అభివృద్ధి, సంక్షేమం దిశగా తెలంగాణ : గవర్నర్

Sat,January 19, 2019 12:31 PM

హైదరాబాద్ : ప్రజల ఆశీస్సులతో టీఆర్‌ఎస్ పార్టీ భారీ మెజార్టీ సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చింది. అభివృద్ధి, సంక్షేమం దిశగా ప్రభుత్వం పయనిస్తోంది అని గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోంది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అవినీతికి తావులేకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు అని తెలిపారు. తెలంగాణ రెండో శాసనసభలో గవర్నర్ నరసింహన్ ఉభయసభలను ఉద్దేశించి ఇవాళ ప్రసంగించారు.


గవర్నర్ ప్రసంగం.. నూతనంగా ఎన్నికైన సభ్యులందరికీ శుభాకాంక్షలు. ఎన్నికల అనంతరం తెలంగాణ రాష్ట్ర ఉభయసభల మొదటి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడం ఎంతో ఆనందంగా ఉంది. విద్యుత్ కోతలను అధిగమించి ప్రభుత్వం తొలి విజయం సాధించింది. పారిశ్రామిక, ఐటీ రంగంలో పారదర్శక విధానాలు అమలవుతున్నాయి. సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఐటీ రంగం అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. జీఎస్టీ వసూళ్లలోనూ తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది.

2019 మార్చి నాటికి మిషన్ భగీరథ పథకం పూర్తవుతుంది. ఇప్పటికే మిషన్ భగీరథ ద్వారా అన్ని గ్రామాలకు, ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీరు అందిస్తున్నాం. ఇటీవలే సీతారామ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు సాధించడం సంతోషదాయకం. పాలమూరు - రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మిషన్ కాకతీయ ద్వారా సాగునీటితో పాటు భూగర్భ జలాలు పెరిగాయి.
సాగుకు నిరంతర విద్యుత్‌తో రైతుల కష్టాలు తొలగినాయి. ఒకప్పుడు విద్యుత్ కోసం రాష్ట్రంలో ఉద్ధృతంగా ధర్నాలు జరిగేవి. 42 నెలల్లోనే 800 మెగావాట్ల కేటీపీఎస్ ప్రాజెక్టు పూర్తి చేశాం. సౌర విద్యుత్ ఉత్పత్తిలో నేడు తెలంగాణ.. దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. పెరుగుతున్న విద్యుత్ వినియోగం అభివృద్ధి సూచికగా నిలుస్తుంది. త్వరలోనే తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలబడుతుంది. వ్యవసాయానికి, పరిశ్రమలకు సరిపడా కరెంట్ అందుతోంది.

రైతులకు పెట్టుబడి సాయంగా రైతుబంధు పథకం ప్రవేశపెట్టడం సంతోషదాయకం. ఈ పథకాన్ని దేశంలోని ఆర్థికవేత్తలు, వ్యవసాయవేత్తలు ప్రశంసించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రైతుబంధు కింద ఎకరాకు రూ. 10 వేల చొప్పున ఇవ్వబోతున్నాం. రైతుబంధు పథకంతో రైతులందరూ సంతోషంగా ఉన్నారు. తెలంగాణ ప్రారంభించిన రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు దేశంలోని పలు రాష్ర్టాలు రైతుబంధు పథకం అమలు చేసే దిశగా ముందుకెళ్తున్నాయి. రూపాయి ఖర్చు లేకుండా రైతులకు కొత్త పాసుపుస్తకాలు అందించాం. రైతు సమస్యలపై చర్చల కోసం రైతు వేదికలు నిర్మిస్తున్నాం. రైతుబీమా ద్వారా చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకుంటున్నాం.

చిన్నాభిన్నమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోంది. ధ్వంసమైన కులవృత్తులు మళ్లీ జీవనం పోసుకుంటున్నాయి. చేనేత కార్మికులను ఆదుకోవడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ప్రభుత్వ అవసరాల కోసం చేనేత కార్మికుల నుంచి భారీ ఎత్తున వస్ర్తాలు కొనుగోలు చేస్తున్నాం. వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. గద్వాలలో కూడా టెక్స్‌టైల్ హబ్ నిర్మించే యోచనలో ఉన్నాం. కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగా గురుకులాలు ప్రారంభించాం.

వచ్చే విద్యాసంవత్సరంలో మరో 119 గురుకులాలు ఏర్పాటు చేయనున్నాం. ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తున్నాం. డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధాల కోసం వచ్చే బడ్జెట్‌లో నిధులు మరిన్ని పెంచుతున్నాం. ప్రజల చెంతకే వైద్య సేవల కోసం బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నాం. ఉచిత వైద్య పరీక్షల కోసం తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేశాం. త్వరలోనే సూర్యాపేటలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తాం.

ప్రసూతి, శిశు మరణాలు తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. కేసీఆర్ కిట్‌లో శిశువు, తల్లి కోసం రూ. 2 వేల విలువ చేసే 16 రకాల వస్తువులు ఇస్తున్నాం. కంటి వెలుగు శిబిరాల్లో వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ పథకం కింద ప్రజలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు పంపిణీ చేశాం. త్వరలోనే ఈఎన్టీ శిబిరాలను గ్రామాల్లో ఏర్పాటు చేస్తాం. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి గిరిజనుల కలలు సాకారం చేశాం.

పరిపాలన, శాంతిభద్రతల విషయంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ప్రభుత్వ పాదర్శకత వల్ల రాష్ర్టానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పటికే కొత్తగా 4 వేల పరిశ్రమలకు అనుతులు ఇచ్చాం. ప్రపంప ప్రఖ్యాతిగాంచిన ఐటీ పరిశ్రమలు హైదరాబాద్‌కు వచ్చాయి. దేశానికే ఆదర్శంగా నిలిచేలా డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మిస్తున్నాం. స్థలం ఉండి డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి ఆర్థికంగా సాయం చేస్తాం.

దేశానికే ఆదర్శంగా నిలిచేలా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మిస్తున్నాం. స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా జోన్ల సంఖ్య, రిజర్వేషన్లు పెంచాం. ఆసరా పెన్షన్లు పెంచబోతున్నాం. ఎన్నికల్లో సాధించిన విజయాన్ని పునాదిగా చేసుకొని తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగు నింపి వారికి ఆనందం, సంపద కలిగేలా బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా నా ప్రభుత్వం పునరంకితం అవుతుందని ధృఢ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను అని గవర్నర్ నరసింహన్ తెలిపారు.

1607
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles