణ్ ఏం పని లేనందున వరకట్నం తేవాలని మౌనికను ఎప్పుడూ కొడుతూ తిడుతూ మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. దీనికి తోడు భార్యపై అనుమానంతో ఏ ఫోన్ వచ్చినా తనకు కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడాలని చెప్పేవాడని తెలిసింది.

ఈ క్రమంలో ఇటీవల భార్య, భర్తల గొడవల్లో మౌనిక చేయి విరిగింది. దీంతో మౌనిక బంధువులు వైద్యం చేయించి బాగు చేయించారు. గురువారం సైతం మౌనిక తన మొబైల్‌లో ఎవరితోనో వాట్సాప్‌లో చాట్ చేస్తుందంటూ గొడవ చేశాడు. విషయాన్ని మౌనిక తన తల్లిదండ్రులకు చెప్పింది. ఈ క్రమంలో మౌనిక తల్లిదండ్రులతో పాటు సోదరుడైన ఉదయ్ వచ్చి శ్రావణ్‌ను సముదాయించి ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. తర్వాత.. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఇనుప రాడ్‌తో మౌనిక తలపై శ్రావణ్ బలంగా బాదాడు. దీంతో మౌనిక అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం శ్రావణ్ అక్కడి నుంచి పారిపోయాడు. మృతురాలి సోదరుడు ఉదయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రావణ్‌పై వన్ టౌన్ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.

5660
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles