HomeLATEST NEWShealth benefits of multi Flour

పిండి కొద్దీ ఆరోగ్యం

Published: Fri,May 12, 2017 01:23 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
పిండి కొద్దీ రొట్టె ఇది పాత సామెత. పిండి కొద్దీ ఆరోగ్యం ఇది ప్రస్తుతం వినిపిస్తున్న మాట. పిండి అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది రొట్టె. కానీ దీంతో అనేక రకాలైన వంటకాలు కూడా తయారు చేస్తారు. ఈ రోజుల్లో బీపీ, మధుమేహం, స్థూలకాయం వంటి రుగ్మతలు పెరుగుతుండడంతో వాటి నివారణకు రొట్టె తప్పని సరైంది. రొట్టె తయారీకి ప్రస్తుతం మార్కెట్లో రకరకాల పిండి అందుబాటులో ఉంది. ఏపిండిలో ఏయే పోషకాలున్నాయి.. ఎవరు ఏ రకమైన పిండితో చేసిన పదార్థాలు తినాలనే దానిపై అవగాహన పెంచుకోవడం ద్వారా వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త వహించే అవకాశం ఉంది.

శనగపిండి (చిక్ పీ ఫ్లోర్)
మనం ఇష్ట పూర్వకంగా తినే పిండి పదార్థాల్లో శనగపిండిదే ప్రధానమైన పాత్ర. శనగలను వేయించకుండా పిండి చేస్తే దానిని బేసన్ ఆటా అంటారు. ఇది గ్లూటెన్ ప్రీ ఆటా. (గ్లూటెన్ అంటే మనం పిండిని కంచంలో పోసి మధ్యలో గుంట చేసి నీళ్లు పోస్తే కొద్దిసేపటి తర్వాత పొడి పిండి కాస్తా పిండి ముద్దగా మారుతుంది. ఇలా పొడి పిండిని ముద్దగా మార్చడానికి పిండిలోని గ్లూటెన్ అనే పదార్థం తోడ్పడుతుంది. నిజానికి గ్లూటెన్ అనేది ఒక రకం ప్రోటీన్. కొందరికి ఈ గ్లూటెన్ అనే ప్రోటీన్ పడదు. దీంతో వాళ్లకు పిండితో చేసిన వంటకాలు తిన్న వెంటనే కడుపులో ఇబ్బంది, కడుపునొప్పి, వికారం, నీళ్ల విరేచనాల వంటి లక్షణాలు కన్పిస్తాయి. వీరిని గ్లూటెన్ ఇన్‌టాలరెన్స్ వ్యక్తులు అంటారు. ఇటువంటి వారికోసం ఆయా రకాల పిండిని గ్లూటెన్ లేకుండా తయారు చేస్తున్నారు. ఆ పిండి నుంచి గ్లూటెన్‌ను తొలగిస్తారన్నమాట. అటువంటి పిండిని గ్లూటెన్ ఫ్రీ పిండి అంటారు.

ఆరోగ్య ప్రయోజనాలు
శనగ పిండితో అనేక ప్రయోజనాలున్నాయి. ఇందులో తక్కువ ైగ్లెసీమిక్ ఉండడం వల్ల డయాబెటిక్ రోగులకు మంచిది. డయాబెటిస్ ఉన్నవారు గోధుమల కంటే శనగతో చేసిన పరోటాలు, రోటీలు తీసుకోవడం మేలు. శనగల్లో నీటిలో కరిగే పీచు ఉండడం వలన గుండెకు ఎంతో మంచిది. దీనిని వాడితే గుండె జబ్బుల రాక ఆలస్యం చేస్తుంది. శనగల్లో ైగ్లెసీమిక్ విలువ తక్కువ కాబట్టి బరువు పెరగరు. స్థూలకాయం రాదు. ఇందులో గ్లూటెన్ ఉండదు కాబట్టి చాలా రకాల అలర్జీలను కలిగించదు. పైగా అలర్జీలు ఉన్నవారు ఈ పిండితో చేసిన పదార్థాలు తీసుకుంటే అవి అదుపులో ఉంటాయి. ఇది రక్తహీనతను నివారిస్తుంది. డెర్మటైటిస్ హెర్పిటోపార్మిన్, కొన్ని రకాల ఆటోఇమ్యూన్ వ్యాధులు, స్లిరోసిస్, ఆటిజమ్, ఏడీహెచ్‌డీ వంటి వాటిని నివారిస్తుంది. రక్తపోటును నివారిస్తుంది. దీనిలో గ్రోత్ హార్మోన్స్ ఉండడం వలన ఎదిగే పిల్లలకు దీంతో తయారు చేసిన పదార్థాలు పెట్టడం మంచిది. పోలేట్ ఎక్కువగా ఉండడం వల్ల కాబోయే తల్లులు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న మహిళలకు మేలు కలుగుతుంది. ఎర్ర రక్త కణాలను పెంపొందిస్తుంది.

పోషకాలు
ఒక కప్పు శనగ పిండిలో 356 క్యాలరీలు, ప్రోటీన్లు 22 గ్రాములు, కొవ్వులు 6 గ్రాములు, కార్బోహైడ్రేట్లు 53 గ్రాములు, గోధుమలతో పోల్చినప్పుడు ఇందులో క్యాలరీలు తక్కువే. కానీ ప్రోటీన్లు ఎక్కువ. ఈ ప్రోటీన్లు గోధమ పిండిలో కన్నా 33 శాతం కంటే ఎక్కువ. గోధమ పిండితో పోల్చితే శనగ పిండిలో ఉన్న పోలేట్ పోషకం విలువ దాదాపు ఏడు రెట్లు ఎక్కువ. విటమిన్ బీ6, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం పాళ్లూ ఎక్కువే. 100 గ్రాముల శనగపిండిలో 10 గ్రాముల ఫైబర్ ఉంటుంది.

శనగపిండితో సౌందర్యం..
శనగ పిండిలో చిటికెడు పసుపు, పాల ను కలిపి పేస్ట్ చేసి ముఖానికి, మెడకు రాసుకుని 10 నిమిషాలు ఉంచి, తొలగిస్తే ముఖం నిగనిగలాడుతుంది.

ఓట్స్ ఫ్లోర్..
రక్తపోటు, డయాబెటిస్ ఉన్న వారికి ఓట్స్ ఎంతో మేలు చేస్తుందనే ప్రచారం ఉంది. నిజానికి ఇది మన దేశపు పంటకాదు. వీటిని కొందరు యవల పిండి గా పిలుస్తుంటారు. ఇందులో విటమిన్ బి, ఈ, కాపర్, ఐరన్, జింక్, మెగ్నీషియం, ఫాస్పరస్, కాల్షియం, థయమిన్ ఉంటాయి.
ఆరోగ్యానికి చేసే మేలు
ఇందులో నీటిలో కరిగే పీచు ఎక్కువగా ఉంటుంది. దీనిని బీటా గ్లూకన్ అంటారు. దీంతో రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీనిలో సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువ కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు వాడితే పిండి పదార్థాలలోని చక్కెర నెమ్మదిగా రక్తంలో కలిసేలా నియంత్రిస్తూ ఉంటుంది. ఓట్స్‌లో పాలిశాకరైడ్, నాన్ సెల్యూలోజ్ పాలిశాకరైడ్ అనే బంధాలను కలిగిఉంటాయి. ఇవి నీళ్లలో కలిసినప్పుడు ఉబ్బినట్లు అవుతాయి. కావున కొద్దిగా తిని కొద్దిగా నీరు తాగగానే కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. దీంతో డయాబెటిస్ ఉన్నవారు ఇవి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పాళ్లు గణనీయంగా తగ్గిపోతుంది.

కొర్రల పిండి
(కాముట్ ఫ్లోర్)

మనం ఎక్కువగా వాడే గోధుమల కంటే కొర్రల పిండిలో ప్రోటీన్లు, పొటాషియం పాళ్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే కొర్రల పిండి చాలా ఆరోగ్యకరం. ఇందులోని గ్లూటెన్ చాలా తేలికగా జీర్ణమవుతుంది. దీంతో రొట్టెలేకాకుండా ఇతర రకాల వంటకాలు చేస్తుంటారు.
కొర్రల్లోని పోషకాలు
ప్రోటీన్లు, పొటాషియం, నియాసిన్, థయామిన్, జింక్, మెగ్నీషియం, ఐరన్, రైబోప్లేవిన్.
ఆరోగ్యానికి మేలు
పీచు పదార్థాలు ఎక్కువ కాబట్టి త్వరగా జీర్ణం కావడంతో పాటు మలబద్ధకాన్ని నివారిస్తుంది. దీనిలోని ప్రోటీన్లు బలవర్థకమైన కణజాలాన్ని ఏర్పరుస్తాయి. కణజాలం బలంగా ఉండడంతో పాటు ఆక్సిజన్‌ను గ్రహిస్తాయి కాబట్టి మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది. దీనిలో జింక్ ఎక్కువ కాబట్టి వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేగుణం ఉంది. కేశాలు ఊడడం తగ్గడంతో పాటు థైరాయిడ్‌ను క్రమబద్దీకరిస్తుంది. ఇందులోని మెగ్నీషియం కారణంగా ఎముకలు గట్టిపడడంతో పాటు ఎంజైమ్‌లు మరింత సమర్థవంతమవుతాయి.

బియ్యప్పిండి
పిల్లలకు ఆహారంగా పెట్టడానికి దీనిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది గ్లూటెన్ లేనిది. ఇతర పిండి పదార్థాల్లోని గ్లూటెన్‌ను తగ్గించేందుకు దీన్ని వాడతారు. గోధుమ, బియ్యప్పిండి రెండింటిలోను ఉండే క్యాలరీలు ఒక్కటే.

ఆరోగ్య ప్రయోజనాలు
దీంతో చేసిన పదార్థాలు తింటే పేగులలో క్రమబద్ధమైన కదలికలు ఉంటాయి. కాబట్టి మలబద్దకం ఉండదు. దీనిలో మాంగనీస్ పుష్కలం కాబట్టి ఎముకలు, వాటిపై మృదులాస్థి ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఈ పిండిని మొదటే పులిసేలా చేసి వంటకాల చేయడం వలన అవి మన జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి. పుల్లట్ల వలన పేగులలో మేలు చేసే బాక్టీరియా పెరుగుతుంది. ఇవి కొంచెం తినగానే కడుపునిండినట్లు అవుతుంది. దీంతో స్థూలకాయం వంటి అనర్థాలు దరిచేరవు. కడుపులో మేలు చేసే బాక్టీరియాలు పెరిగి విషపదార్థాలను హరించేస్తాయి. గోధుమ పిండిలోని గ్లూటెన్ వలన కలిగే అనర్థాలకు ఈ పిండితో చేసిన పదార్థాలు తినడం మంచి ప్రత్యామ్నాయం.

మొక్కజొన్న పిండి (కార్న్ ఫ్లోర్)
మొక్కజొన్నను పిండిగా కంటే ఇతర ఆహారపదార్థాలుగా ఎక్కువగా వాడుతుంటాం. ఇందులో పసుపుపచ్చనివి, తెల్లనివి అనే రెండు రకాలుంటాయి. రంగులో మినహా పోషకాల విషయంలో రెండు సమానమే.
మొక్కజొన్నలోని పోషకాలు
ఒక కప్పు మొక్కజొన్నలో 416 క్యాలరీలు, కొవ్వులు 4.4 గ్రాములు, ప్రోటీన్లు 11 గ్రాములు, పిండిపదార్థాలు 75 గ్రాములు, పీచు 7.3 గ్రాములు, ఐరన్ 3 మిల్లీగ్రాములు, థయమిన్ 1.8 మిల్లీ గ్రాములు, 0.9 మి.గ్రా, నియాసిన్ 11 మి.గ్రా, పోలేట్ 238 మైక్రొగ్రాములు ఉంటాయి.
ఆరోగ్య ప్రయోజనాలు
పీచు పదార్థాలు( డయాటరీ) ఎక్కువ కాబట్టి సులభంగా జీర్ణమై మలబద్ధకం నివారిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను గణనీయంగా తగ్గిస్తుంది. ఇందులో కొలెస్ట్రాల్ ఏమాత్రం లేకపోవడంతో ల్యూటీన్, టీయాగ్జాంథీన్ అనే పోషకాలుంటాయి. ఇవి మంచి ఆక్సిడెంట్ ఫలితంగా వయసు పెరిగే ప్రక్రియ మందగించడంతో పాటు దీర్ఘ యవ్వనంతో ఉండడానికి ఉపకరిస్తాయి. ఇందులో సోడియం పాళ్లు 6 మి.గ్రా మాత్రమే అందువల్ల హైబీపీ ఉన్న ఈ మొక్కజొన్న పిండిని నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఇందులోని మెగ్నీషియం, పొటాషియం పాళ్లు రక్తపోటును తగ్గిస్తాయి. ఇందులోని సెలీనియం అనే యాంటీ ఆక్సిడెంట్‌తో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పసుపుపచ్చని మొక్కజొన్న పిండిలో 2.8 మి.గ్రాల ఐరన్ ఉంటుంది ఇది మన ఆహారంలో లభించే 35శాతం కావడం వల్ల రక్తకణాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ పిండి గుండె ఆరోగ్యాన్ని కాపాడి కార్డియో వాస్క్యులార్ డిసీజెస్ రాకుండా నివారిస్తుంది.


రాగి పిండి
దీంతో రాగి అంబలి, రాగిముద్ద, రాగి రొట్టెల రూపంలో తయారు చేసి తింటుంటారు. కొందరు రాగి ఇడ్లీలు, దోసెలు, లడ్డూలను కూడా చేసుకొని తీసుకుంటారు. దీనిలో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, పీచుపదార్థాలు, తక్కువగా కొవ్వులు ఉంటాయి.
రాగిలోని పోషకాలు
వంద గ్రాముల రాగి పిండిలో 350 మి.గ్రాల కాల్షియం ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి, పటిష్టతకు ఉపయోగపడుతుంది. అత్యావశ్యక అమైనో ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వ్యాలైన్ మిథియోనైన్, ఐసోల్యూసిన్, థియోనైన్, ట్రిప్టోపాన్ వంటివి మన శరీర సమర్ద ఆరోగ్య నిర్వాహణకు ఆవశ్యకం. ఇవి రాగిలో ఉంటాయి. ఇది త్వరగా జీర్ణమవుతుంది. అందుకే నవజాత శిశువులకు రాగిజావను మొదటి ఆహారంగా ఇస్తుంటారు.
ఆరోగ్య ప్రయోజనాలు
రాగిలో ట్రిప్టోపాన్ అనే అమైనో ఆసిడ్ ఉండడం వల్ల వెంటనే ఆకలి తీరినట్లు అనిపిస్తుంది. దీనిలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి కావున తిన్న వెంటనే కడుపు నిండినట్లు అనిపిస్తుంది. కొవ్వులు దాదాపు లేనట్టే కావున బరువు పెరగగపోవడం, స్థూలకాయం రాకపోవడం వంటి ప్రయోజనాలు చేకూరతాయి. కాల్షియం, విటమిన్ డిలు ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలకు చాలా మంచిది. ఎదిగే పిల్లలకు వీటి వంటకాలు తినిపించడం చాలా మంచిది.
డయాబెటిస్ నియంత్రణకు
వీటిలో ఆలిఫినాల్‌తో పాటు పీచు పదార్థాలు ఎక్కువ కాబట్టి డయాబెటిస్, జీర్ణవ్యవస్థకు సంబందించిన అనేక వ్యాధులు నివారింపబడతాయి. పీచు ఎక్కువకాబట్టి రక్తంలో చక్కెర నెమ్మదిగా కలుస్తుంది. కాలేయంలో పేరుకపోయిన అదనపు కొవ్వును తొలగిస్తుంది. కాలేయంలో కొవ్వు పేరుకుంటున్న వారు రాగిలతో చేసిన ఆహారాన్ని తినడం మేలు. రక్తహీనతను తగ్గించడంతో పాటు ఒత్తిడిని నియంత్రించడంలో రాగుల పాత్ర చాలా కీలకం.

గోధుమ
గోధుమల్లో పిండి పదార్థాలతో పాటు ప్రోటీన్లు, పీచు, ఐరన్, విటమిన్లు, బీ కాంప్లెక్స్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇందులో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.
ప్రయోజనాలు
పొట్టు తీయని గోధుమల్లో పీచు(డయాటరీ ఫైబర్) ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగుతుంది. పొట్టు తీయని గోధుమలతో రొట్టెలు తినే వారికి మలబద్ధకం నివారింపబడుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దాంతో గుండె జబ్బులు నివారించడం సాధ్యమవుతుంది. స్థూలకాయం కూడా తగ్గుతుంది.
డయాబెటిస్ వర్సెస్ గోధుమ
చాలా మంది షుగర్ వ్యాధి ఉన్నవారు వరికి బదులుగా గోధమలను ఉపయోగిస్తుంటారు. ఈ రోజుల్లో డయాబెటిస్ ఉన్నవాళ్లలో చాలా మంది రాత్రిపూట అన్నం మానేసి గోధుమ రొట్టెలను మాత్రమే తింటుంటారు. వరి అన్నం, గోధమ రొట్టెల ైగ్లెసీమిక్ ఇండెక్స్ ఒక్కటే. (ఒక పిండి పదార్థాన్ని తీసుకున్నప్పుడు అందులోంచి వెలువడే చక్కెర శరీరానికి సమకూరే శక్తి నిష్పత్తులను ైగ్లెసీమిక్ ఇండెక్స్ అనే కొలతలో చెబుతారు) వాస్తవానికి ఈ రెండింటిలో ఏది తిన్నా ఒక్కటే. కానీ అన్నం తినే సమయంలో కూర రుచిగా తలిగితే నాలుగు ముద్దలు ఎక్కువ లాగించేస్తాం. అదే రొట్టెలైతే ఎన్ని తింటున్నామో తెలుస్తుంది కాబట్టి పరిమితికి మించం. దీంతో రక్తంలో గ్లూకోజ్ పెరుగదు. రాత్రి వేళలో పరిమితిగా అన్నం తిన్నా, లేక రొట్టె తిన్నా ఒక్కటే. అంతమాత్రానా గోధుమ తినడం వలన డయాబెటిస్ వారికి ఎలాంటి అదనపు ప్రయోజనం చేకూరదని చెప్పడం కూడా పూర్తిగా సరికాదు. ఎందుకంటే...అరకప్పు తెల్ల గోధుమల్లో 1.8 గ్రాముల పీచు పదార్థం ఉంటుంది. అదే అరకప్పు పొట్టు తీయని గోధుమల్లో 6.4 గ్రాముల పీచు ఉంటుంది. అందువల్ల పొట్టు తీయని గోధుమతింటే రక్తంలోకి గ్లూకోజ్ ఇంకిపోవడం చాలా నెమ్మదిగా జరుగుతుంది. అంటే దీంతో రెండు ప్రయోజనాలుంటాయి. మొదటిది రక్తంలోకి గ్లూకోజ్ నెమ్మదిగా విడుదల కావడం, రెండోది జీర్ణక్రియ సక్రమంగా జరగడంతో పాటు మలబద్ధకం నివారించబడడం. ఒక కప్పు గోధుమల్లో 407 క్యాలరీలు, కొవ్వులు 2.24 గ్రాములు, కార్బోహైడ్రేట్‌లు 82.06 గ్రాములు, ప్రోటీన్లు 18.44 గ్రాములు ఉంటాయి.

బార్లీ పిండి
మనం వాడే పిండి పదార్థాల్లో కెల్లా బార్లీ చాలా ఆరోగ్యకరమైనదిగా చెప్పవచ్చు. పొట్టు తీయని బార్లీ వల్ల కలిగే ఆరోగ్య విలువలు చెప్పడానికి వీల్లేనన్ని విశిష్టమైనవి.
పోషక విలువలు
బార్లీలో ఎన్నో పోషకాలు ఉండడం వల్ల దీనిని పవర్ హౌస్ ఆప్ ఫైటో న్యూట్రియెంట్స్ అని అంటుంటారు. ఈ పోషకాలు పురుషుల్లో ప్రోటెస్ట్ కేన్సర్‌ను, స్త్రీలలో రొమ్ము కేన్సర్‌ను నివారిస్తుంది. దీనిలోని సేరేనియమ్ అనే పోషకం జీవకణాల్లో ఎంజైమ్‌లను సమర్థవంతంగా పనిచేయిస్తుంది. పురుషుల్లో శుక్రకణాలను నాణ్యంగా ఉండేలా చేస్తుంది. ఇది గుండెకు మేలు చేస్తుంది. పాంక్రియాస్ కణజాలం మెరుగుపడుతుంది. అన్ని రకాల కేన్సర్‌లను నివారిస్తుంది. దీనిలో గ్లూటెన్ ఉంటుంది. ఒక్కసారి పరిశీలించి చూసి సరిపడితే నిరభ్యంతరంగా వాడుకోవచ్చు.

జొన్నపిండి (సోర్ఘమ్ ఫ్లోర్)
రెండు, మూడు తరాలకు ముందు ఇదే ప్రధాన ఆహారం. ఇప్పటికి ప్రపంచంలో ఎక్కువగా వాడే ఐదు తృణధాన్యాలలో జొన్న ఒకటి. వర్షాలు తక్కువగా ఉండే ప్రాంతాలల్లోనూ వీటిని తేలికగా పండించవచ్చు కాబట్టి ఇవి తిండికొరత లేకుండా చేసేందుకు ఉపయోగపడతాయి. చాలా మంది జొన్న రొట్టెలు, జొన్నన్నం లాగా తీసుకుంటుంటారు.
జొన్నతో ఆరోగ్యం
ఇందులో ప్రోటీన్ల పాళ్లు ఎక్కువ. కాల్షియం, పోటాషియం, ఫాస్పరస్ ఉంటాయి. థయమిన్, రైబోప్లేవిన్, బీకాంప్లెక్స్‌కు సంబంధించిన విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. పీనాలిక్‌యాసిడ్, ట్యానిన్స్, ఆంథోసయనిన్ వంటి పోషకాలు అన్ని రకాల కేన్సర్‌లను నివారిస్తాయి. జొన్నలు తినే వారికి స్థూలకాయం దాదాపు లేనట్టే. ఇవి దీర్ఘకాలం యవ్వనానికి మంచి ఆహారం.


ధాన్య మిశ్రమాల పిండి(మల్టీ గ్రెయిన్ ఆటా)
సాధారణంగా ఒక కాయధాన్యమో, తృణధాన్యమో కాకుండా కొన్ని రకాల ధాన్యాలను కలిపి దంచితే అదే మల్టీ గ్రెయిన్ ఆటా. ఇందులో ఓట్స్, గోధుమపిండి, కుసుమలు, పొట్టు తీయని ఎన్నో తృణధాన్యాలను కలిపి ఈ పిండిని రూపొందిస్తుంటారు. దీనిలో 3-12 వరకు ధాన్యాలు కలిపి ఉండవచ్చు.

ప్రయోజనాలు
కొన్ని రకాల పిండిలలో పోషకాలు ఉండి మరి కొన్నింటిలో లోపించవచ్చు. ఇలాంటి సమయాల్లో చాలా రకాల ధాన్యాలను కలిపి దంచుకోవడం వలన పోషకాలు కలిసి సంపూర్ణ పోషక విలువలు కలిగిన పిండిగా రూపొందుతాయి. ఇంలాంటి పిండి ఆరోగ్యానికి మేలు.
జాగ్రత్త వహించాలి
ప్రస్తుతం మార్కెట్‌లలో ఎక్కువగా లభించే గోధుమ పిండినే ఎక్కువగా తీసుకొని మిగతా తృణ ధాన్యాలను చాలా తక్కువ మోతాదులో కలిపి వాడుతుంటారు. దీంతో మనం సాధారణ గోధుమ పిండిని వాడిన ప్రయోజనాలకు మించి పెద్దగా ఉపయోగం పొందలేం, అందుకే వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలి.
2465
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology