ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి

Sat,November 17, 2018 10:46 PM

Government officer caught red handed while taking bribe in khammam dist

రూ.10వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
జిల్లా అధికారితో సహా లైసెన్స్‌డ్ మెకానిక్ అరెస్ట్

ఖమ్మం: ప్రభుత్వ ఉద్యోగం ద్వారా వచ్చే అసలు జీతం కంటే లంచంతో వచ్చే కొసరుకే ఆశపడుతుంటారు కొందరు అవినీతి అధికారులు. ఈ జాబితాలోకి చేరాడు ఖమ్మం జిల్లా తూనికలు, కొలతలు శాఖ జిల్లా అధికారి గూడురు అశోక్‌బాబు. లైసెన్స్‌డ్ మెకానిక్ ఏకాంబ్రం శ్రీకాంత్ ద్వారా లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. ఏసీబీ డీఎస్పీ సాతులూరి క్రిష్ణప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం నగరానికి చెందిన సిద్దారెడ్డి అనే వ్యక్తి ఎస్‌ఎస్ వేబ్రిడ్జి పేరుతో వరంగల్ క్రాస్‌రోడ్డులో లారీ కాంటాను నడుపుతున్నాడు.

ఈ క్రమంలో ఆగస్టు నెల 21వ తేదీన వేబ్రిడ్జి లైసెన్స్ గడువు ముగుస్తుండగా, ఆగస్టు 7వ తేదీన లైసెన్స్‌ను పునరుద్ధరించాలని జిల్లా తూనికలు, కొలతలు శాఖాధికారి అశోక్‌బాబును కలిసి కోరాడు. అందుకు ప్రైవేటు వ్యక్తి అయిన తూనికలు, కొలతల శాఖ లైసెన్స్‌డ్ మెకానిక్ ఏకాంబ్రం శ్రీకాంత్‌ను కలవాలని అశోక్‌బాబు సిద్దారెడ్డికి సూచించాడు. ఎస్‌ఎస్ వేబ్రిడ్జీ యజమాని సిద్దారెడ్డి శ్రీకాంత్‌ను కలవగా అతను లైసెన్స్ రెన్యూవల్ ఫీజు రూ.3750తో పాటు లంచంగా రూ.10వేలు ఇవ్వాలని తెలిపాడు.

దీంతో వేబ్రిడ్జి యజమాని సిద్దారెడ్డి అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు పూర్తి అధారాలు సేకరించిన అనంతరం తన వేబ్రిడ్జి వద్ద లైసెన్స్‌డ్ మెకానిక్ ఏకాంబ్రం శ్రీకాంత్‌కు శనివారం సాయంత్రం రూ. 13750లు ఇస్తుండగా అక్కడే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా శ్రీకాంత్‌ను పట్టుకున్నారు. అనంతరం గాంధీచౌక్‌లో ఉన్న తూనికలు, కొలతల శాఖ జిల్లా కార్యాలయానికి తరలించారు. అక్కడిని నుండి లంచం డబ్బులు తీసుకున్న లైసెన్స్‌డ్ మెకానిక్ ఏకాంబ్రం శ్రీకాంత్‌ను, జిల్లా తూనికలు,కొలతలు అధికారి గూడురు అశోక్‌బాబును అరెస్ట్ చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టుకు తరలించనున్నట్లు డీఎస్పీ క్రిష్ణప్రసాద్ తెలిపారు.

1599
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles