అక్కడ పిల్లులు, ఇక్కడ పులులు!

Sat,May 20, 2017 07:04 AM

How opposition parties behaved in nationalwide

ప్రభుత్వాల మూడేళ్ల వ్యవహారసరళిని, ఈ మూడేళ్లలో ప్రతిపక్షాలు నిర్వహించిన, నిర్వహించలేక పోయిన పాత్రను మదింపుచేయడానికి ఇది అదునైన సమయం. అరువై ఏండ్ల పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాల అనంతరం అవతరించిన తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల ప్రజలు, అనేక దేశాల్లో, వివిధ రాష్ర్టాల్లో, విభిన్న ప్రాంతాల్లో నివసిస్తున్న తెలంగాణ బిడ్డలు గంపెడు ఆశలతో నూతన రాష్ట్రం వైపు చూస్తున్న పరీక్షా సమయం అది. తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా, రాష్ట్ర అధినేతగా గురుతర బాధ్యతలను భుజాల మీద వేసుకోవడానికి మలిదశ తెలంగాణ ఉద్యమ మహానాయకుడు కేసీఆర్. ఏకైక నాయకుడుగా కేసీఆర్ తెలంగాణ పునర్నిర్మాణ బాధ్యతను అంగీకరించడం, ఆ బాధ్యతను ఆయన ఒక సవాలుగా పరిగణించడం తెలంగాణ ప్రజల, ప్రపంచమంతట చెదిరి ఉన్న తెలంగాణ బిడ్డల అదృష్టం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రభుత్వ రథసారథిగా కేసీఆర్ ప్రగతి పథగామి కావడం ఇక్కడి ప్రతిపక్షాల దురదృష్టం. ప్రతిపక్షాలు పార్లమెంట్ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల అభ్యున్నతి, శ్రేయస్సు కోసం అవసరమైన నిర్మాణాత్మక పాత్రకు చిత్తశుద్ధితో సిద్ధమైతే, రాష్ట్ర ప్రగతి యాత్రలో అవి కూడా భాగస్వాములు కావడానికి ఇష్టపడితే దురదృష్టం కాకపోయేది. కానీ, అది జరుగలేదు. 2014 జూన్ 2 సుప్రభాత శుభోదయ సమయంలో ఒకవంక తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం ఆవిర్భవిస్తున్నాయి. మరోవంక ప్రతిపక్షాలు, తెలంగాణ రాష్ట్రం అవతరించిందన్న చరిత్రాత్మక సత్యాన్ని గుర్తించలేకపోతున్న పార్టీలు, విభజనతో తమకేదో అన్యాయం జరిగిందని రోదిస్తున్నాయి. ఇప్పటికీ రోదిస్తున్నవారు ఆశాభంగం పొంది అధికారం, పదవుల కోసం కుమిలి, కృశిస్తున్న వాళ్లు కుట్రలు జరుపడం ప్రారంభించారు. అప్పుడే పుట్టిన బిడ్డ తెలంగాణ రాష్ట్రం గొంతు నులమడానికి కొన్ని గంటలైనా నిండని తెలంగాణ నూతన ప్రభుత్వాన్ని అస్థిరత్వం పాలుచేయడానికి ఆ రోజే 2019 కలలు కన్నవారు, ఇప్పటికే పగటిపూట సైతం అవే కలలు గంటున్నవారు ఈ మూడేండ్లలో ఆశాభంగం పొందక తప్పలేదు. రానున్న రోజుల్లో కూడా ఈ ప్రతిపక్షాలు ఆశాభంగం పొందక తప్పదు. కేసీఆర్ సమర్థపాలనలో ప్రతిపక్ష నాయకులు నిరుద్యోగులు కావడం తథ్యం. తెలంగాణలో ధ్వంస రచన చేయడానికి నడుం బిగించిన ఇక్కడి ప్రతిపక్షాలకు ఆంధ్ర యాజమాన్య పత్రికలు అండగా నిలిచి గోరంతను కొండంత చేశాయి. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి కొన్ని గంటలైనా కాకముందే తెలంగాణలో అవిగో రైతుల ఆత్మహత్యలు, ఆగని రైతుల ఆత్మహత్యలు అని గగ్గోలు! కరెంటు కొరత అంటూ కాకిగోల. కేసీఆర్ ప్రభుత్వ పరిపాలనలో రైతుల ఆత్మహత్యలు, కరెంటు కటకట గత స్మృతులైనాయి. గగ్గోలు చేసిన పక్షాలకు, వాటికి అండగా నిలిచిన బాకాలకు ఆత్మహత్య తప్పని పరిస్థితి ఉత్పన్నమైంది. అది తెలంగాణ ప్రజల అదృష్టం, వాళ్ల దురదృష్టం. అర్థరహితమైన, విద్వేషపూరితమైన, విధ్వంసకారకమైన గగ్గోలు ఆగడం లేదు. గిల్లికజ్జాలకు అంతులేదు. ప్రజల్లో నిజంగా అసంతృప్తి, నిరసనలు పెల్లుబుకితే అవి ఏదో ఒక చౌక్‌కు పరిమితం కావు. రాష్ట్ర సాధన మహోద్యమానికి తెలంగాణ మూల మూలలు తెలంగాణ ఉద్యమ వేదికలయ్యాయి.

మూడేండ్ల సమీక్షలో స్పష్టంగా కనిపిస్తున్నదొక్కటే. సమర్థవంత నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్నో అవరోధాలను, అడ్డంకులను అధిగమిస్తూ అభివృద్ధిపథంలో, సంక్షేమ మార్గంలో మూడు పూవులు, ఆరు కాయల ఫలితాలను సాధిస్తూ ముందంజలో ఉన్నది. కుట్రలను చిత్తు చేయగలుగుతున్నది. సుపరిపాలనకు తెలంగాణ ప్రభుత్వం ప్రతీకగా నిలుస్తున్నది. రాజ్యాంగం ఆదేశించిన శ్రేయోరాజ్య నిర్మాణం శరవేగంతో జరుగడానికి తెలంగాణ ప్రభుత్వం వినూత్న పథకాలతో, ఆలోచనలతో అహోరాత్రులు శ్రమిస్తున్నది. మూడేండ్ల రాష్ట్రంలో నిర్మాణాత్మక పాత్ర వహించలేకపోయిన ప్రత్యర్థి పక్షాల, ప్రతిపక్షాల వైఫల్యం పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక విషాదగాథ. ఇక్కడ తెలంగాణలో గత మూడేండ్ల నుంచి కాగితం పులుల వలె వ్యవహరిస్తున్న ప్రతిపక్షాలు, ప్రభుత్వ పురోగమన విధానాలకు, చర్యలకు అడుగడుగునా అడ్డుపడుతూ తిరోగమన మార్గంలో పయనిస్తున్నాయి. విశేషించి జాతీయ పార్టీలుగా చలామణి అవుతున్న పక్షాలు జాతీయస్థాయిలో పిల్లుల వలె బెదురుతున్నాయి. ఇక్కడ తెలంగాణలో లేని సమస్యలను ఉన్నట్లుగా చిత్రించి గోరంతలు కొండంతలు చేయడానికి తంటాలు పడుతున్నాయి. గత మూడేండ్ల నుంచి దేశం పలు విధాలుగా ఎదుర్కొంటున్న ప్రమాదాలను అరికట్టడంలో ఘోరంగా విఫలమవుతున్నాయి. పశ్చిమబెంగాల్‌లో ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేయడంలో విఫలమైన పార్టీ, దాదాపు ముప్పై ఏండ్లు రాజ్యం చేసి ప్రజల తిరస్కరణకు గురైంది. తప్పుడు విధానాలతో ఈ పార్టీ ఇప్పటికే పశ్చిమబెంగాల్ ప్రజలకు మరింత దూరమవుతున్నది. ఇదే పార్టీ కేరళ ప్రజలు తిరిగి పాలించడానికి అవకాశం ఇచ్చినా సక్రమ పాలన నిర్వహించలేకపోతున్నది. ఈ పార్టీ పాలనలో కేరళ రాష్ట్రం అభ్యుదయ మార్గంలో పయనించడానికి బదులు సంక్షోభదశలో పరుగెత్తుతున్నది. కేరళలో సైనిక దళాలకు ప్రత్యేక అధికారాలను ఇచ్చే చట్టాన్ని ప్రవేశపెట్టాలన్న డిమాండ్ వినిపిస్తున్నదంటే పరిస్థితి ఎంతగా దిగజారుతున్నదో అర్థం చేసుకోవచ్చు. ఈ పార్టీ తెలంగాణలో ప్రజాస్వామ్యం కరుమైందని మొసలి కన్నీరు కార్చడం విచిత్రం.

జాతీయ పార్టీలుగా చలామణి అవుతున్న కాంగ్రెస్ పార్టీ, నామమాత్ర వామపక్షాలు సీపీఐ, సీపీఐ (ఎం) దేశమంతటా తమ ఏకచ్ఛత్రాధిపత్యం కోసం ఉబలాటడపడుతున్న బీజేపీ నిజానికి జాతీయ పార్టీల స్థాయిలో లేవు. 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, పలు రాష్ర్టాల్లో అధికారాన్ని, జాతీయస్థాయిని, పలు కుంభకోణాల్లో ఇరుక్కుని గౌరవ ప్రతిష్టలను, ప్రజల్లో ఆదరణను కోల్పోయింది. వామపక్షాలలో ప్రాబల్యం వహిస్తున్న సీపీఐ (ఎం), సీపీఐ ఎన్నడూ జాతీయ పార్టీలు కావు. పశ్చిమబెంగాల్, కేరళ, త్రిపుర రాష్ర్టాల్లో మాత్రమే గతంలో ప్రాబల్యం వహించిన వామపక్షాలు పశ్చిమ బెంగాల్‌లో ప్రజల తిరస్కరణకు, ఛీత్కారానికి గురై చివరికి కేరళలో మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాయి. అంతర్గత ఘర్షణలతో సంక్షోభానికి గురవుతున్న వామపక్షాలు కేరళలో దక్కిన అధికారాన్నయినా సక్రమంగా నిర్వహించ లేకపోతున్నాయి. కేరళలో వామపక్షాల ప్రభుత్వాన్ని కబళించడానికి బీజేపీ ఎత్తులు వేయడంతో హత్యారాజకీయాల కారణంగా ఆ రాష్ట్రంలో శాంతిభద్రతలు, సుస్థిర పాలన ఎండమావులు అవుతున్నాయి. కలహాల కాపురాలు నడిపిన కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, మరికొన్ని పక్షాలు బీజేపీని హిందుత్వ పార్టీగా పరిగణించి కత్తులు నూరుతున్నాయి. బీజేపీపై ప్రధాని మోదీపై దాడికి తామంతా ఒక్కటికాక తప్పదని కాంగ్రెస్, వామపక్షాలు ఆలస్యంగా గ్రహిస్తున్నాయి. ఇటీవలే ఒక జాతీయ పార్టీ బోర్డు పెట్టుకున్న పార్టీ టీడీపీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక తప్పిదం, ఒక నేరం, తమకు అన్యాయం అన్నట్లు పదేపదే బోరుమంటున్న చంద్రబాబు రాబోయే ఎన్నికల తర్వాత కాబోయే తమ తెలంగాణ ప్రభుత్వంలో (పగటి కలల శిఖామణి ఈయన) ఏయే శాఖకు చేసే బడ్జెట్ కేటాయింపులేమిటో బెజవాడలో కూర్చొని ప్రకటనలు జారీ చేస్తున్నారు. లోలోపల ఎన్ని తన్నులాటలు, గుద్దులాటలు ఉన్నప్పటికీ ఈ పార్టీలన్నీ ఒకే కంచం, ఒకే మంచంతో ఒక్కటై, అపూర్వ రీతిలో ప్రగతిపథంలో పయనిస్తున్న తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వంపై దాడికి పాల్పడుతున్నాయి. మూడేండ్ల కిందట కేంద్రంలో మూడోసారి (అటల్‌జీ రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారం నడిపారు. మూడుసార్లు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినా ఆయన మొదటిసారి 13 రోజులు, రెండో సారి 13 నెలలు, నాలుగోసారి నాలుగున్నరేండ్లు రాజ్యం నడిపారు. ఇండియా షైనింగ్ ప్రచారం బెడిసి కొట్టడంతో అటల్‌జీ రాజకీయ సన్యాసం స్వీకరించారు) ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ అధినేత, ప్రధాని మోదీ, ఆయన కుడి భుజం అమిత్‌షా కాంగ్రెస్ పార్టీని, వామపక్షాలను, ఇతర పక్షాలను, ప్రాంతీయ పార్టీలను క్రమంగా త్వరలోనే కబళించడానికి పథకరచన చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని దూషించడంలో బీజేపీ లోకల్ నాయకులు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలతో, టీడీపీతో భుజం కలుపడం గత మూడేండ్లలో మరో విచిత్ర అనుభవం. ఈ మూడేండ్ల అనుభవాల పర్యావలోకనం జరుపుతున్నప్పుడు కశ్మీర్‌లో చెలరేగుతున్న మంటలను (అక్కడ గత మూడేండ్ల నుంచి రాజ్యం చేస్తున్నది బీజేపీ-పీడీపీ ప్రభుత్వం) గమనించకుండా ఉండలేం. భారత సైనిక దళాలకు, కశ్మీర్ ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు మధ్య పోరాటం ఒక విపరీత పరిణామం. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం విశ్వప్రయత్నాలు జరుగుతున్న తెలంగాణలో కాగితం పులులై గగ్గోలు చేస్తున్న పార్టీలు జాతీయస్థాయిలో దేశ ప్రయోజనాల కోసం ఎందుకు ఉద్యమించడం లేదన్న ప్రశ్న ఉత్పన్నం కావడం సహజం. ఆయా రాష్ర్టాల్లో, జాతీయస్థాయిలో విఫలమై దేశ ప్రయోజనాలను సైతం పరిరక్షించలేకపోతున్న పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ప్రగతి యాత్రకు అడ్డంకులు కల్పించే ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు ఎన్నడూ సహించలేరు.
- వ్యాసకర్త: దేవులపల్లి ప్రభాకరరావు

2216
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS