మల్లికార్జునే ప్రధాన సూత్రధారి!...

Fri,July 20, 2018 11:10 AM

Haritaki fruit scam case main accused mallikarjun

హైదరాబాద్ : కరక్కాయల పౌడర్ గోల్‌మాల్‌లో మల్లికార్జున్ ప్రధాన సూత్రధారని సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం ప్రాథమిక దర్యాప్తులో స్పష్టమైంది. ఈ మోసానికి సంబంధించిన పూర్తి పథక రచన మల్లికార్జున్ చేశాడని పోలీసులు తెలుసుకున్నారు. అనిల్ దేవ్‌రాజ్‌ను ముందుపెట్టి మల్లికార్జున్ తన వెంటపెట్టుకొని మల్లికార్జున్ ఈ మోసంలో మైండ్‌గేమ్ ఆడినట్లు తెలుస్తున్నది. మల్లికార్జున్ ఎప్పుడు ముందుకు రాకుండా అనిల్ దేవ్‌రాజ్‌తోనే డిపాజిట్ దారులతో మాట్లాడించి తెరవెనుక పాత్ర మల్లికార్జున్ నడిపించాడని తేలింది.

కేపీహెచ్‌బీ కార్యాలయంలో పోలీసులు జరిపిన సోదాల్లో పలు రికార్డులు, కంప్యూటర్లలో దాచి ఉన్న సమాచారంతోపాటు ఇంకా చాలా కీలక విషయాలు పోలీసులకు లభించాయి. దొరికిన రికార్డ్స్‌ను పరిశీలిస్తే బాధితులు వెయ్యి మందికిపైగా ఉంటారని తెలిసింది. వీరందరి డిపాజిట్‌లను పరిశీలిస్తే మోసపోయిన నగదు ఐదు కోట్లు దాటుతుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇందులో కొంత మందికి అతను ప్రకటించిన ఆఫర్ కింద చెల్లించినట్లు తెలిసింది. వీటిపై అధ్యయనం చేయాల్సి ఉండటంతో నగదు కొల్లగొట్టింది తేలడానికి కొంత సమయం పడుతుందని పోలీసులు అంటున్నారు.

ఈ చీటింగ్‌తో ఢిల్లీ ముఠాలకు ఏం సంబంధంలేదని, పుకార్లు వస్తున్నాయని ఆర్థిక నేరాల నియంత్రణ పర్యవేక్షణాధికారి స్పష్టం చేశారు. మల్లికార్జున్ నెల్లూరులోనే తలదాచుకున్నట్లు భావిస్తున్నామని, అతని కోసం అక్కడ పోలీసు బృందాలను పెట్టామన్నారు. ఇప్పటి వరకు మల్లికార్జున్ కోసం కుటుంబసభ్యులు, స్నేహితులు, అక్కడి స్థానికులను ప్రశ్నిస్తూ కీలక సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. కరక్కాయలు, దాని పౌడర్ నిల్వ ఉంచేందుకు నగరంతోపాటు శివారులో మల్లికార్జున్ ఓ గోడౌన్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించి ఆ గోడౌన్‌లో తనిఖీలు చేశారు. గత నెలలో బెంగళూరులో కూడా ఇదేవిధంగా కరక్కాయ పౌడర్ స్కీం కింద ఓ కార్యాలయం ఏర్పాటు చేశాడు. అయితే దానిని ప్రస్తుతం మూసేశాడని గుర్తించారు.

మల్లికార్జున్ దొరికితే కరక్కాయ పౌడర్‌ను ఎక్కడికి సరఫరా చేశాడు, వాటిని ఎక్కడి నుంచి కొనుగోలు చేశాడనే అంశాలపై స్పష్టత వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు బాధితులు చాలా మంది వస్తున్నప్పటికీ వారి ఫిర్యాదులపై రెండు కేసులను నమోదు చేశామని అధికారులు తెలిపారు. మల్లికార్జున్ పాస్‌పోర్టు వివరాలతోపాటు కేపీహెచ్‌బీలో ఏర్పాటు చేసిన సాఫ్ట్ ఇంటిగ్రేట్ మల్టీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహారాలకు సంబంధించి దాఖలు చేసిన పత్రాలను అందించాలని, మూడు బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన పత్రాలను ఇవ్వాలని పోలీసులు ఆయా అధికారులకు లేఖలు రాశారు. అదేవిధంగా గచ్చిబౌలిలోని సైబరాబాద్ సీపీ కార్యాలయంలో సీపీ సజ్జనార్‌ను కరక్కాయల బాధితులు కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు.

1166
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles