కంప్యూటర్లకు బానిసలు కాకండి.. మేధస్సుకు పదును పెట్టండి: గవర్నర్

Fri,January 12, 2018 09:00 PM

governor and ministers attends sadaran india 2018 science fair ending ceremony in hyderabad

హైదరాబాద్: కంప్యూటర్లకు బానిసలు కాకుండా.. మేధస్సుకు పదును పెట్టాలని తెలుగు రాష్ర్టాల గవర్నర్ నరసింహన్ ఉద్ఘాటించారు. నగరంలో జరుగుతున్న సదరన్ ఇండియా -2018 సైన్స్ ఫెయిర్ ముగింపు ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సాయన్న హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు వీరు నగదు అవార్డులు, మెరిట్ సర్టిఫికెట్లు ఇచ్చి సత్కరించారు. సదరన్ సైన్స్ ఫెయిర్‌లో విద్యార్థులు రూపొందించిన సైన్స్ ఎగ్జిబిషన్‌ను గవర్నర్, డిప్యూటీ సీఎం పరిశీలించి వారు తయారు చేసిన ఎగ్జిబిట్స్ గురించి అడిగి తెలుసుకున్నారు.

వారిలో ఇప్పటి నుంచే ఆవిష్కరణలు చేయాలన్న తపన, ఆలోచనను చూసి అభినందించారు. భవిష్యత్‌లో ప్రపంచం గర్వించే గొప్ప వ్యక్తులుగా ఎదగాలని ప్రోత్సహించారు. ఐదు రోజుల సైన్స్ ఫెయిర్‌లో విద్యార్థుల కోసం చేసిన ఏర్పాట్ల గురించి విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య డిప్యూటీ సీఎంకు వివరించారు.

ఈ సైన్స్ ఫెయిర్‌లో వివిధ రంగాల్లో నిష్ణాతులైన శాస్త్రవేత్తలను పిలిపించి విద్యార్థులను వారితో మాట్లాడించామన్నారు. విద్యార్థులు తమకున్న సందేహాలను శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో గవర్నర్ నరసింహన్, మంత్రి కడియం మాట్లాడారు.

సమావేశం తర్వాత విద్యార్థులకు గవర్నర్, మంత్రి కడియం, మంత్రి నాయిని అవార్డులు అందజేశారు. 299 ప్రదర్శనలకు సంబంధించిన వివరాలను పొందుపర్చి విద్యాశాఖ ముద్రించిన పుస్తకాన్ని వాళ్లు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ డైరెక్టర్ కిషన్, విద్యా శాఖ అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.

భారతదేశ భవిష్యత్ మీరే.. ఇక్కడి విద్యార్థుల ప్రతిభను చూసి గర్విస్తున్నాను... మీ మేధస్సును మీ పరిసరాల్లోనే పైలట్ ప్రాజెక్ట్ రూపంలో చేయండి.. టీ హబ్ మీలాంటి ప్రతిభావంతులకు వేదికగా ఉంది.. మీరూ మంచి ఐడియాలతో టీహబ్‌కు రండి... భారతదేశం శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాలకు పుట్టినిల్లు... మీ చుట్టూ ఉన్న సమస్యలను సైన్స్ ద్వారా మీరే పరిష్కరించాలి... పాఠశాలలకు వెళ్లడం మానొద్దు.. విద్యను కొనసాగించాలి... విద్య ద్వారానే సంపూర్ణత్వం సాధించగలం... గొప్ప ఆవిష్కరణలు చేయడానికి భారతదేశంలో అన్ని వసతులు ఉన్నాయి... ఉపాధ్యాయులు పిల్లల్లో ప్రశ్నించి నేర్చుకునే తత్వాన్ని పెంపొందించాలి... ప్రతి విద్యార్థి వారి చుట్టూ ఉన్న వారికి రోల్ మోడల్ కావాలి... భారతీయులుగా ఉన్నందుకు గర్వించండి.. పెద్దలను గౌరవించండి... ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు విద్య పట్ల చాలా శ్రద్ధ వహించి ప్రభుత్వ పాఠశాలలను పటిష్ఠం చేస్తున్నారు.. తెలంగాణలో నాణ్యమైన విద్య అందుతున్నది... గవర్నర్ నరసింహన్

పూర్వ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ మీకు స్ఫూర్తి కావాలి... కలాం చెప్పిన కలలు కనండి.. సాకారం చేసుకోండి.. ఈ విషయాలను మీరు రోజూ గుర్తుంచుకోవాలి... దేశం గర్వించే శాస్త్రవేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లుగా మీరు కావాలి.. రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందించే ప్రయత్నం చేస్తున్నాం... ముఖ్యమంత్ర కేసీఆర్ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని గత మూడేండ్లలో రాష్ట్రంలో 544 గురుకులాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో గురుకులాలతో పాటు 475 కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలు, 196 మోడల్ స్కూల్స్ కూడా ఉన్నాయి... వీటి ద్వారా దాదాపు 8 లక్షల మంది విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందుతున్నారు.. గవర్నర్ నరసింహన్ గారికి విద్య అన్నా విద్యార్థులు అన్నా చాలా ఆసక్తి...రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను ఏవిధంగా పటిష్ఠం చేస్తున్నారో ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటారు.. రాజ్ భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 160 మంది ఉండే విద్యార్థుల సంఖ్య గవర్నర్ నరసింహన్ గారి చొరవతో 1200కు పెరిగింది. గవర్నర్ గారి చొరవ వల్ల రాజ్ భవన్ స్కూల్‌లో అన్ని వసతులు సమకూరాయి. ప్రస్తుతం ఆ స్కూల్ తమ వద్ద సీట్లు లేవని బోర్డు పెట్టే స్థాయికి చేరుకున్నది... డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి

2020
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS