చిన్న వయసులోనే లయ తప్పుతున్న గుండె..

Thu,May 24, 2018 09:11 AM

Heart Attacks Can Strike Young Adults

హైదరాబాద్ : అప్పటి వరకు మనతో సరదాగా మాట్లాడిన 20 ఏండ్ల యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోవడం, తీరా దవాఖానకు తీసుకెళ్తే ఐ యామ్ సారీ అం టూ డాక్టర్ చెప్పడం.. కుటుంబ సభ్యులందిరితో కలిసి భోజనం చేస్తున్న వ్యక్తి హఠాత్తుగా అస్వస్థతకు గురవ డం..దవాఖానకు తీసుకెళ్లగానే హార్ట్‌స్టోక్‌గా తేలడం, చికిత్స అందించేలోపే పిడుగులాంటి వార్త వినాల్సి రావడం...అసలు ఏమిజరుగుతున్నది యువతకు. ఉడుకు రక్తం, ఉరకలేసే వయసు వీరికి హార్ట్-ఎటాక్ రావడమేమిటి. నిజమే 20 నుంచి 30 ఏండ్లవయసు లోపు వారికి గుండెపోటు రావడమేమిటి.. ఇది చాలా దారుణం అనుకుంటున్నారా..

కానీ ఈ మధ్యకాలంలో ఈ వయసు వారే ఎక్కువగా గుండెపోటుకు గురవుతున్నారని గుండె వైద్యనిపుణులు తెలిపారు. ఈ విషయాన్ని ఐదు సంవత్సరాల క్రితమే ఇంటర్ హార్ట్ స్టడీ అనే సంస్థ తన సర్వేలో వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరికల ప్రకారం 2020 నాటకి భారత దేశంలో గుండెపోటు బాధితుల సంఖ్య పెరిగిపోతుందని ఉస్మానియా దవాఖాన గుండె వైద్యనిపుణులు డాక్టర్ కె.ఎం.కె.రెడ్డి తెలిపారు.

యువతలో ఎందుకు?


సాధారణంగా కొలెస్ట్రాల్ (కొవ్వు) శాతం పెరిగిపోవడం, అధిక ఒత్తిడి వల్ల గుండెపోటు, గుండెలోని నాళాల్లో అవరోధం ఏర్పడడం వంటి సమస్యలు వస్తాయని గుండె వైద్యనిపుణులు డా.కె.ఎం.కె.రెడ్డి వివరించారు. దీనికి తోడు అధికంగా ధూమపానం చేసేవారు, అధిక బరువుతో బాధపడే వారితోపాటు వంశపారంపర్యంగా కూడా గుండెపోటు వస్తుందని ఆయన తెలిపారు. అయితే ఈ మధ్యకాలంలో 20 ఏండ్ల వయసు నుంచి 30 ఏండ్ల మధ్య వయసు వారిలో ఎక్కువగా గుండెపోటు వస్తున్నట్లు ఆయన తెలిపారు. దీనికి ప్రధాన కారణం పలు రకాల ఒత్తిడిలేనని ఆయన స్పష్టం చేశారు. మానసిక, శారీరక ఒత్తిడి వల్లనే నేడు 30 ఏండ్ల లోపు వయసు వారు గుండెపోటుకు గురవుతున్నట్లు ఈ సందర్భంగా ఆయన వివరించారు.

ఒత్తిడే ప్రధాన కారణం


20-30 ఏండ్ల మధ్య వయసులో గుండెపోటు రావడానికి పలు రకాల ఒత్తిడే ప్రధాన కారణమని ఉస్మానియా దవాఖాన గుండె శస్త్ర చికిత్సల విభాగం అధిపతి డా.కృష్ణ మాలకొండా రెడ్డి అన్నారు. సాధారణంగా మాసీవ్ హార్ట్-ఎటాక్ అనేది ఏ వయసు వారికైనా వస్తుందని, అయితే ఇది వృద్ధుల కంటే యువతకే ఎక్కువ ముప్పు కలిగిస్తుందని వివరించారు. గతంలో కేవలం వయసు మీదపడిన వారికే గుండె సమస్యలు, గుండెపోటుగాని వచ్చేవని అయితే ప్రస్తుతం ఉరుకులు, పరుగుల జీవన విధానంలో భాగంగా ముఖ్యంగా యువత అధిక ఒత్తిడికి గురవుతున్నట్లు డాక్టర్ రెడ్డి వివరించారు. అర్ధరాత్రి దాటిపోయేవరకు నిద్రపోకపోవడం, సమయానికి భోజనం చేయకపోవడం, శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురవడంతో యువతలో ఎక్కువ మంది గుండెపోటుకు గురవుతున్నట్లు తెలిపారు.

30 ఏండ్ల లోపు వారికే ముప్పు


మాసీవ్ హార్ట్-ఎటాక్ అనేది 70 ఎండ్ల వయసు వారికంటే 30లోపు వయసు వారిలోనే ప్రమాదమని డా.కె.ఎం.కె.రెడ్డి తెలిపారు. దీనికి ప్రధాన కారణం వయసు పెరుగుతున్నాకొద్ది వృద్ధుల్లో కొలెస్ట్రాల్ వల్స్ పెరుగుతాయని, దీనివల్ల వృద్ధుల్లో గుండెపోటు వస్తే పోటువల్ల కొన్ని వాల్వ్స్ బ్లాక్ అయినప్పటికీ వెంటనే కొలెస్ట్రాల్ లెవల్స్ పెరిగి అతిరో స్కిరోసిస్ జరుగుతుందని, దీనివల్ల గుండెకు సంబంధించిన ఇతర నాళాలు తెరుచుకొని రక్త ప్రసరణ క్రమబద్ధీకరణ జరుగుతుందన్నారు. దీనివల్ల మరణం సంభవించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని వివరించారు. అదే 20-30 ఏండ్ల మధ్య వయసుగల యువతీ యువకుల్లో అయితే మరణం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు.

ఈ వయసు వారిలో కొలెస్ట్రాల్ లెవల్స్ అభివృద్ధి కావని ఆయన వివరించారు. దీనివల్ల యువతలో గుండెపోటు రాగానే థ్రోంబోసిస్(రక్తం గడ్డకట్టడం) ఏర్పడి రోగి వెంటనే మృతిచెందడం జరుగుతుందన్నారు. గుండెపోటు వచ్చిన రోగికి చికిత్స అందించేలోపే మరణం సంభవిస్తుందని ఆయన తెలిపారు. గత ఐదేండ్లగా యుక్తవయసులో వారికి గుండెపోటు వస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు డా.రెడ్డి వివరించారు. 15 ఏండ్ల క్రితమే ఇంటర్ హార్ట్ స్టడీ అనే సంస్థ సౌత్ ఏషియాలోని పలు దేశాల్లో సర్వే నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో మన దేశంలోనే యువత ఎక్కువగా మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతూ గుండెపోటుకు బలవుతున్నట్లు తేలిందన్నారు. ఎక్కువగా ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు గుండెపోటుకు గురవుతున్నట్లు తెలిపారు. 2020లో యుక్తవయసు వారు ఎక్కువగా గుండెపోటుకు గురయ్యే అవకాశాలున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిందని డాక్టర్ కె.ఎం.కె.రెడ్డి వివరించారు. సంవత్సరానికి ఒకసారి మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోవాలని దీని వల్ల పొంచి ఉన్న సమస్యను ముందుగానే పసిగట్టి, తగిన చికిత్స అందించే వీలుంటుందన్నారు.

ప్రధాన కారణాలు..


* ధూమపానం
* రాత్రిళ్లు మెలుకువగా ఉండడం
* మానసిక, శారీరక ఒత్తిడికి గురవడం
* ఒకే విషయం గురించి పదే పదే ఆలోచించడం
* లక్ష్యసాధన కోసం మానసికంగా కుంగిపోవడం
* మానసికంగా ఒత్తిడికి గురవడం

పాటించాల్సిన జాగ్రత్తలు


* సాధ్యమైనంత వరకు ఉన్నంతలో సంతోషపడాలి
* మానసిక, శారీరక ఒత్తిడిని తగ్గించుకోవాలి
* రోజుకు 7 గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలి
* సరదాగా, ఉల్లాసంగా ఉండాలి
* ఒకే అంశంపై పదే పదే ఆలోచించకూడదు
* ప్రతిరోజు కనీసం అరగంట వ్యాయామం చేయాలి
* ఆకుకూరలు, తాజా పండ్లు తీసుకోవాలి

9382
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles