సంప్రదాయ వంటకాలతో ఆరోగ్యవంతమైన సమాజం

Mon,May 8, 2017 08:15 AM

Healthy community with Traditional Foods


జంక్ ఫుడ్‌తో జబ్బులేనని ఎంత హెచ్చరిస్తున్నా.. జంకు లేకుండా తింటున్నారు. మారిన ఆహారపు అలవాట్లతో మన పంటలకూ గిరాకీ తగ్గింది. అందమైన అల్యూమీనియం పేపర్ ప్యాక్‌లో కరకరలాడే ఫ్లేక్స్, పప్స్, చిరుతిళ్లే ఈ కాలం పిల్లలకు నచ్చేవి. పెద్దలూ లొట్టలేసుకుంటూ రంగుల ప్రకటల్ని చూసి తింటున్నారు. ఒబెసిటీ, ఎనీమియా, జీర్ణకోశ రోగాలు పొంచి ఉన్నా..మనవాళ్ల మనసు మారట్లేదు. చిరుతిళ్లకు అలవాటుపడ్డ ఈ తరానికి మరో ప్రత్యామ్నాయం లేకపోవడమూ ఓ సమస్యే. ఈ నేపథ్యంలో ఆరోగ్యవంతమైన తృణ ధాన్యాలు వినియోగించి చేసే ఆహారంతో ఆరోగ్యవంతమైన సమాజానికి పాటుపడుతోంది ఐఐఎంఆర్

వాణిజ్య ప్రకటనలు చూసి..
మార్కెట్లో లభించే ఆహార పదార్థాలన్నీ నిల్వ రసాయనాలతో ఎల్లప్పుడూ తాజాగా కనిపిస్తున్నాయి. ఈ కనికట్టు తెలియక మనం ఎప్పుడూ మోసపోతూనే ఉన్నాం. వాణిజ్య ప్రకటనల్లో కనిపించే ఈ రుచికరమైన తినుబండారాల బండారం తెలియంది కాదు. రుచి కోసం రసాయనాలు కలిపి అమ్ముకుంటున్నారు. ఎప్పుడో ఒకప్పుడు ఈ కల్తీ దందా వార్తల్లోకెక్కుతోంది. కారణమేమిటంటే రుచి కోసం కలిపే రసాయనాలు ప్రమాణాలు పాటించలేదనే కేసులు. కానీ కల్తీపై మాత్రం కాదు. నేటి మార్కెట్లో దొరికే చిరుతిళ్లన్నీ ఏదో ఒక రసాయనం పులుముకున్నవే. పిల్లల్ని రసాయనాల ప్రభావం నుంచి కాపాడుకోవాలంటే ఇంట్లోనే ఆ చిరుతిళ్లను సిద్ధం చేయాలి.

చిరుతిళ్ల ప్రయోగం..
రకరకాల వంటలు వండడం అమ్మలందరికీ తెలుసు. ఈజీ డైజెస్ట్ ఇడ్లీ నుంచి హైలీ ప్రొటీన్ ఇచ్చే గుగ్గీల వరకు అమ్మలు, అమ్మమ్మలు వండి పెడతారు. కానీ మనవాళ్లకు అవేమీ నచ్చవు. మార్కెట్ సంస్కృతిని మార్చేస్తోంది. మారుతున్న సంస్కృతిలోకి కొత్త ఆహా రం చేరిపోతోంది. సంప్రదాయ వంటకాల స్థానంలో విదేశీ వంటకాలకు స్థానం దక్కుతోంది. ఈ కొత్త వంటకాలను స్థానిక ఆహార పదార్థాలతో వండడం తెలియకపోవడమే. ఆ సమస్యను అధిగమించాలనే తల్లుల కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (ఐఐఎంఆర్) అద్భుతమైన ప్రయోగం చేసింది. సేమియాలు, ఫ్లేక్స్, పప్స్ మొదలైన ఈ కాలపు చిరుతిళ్లను స్థానిక పంటలతో అదికూడా తృణ ధాన్యాలతో వండడం ఎలాగో చెబుతోంది.

షడ్రుచుల తృణధాన్యం..
శరీరానికి కావాల్సిన శక్తినిచ్చే కార్బొహైడ్రేట్స్, ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన పోషకాలు, జీర్ణ వ్యవస్థ సాఫీగా ఉండేందుకు దోహదపడే పీచు పదార్థాలు పుష్కలంగా ఉండే తృణ ధాన్యాలతో కమ్మని రుచుల్ని పిల్లలకు అందించడం ఎలాగో ప్రయోగాలు చేసి కొత్త రుచులు ఆవిష్కరించింది ఐఐఎంఆర్. స్థానికంగా పండే మెట్టపంటలైన జొన్నలు, రాగులు, కొర్రలు, సజ్జలు, క్వినొవా, ఉలవలు, నువ్వులు మొదలైన వాటితో ఈ కాలపు పిల్లలు ఇష్టపడే అన్ని రకాల వంటకాలనూ సిద్ధం చేసి, చేయిస్తున్నారు. ఆరోగ్యవంతమైన తృణ ధాన్యాలు వినియోగించి చేసే ఆహారంతో ఆరోగ్యవంతమైన సమాజంతో పాటు స్థానిక పంటలకు ప్రచారం, ప్రాచుర్యం కల్పించేందుకు ఐఐఎంఆర్ కృషి చేస్తోంది. ఈ సంస్థ వివిధ తృణ ధాన్యాలతో కుర్‌కురేలు, సేమియాలు, పాస్తా, పఫ్స్ తయారు చేసింది. రాజేంద్ర నగర్‌లోని ఈ సంస్థ కొత్త వంటకాలను తయారు చేయడంతో పాటు ఈ వంటకాల్లోని పోషక విలువలపై కూడా పరిశోధన చేశారు. శరీరానికి కావాల్సిన కార్బొహైడ్రేట్స్ సూక్ష్మ పోషకాలు ఆవశ్యకమైన స్థాయిల్లోనే ఉన్నాయని నిర్ధారించుకుని వీటిని తయారు చేసుకుని తినమని ప్రదర్శనలు, పుస్తకాల ప్రచురణ ద్వారా ప్రచారం చేస్తున్నారు.

653
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS