హైదరాబాద్: జాతీయ ఆరోగ్య రక్షణ పథకంపై అపోలో హాస్పటల్ ప్రశంసలు కురిపించింది. నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద పది కోట్ల కుటుంబాలకు ఉచిత వైద్యం అందించనున్నట్లు ఇవాళ కేంద్ర బడ్జెట్లో జైట్లీ తెలిపారు. ఈ పథకంపై అపోలో హాస్పటల్ స్పందించింది. ఆరోగ్య రక్షణ పథకం.. హెల్త్‌కేర్ రంగంలో దశను మార్చేస్తుందని పేర్కొన్నది. పేద కుటుంబాలకు ఉచితంగా రూ.5 లక్షల మేరకు వైద్య ఖర్చులు ఇవ్వడం ఓ గేమ్‌ఛేంజర్ అని అపోలో హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ సీ.ప్రతాప్ రెడ్డి తెలిపారు. నాణ్యమైన వైద్యం అందరికీ అందాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రక్షణ పథకాన్ని చేపట్టడం ఓ పెద్ద అడుగు అని అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరక్టర్ సునితా రెడ్డి తెలిపారు. కేవలం ఈ ఒక్క ఇన్సూరెన్స్ స్కీమ్ కిందనే సుమారు 40 శాతం మంది జనాభా రావడం సంతోషకరమన్నారు. జాతీయ ఆరోగ్య రక్షణ స్కీమ్‌ను సరైన రీతిలో అమలు చేస్తే.. స్వస్థ భారత్ దిశగా కీలక అడుగు వేసినట్లే అని ఆమె తెలిపారు.