ప్రారంభమైన మినీ మేడారం జాతర.. భారీగా తరలివచ్చిన భక్తులు

Wed,February 20, 2019 06:35 PM

heavy rush at mini medaram jatara in mulugu district

ములుగు: ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన శ్రీ మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతర జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో ఇవాళ ఘనంగా ప్రారంభమైంది. మండెమెలిగే పండుగతో జాతర ప్రారంభమైంది. పూజారులు గిరిజన సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం పూజాది కార్యక్రమాలను నిర్వహించారు.

గ్రామబంధనం కార్యక్రమాలతో పాటు సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ములుగు జిల్లాగా ఆవిర్భావం చెందిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న మినీ మేడారం జాతరకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలను సమర్పించి అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకొని తమ వెంట తీసుకువచ్చిన ఎత్తు బంగారం(బెల్లం)తో మొక్కులు చెల్లించుకున్నారు.

జాతర శివసత్తుల పూనకాలతో హోరెత్తిపోయింది. ఎదురుకోళ్ళు వంటి సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించారు. మినీ జాతరకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించారు. స్నానాల కోసం జంపన్నవాగులో షవర్లను ఏర్పాటు చేశారు. జాతరలో భక్తులకు అనారోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే ప్రథమ చికిత్స అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. మినీ జాతరలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ములుగు జిల్లా ఇన్‌చార్జీ ఎస్పీ ఆర్ భాస్కరన్ నేతృత్వంలో ములుగు డీఎస్పీ విజయసారథి ఆధ్వర్యంలో భారీ భద్రతను చేపట్టారు. మినీ మేడారం జాతర ప్రారంభం రోజున ములుగు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు నిలువెత్తు బంగారం సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసి తల్లులకు చీరెసారెలను అందజేశారు.

1214
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles