పోషకాలు కలిగిన ఆహారం కోడిగుడ్డు...

Fri,March 22, 2019 10:14 AM

health benefits of egg

తల్లిపాలు ఎంతో శ్రేష్టమైనవి... తల్లి పాల తరువాత అంతటి పోషకాలు కలిగిన ఆహారం కోడిగుడ్డు. గుడ్డు సంపూర్ణ ఆహారం... మనిషికి అవసరమైన తొమ్మిది ప్రొటిన్లు గుడ్డులో ఉన్నాయి. ఎదిగే పిల్లలకు చాలినన్ని ప్రొటిన్లు ఉన్నాయి. పోషకాహార లేమితో బాధపడేవారు రోజుకో గుడ్డు తినాలని డాక్టర్లు చెబుతున్నారు. గుడ్డు వల్ల మానవ శరీరానికి కలిగే ఉపయోగాలు, అందులో ఉన్న ప్రొటిన్లు సమగ్ర వివరాలపై అందిస్తున్న ప్రత్యేక కథనం.

సండే హో యా మండే... రోజ్ ఖావో అండే...

అనే ప్రకటన టీవీల్లో వస్తుంది. పోషక విలువలు కలిగిన కోడిగుడ్డు వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రసార మాద్యమాల్లో నిర్వహిస్తున్న ప్రచారం. పేద, ధనిక వర్గాలు అనే తేడా లేకుండా అందరికీ అందుబాటు ధరలో ఉంటూ, పోషక విలువలు మెండుగా లభించే కోడిగుడ్డు పిల్లల శారీరక ఎదుగుదలకు, వికాసానికి ఎంతో ఉపయోగపడుతుంది. గుడ్డు ఖనిజాల గని. శరీరానికి ఉపయోగపడే దాతువులు 45 అయితే గుడ్డులో 44 దాతువులు ఉన్నాయి. గుడ్డులో తెల్ల సొన, పచ్చ సొన అని రెండు భాగాలు ఉంటాయి. తెల్లసొనలో ఓవ ఆల్బూమిన్, కొన్ ఆల్బుమిన్, ఓవ మ్యుకాయిడ్, ఓవ మ్యూసిన్, లైపోజైం, ఎవిడిన్, ఓవ గ్లోబ్యూలిన్, ఓవ ఇన్హిబీటర్ అనే 8 మాంసకృత్తులు ఉన్నాయి.

పచ్చసొనలో లిపోవిటీలిన్స్, పోజ్‌విటీన్, లివిటీన్, తక్కువ డెన్సిటీ కలిగిన లిపో ప్రొటిన్లు అనే నాలుగు మాంసకృత్తులు ఉంటాయి. అన్ని గుడ్లలోనూ సమానమైన పోషక పదార్థాలు ఉండవు. ఫారంలో పెరిగే కోడిగుడ్డులో కంటే బయట తిరిగే కోడిగుడ్డులో ఎక్కువ పోషకపదార్థాలు ఉంటాయి. గుడ్డులో మరీ ముఖ్యంగా పచ్చ సొనలో 12 ఖనిజాలు, 8 లవణాలు ఉన్నాయి. పచ్చ సొనలో ఉండే కొలెస్ట్రాల్ అన్ని రకములైన జీవక్రియకు ఉపయోగపడుతుంది. 50 గ్రాముల గుడ్డులో 90 శాతం నీరు, 10 శాతం పోషకపదార్థాలు ఉంటాయి. ఒక గుడ్డు నుంచి 7 గ్రాముల ప్రొటిన్లు, 6.5 గ్రాముల కొవ్వు, 1 మిల్లీ గ్రాము ఇనుము, 35 గ్రాముల పోలిక్ యాసిడ్, 0.9 మైక్రో గ్రాముల బీ12, 210 మైక్రో గ్రాముల బీటా కెరోటీన్, 5 గ్రాముల విటమిన్ డీ, 30 మిల్లీ గ్రాముల కాల్షియం, 0.4 గ్రాముల మెగ్నీషియం ఉంటాయి. పచ్చి గుడ్డులో 51 శాతం ప్రొటిన్లు, వండిన గుడ్డులో 91 శాతం ప్రొటిన్లు ఉంటాయి.

వ్యాధుల నివారణకు... రోజు ఒక గుడ్డు..


ఆరోగ్యవంతమైన జీవితంలో గుడ్డును ప్రతి రోజు తీసుకుంటే 50 శాతం ఐసోమిక్ స్ట్రోక్, 80 శాతం కార్డియాక్ డెత్, 75 శాతం కార్డియో వాస్కులార్ వంటి వ్యాధులన్నింటికీ దూరంగా ఉండవచ్చు. స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ రాకుండా గుడ్డులో ఉన్న తెల్లసొన ఎంతగానో తోడ్పడుతుంది. క్రమం తప్పకుండా గుడ్డు తీసుకుంటే 44 శాతం క్యాన్సర్‌కు దూరంగా ఉండొచ్చు. గుడ్డును ఆహారంలో తీసుకున్న వారు 80 శాతం వరకు కరోనరి వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. ఉడికించిన గుడ్డును ఉదయం అ్పహారంగా తీసుకోవడం వల్ల ఊబకాయం నుంచి దూరంగా ఉండవచ్చని ఒక పరిశోధనలో రుజువైంది.

గుడ్డు- అపోహలు..


* గుడ్డు చాలా వేడి చేస్తుందని భావిస్తారు కానీ వాస్తవం కాదు. పొట్లకాయ, గుడ్డు కలిపి వండితే విషపూరితం కాదు.
* గుడ్డును పచ్చిది తాగితే బలం వస్తుందని భావిస్తారు. కానీ అది సరికాదు. ఎందుకంటే తెల్లసొనలో ఎవిడిన్ అనే నిరోధకం ఉంటుంది. ఆ ఎవిడిన్ బయోటిన్‌తో కలిసిపోయి బయోటిన్‌ని శరీరం వినియోగించుకోకుండా అడ్డుకుంటుంది. అదే గుడ్డును వేడిచేస్తే ఎవిడిన్, బయోటిన్ నుంచి విడిపోతుంది.
* పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందని అనుకుంటారు. ఈ కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హాని చేయదు. పైగా కొలెస్ట్రాల్‌ను నేరుగా రక్తంలో కలువకుండా చూసే లెసిథిన్ వంటి రసాయనాలు ఉంటాయి.

గుడ్డు తినడం వల్ల ఉపయోగాలు...


* మెదడుకు ఆరోగ్యాన్నిచ్చే పదార్థాలు గుడ్డులో ఉన్నాయి. గుడ్డు పచ్చసొనలో 300 మైక్రో గ్రాముల ఖోలిన్ అనే పోషకపదార్థం ఉంటుంది.
* గుడ్డులో ఉన్న ఇనుము మన శరీరం సులభంగా గ్రహిస్తుంది. గుడ్డుని తినడం వల్ల కండరాలు దృఢంగా అవుతాయి. ఇది క్రీడాకారులకు చక్కని ఆహారం.
* గుడ్డులో ఉన్న రైబోప్లేవిన్ చర్మం ఆరోగ్యానికి, జీర్ణక్రియకు దోహదపడుతుంది. లూటెన్, జియాక్సాన్‌థిన్ కంటి చూపు మెరుగుకు, రెటీనా ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.
* బీ12 (సయానోకో బాలిమిన్) అనే విటమిన్ ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందడానికి, నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
* గర్భిణులకు గుడ్డు చాలా ఆరోగ్యకరం. గుడ్డులో ఉండే పోలిక్ యాసిడ్, ఇనుము పుట్టబోయే బిడ్డ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.
* గుడ్డును ఆహారంగా తీసుకోవడం వలన మానసిక ఆందోళనను, గుండె వ్యాధులు, కాలేయంలో కొవ్వు ఉత్పత్తిని తగ్గిస్తుంది. అలాగే కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది.
* వెంట్రుకలు, గోళ్లు ఆరోగ్యంగా పెరుగడానికి ఉపయోగపడే బయోటిన్ గుడ్డులో ఉంటుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్దీకరిస్తుంది.
* కొవ్వులో కరిగే ఏ, డీ, ఈ, కే విటమిన్లు, నీటిలో కరిగే బీ కాంప్లెక్స్ గుడ్డు పచ్చసొనలో ఎక్కువగా ఉంటాయి

2125
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles