కృష్ణా నీరు రంగు మారింది.. నీటిని కాచి తాగండి

Sat,August 31, 2019 09:24 AM

హైదరాబాద్ : గ్రేటర్ దాహార్తిలో ముఖ్య భూమిక పోషిస్తున్న కృష్ణా జలాలపై జలమండలి అప్రమత్తమైంది. గడిచిన వారం రోజులుగా రంగు నీరు సరఫరా అవుతున్నట్లు ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్న తరుణంలో ఎండీ దానకిశోర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గతంలో ఎన్నడూలేని విధంగా కృష్ణా నదికి భారీగా నీటి వరద రావడం, నాగార్జునసాగర్ నుంచి నగరానికి నీటిని సేకరించే నీటిలో మడ్డి శాతం అధికంగా ఉండడంతో రంగుతో కూడిన నీరు సరఫరా అయినట్లు అధికారులు ఎండీకి వివరించారు. అయితే అనుమతించదగిన పరిమితుల్లో మడ్డి కొద్దిగా ఉండడం వల్ల నీరు రంగులో కనిపిస్తుందని, ఈ నీరు అన్ని సాధారణ అవసరాలకు అనుకూలంగా ఉంటుందని అధికారులు తెలిపారు.


రంగు మారిన నీటిని కాచి తాగవచ్చని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. అక్కంపల్లి రిజర్వాయర్ నుంచి నగరానికి మూడు దశల ద్వారా రోజూ 270 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తున్నామని, అన్ని దశల్లో శుద్ధి చేసిన తర్వాతనే నీటిని అందించడం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. క్వాలిటీ అస్యూరెన్స్ అండ్ టెస్టింగ్ విభాగం నగరంలోని అన్ని ఓ అండ్ ఎం డివిజన్లలో మంచినీటి నమూనాలను స్వీకరిస్తూ రక్షిత నీటి సరఫరాకు అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు. మంచినీటి నాణ్యతను కాపాడటానికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు.

1378
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles