వాహనాల వేగానికి కళ్లెం

Thu,June 6, 2019 07:03 AM

guidelines to rto offices on vehicle speed controlling

హైదరాబాద్: వాహన వేగానికి కళ్లెం వేసేందుకు రంగం సిద్ధమైంది. నగరంలో తిరుగుతున్న కమర్షియల్ వెహికల్స్ వేగాన్ని నియంత్రించేందుకు అతి త్వరలో ఆర్‌టీవో కార్యాలయాలకు ఆదేశాలు అందనున్నాయి. ప్రమాదాలు తగ్గించాలని సుప్రీంకోర్టు చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా వీటిని అమలుచేయాలన్న నిర్ణయంతో గ్రేటర్ పరిధిలోకూడా స్పీడ్ గవర్నెన్స్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రవాణాశాఖ ఉన్నతాధికారులతో ఇటీవలే సమీక్షా సమావేశం నిర్వహించారు. 2009లో ఈ విధానం తెరపైకి తెచ్చినప్పటికీ దీనివల్ల నష్టం ఉందని ట్రక్కు డ్రైవర్లు కోర్టును ఆశ్రయించారు. స్పీడ్ నియంత్రిస్తే గమ్యస్థానాలకు తొందరగా చేరుకోలేక ఆపరేషన్స్‌లో నష్టం వస్తుందని దీనిని నిలిపివేయాలని కోర్టుకు విన్నవించారు. దీంతో నిర్ణయం అమలును నిలిపివేశారు. ఐతే ఇటీవల ఈ సమస్య పరిష్కారం కావడంతో కేంద్ర ఉపరితల రవాణాశాఖ నుండి అందిన ఆదేశాల మేరకు అమలుకు పూనుకున్నారు. జరుగుతున్న ప్రమాదాలను అరికట్టడమే లక్ష్యంగా తీసుకుంటున్న చర్యల వల్ల ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతున్నప్పటికీ ప్రభావం చూపబడే వర్గాల నుంచి వ్యతిరేకత వస్తున్నది.
కొత్త వాహనాల్లో కంపెనీ మేడ్ ఫిట్టింగ్..
ఈ గవర్నెన్స్‌లో భాగంగా కొత్త వాహనాల్లో ఉత్పత్తిదారులైన వాహన కంపెనీలే డైరెక్టుగా ఫిట్‌చేసి ఇస్తున్నాయి. కమర్షియల్ వాహనాలైన ట్రక్కులు, బస్సులు, ట్యాక్సీలకు కేవలం గంటకు 65 నుంచి 80 కిలోమీటర్ల వరకు మాత్రమే ప్రయాణించేలా స్పీడ్ గవర్నెన్స్ పరికరాన్ని బిగించి ఇస్తున్నారు. స్కూల్ బస్సు విషయానికి వస్తే కేవలం గంటకు 40 కిలోమీటర్లు మాత్రమే పరిమితి విధించారు. ఐతే కొత్తగా షోరూంల నుండి వస్తున్న వాహనాల విషయంలో ఇబ్బంది లేనప్పటికీ పాత వాహనాలకు పరికరం బిగించుకోవడంలో మీన మేషాలు లేక్కిస్తున్నారు. ఒక్కో పరికరాన్ని బిగించాలంటే 20 నుంచి 30 వేల రూపాయల వరకు ఖర్చు వస్తుండటంతో బిగించుకునేందుకు వాహనదారులు అనాసక్తి చూపుతున్నారు. ట్రక్కులు,ట్రావెల్స్ బస్సులు, ట్యాక్సీలు,గూడ్స్ వాహనాలైతే ఏకంగా గంటకు 120 నుంచి130 కిలోమీటర్ల వేగం తో ప్రయాణిస్తుండటం, ప్రమాదం జరిగినప్పుడు పెద్ద ఎత్తున మృత్యువాత పడుతుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దీనిని రాష్ట్రంలో అమలుచేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. స్పీడ్ గవర్నెన్స్ బిగించిన వాహనం ఎక్సిలేటర్‌ను ఎంత తొక్కినా వేగం పరిమితికి మించి స్పీడు అందుకోదు. ఐతే ఇందులో అంబులెన్స్‌లు, ఫైరింజన్ల వంటి అత్యవసరం సర్వీసులు మినహాయించారు. ఐతే వాహన ఉత్పత్తిదారులు కూడా స్పీడ్ గవర్నెన్స్ అమల్లోకి తెస్తే వాహనాల అమ్మకాలపై ప్రభావం పడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

2320
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles