అదిగదిగో భద్రగిరి

Sat,July 11, 2015 11:40 AM

Godavari Pushkaralu at Bhadrachalam

భద్రాచలం : భక్తులకు వరాలను ప్రసాదించే శ్రీరా మచం ద్రస్వామి.. పాపాలను పునీతం చేసే గౌతమీ ఇలా రెండు ఒకే చోట ఉండటం భద్రగిరి ప్రత్యేకత. దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి దర్శనం కలగదు. గోదావరిలో నదిలో మూడు మునకలేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మిక. పుణ్యఫలం లభిస్తుం దని ప్రగాఢ విశ్వాసం. వేదంలా ఘోషించే పావన గౌతమీ భక్తులకు పరిశుద్ధం చేస్తుం దని భావన. భద్రాద్రి పుణ్యక్షేత్రంలో పుష్కరాల వేళ ఆచరించే స్నాన, దాన, తపో యాజ్ఞాలతో కోటిరేట్ల ఫలితాలు ఇస్తాయని భక్తుల నమ్మకం. గోదారి పుష్కర వేళ రాములోరి నేల భక్తులతో కిటకిటలాడనుంది.

భద్రుని కోవెలకు ఎంతో విశిష్టత...


Godavari Pushkaralu at Bhadrachalam

భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో భద్రుని కోవెలకు చాలా విశిష్టత ఉంది. భద్రమహర్షి తపస్సు చేసిన చోటు ఇదేనని చెబుతారు. భద్రమహర్షి శ్రీరాముని అనుగ్రహంతో తాను ఒక కొండ గా మారగా, ఆ కొండ శిఖరభాగంపై శ్రీరాముడు తన పాదముద్రను ఉంచిన పవిత్ర ప్రదేశం కూడా ఇదేనని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ శ్రీరాములవారు భద్రుని శిరస్సుపై పాదాలు మోపిన భాగాన్ని శిరస్థానమని, స్వామి ఉన్నది హృదయస్థానమని, రాజగోపురం (గాలిగోపురం) పాదస్థానమని భక్తులు విశ్వసిస్తారు. ఏనాటి భద్రుని వరమో కానీ, ప్రస్తుతం ఆభద్రుని శిరస్సు, రాములవారి పాదాలకే అభిషేకం జరుపు తున్నారు. భక్తులు భద్రుని శిరస్సు పూర్తిగా తెలుసుకునేందుకు ఆ శిరస్సుకు ప్రతి నిత్యం అభిషేకం, తిరువణికాపు (నామం) ధరింపచేసి భక్తులను తరింప జేస్తారు. దండకారణ్యంలో పర్యటిస్తున్న శ్రీరాముడు భద్రుని కోరిక మేరకు దర్శనమిచ్చారని బ్రహ్మపురాణం చెబుతోంది. వైకుంఠ రాముడు రావణవధ అనంతరం వైకుంఠానికి చేరినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. పోతన భాగవతంలో సిరికిన్ చెప్పుడు అన్నవిధంగా, శ్రీరాముడు భద్రుని తపస్సు ఫలితంగా బయలుదేరి, శంఖుచక్రాలతో వైకుంఠం నుంచి వచ్చినట్లుగా పేర్కొంటారు.
అందుకే వైకుంఠ రామునిగా.. శంఖు చక్రాలతో నారాయణునిగా.. ధనుర్భాణాలతో శ్రీరామునిగా వెరసి శ్రీరామనారా యణునిగా భద్రాద్రి కీర్తినందుకున్నారు. ఇదే విషయాన్ని భక్త రామదాసు కూడా తన దాశరథి శతకంలో శ్రీయుత జానకీ రమణ చిన్మయ రూపమేష రామనారాయణ అంటూ కీర్తించాడు. భక్తులు స్వామిని దర్శించేటప్పుడు నిశిత దృష్టితో పరిశీలిస్తే తప్ప, పూర్తి రామదర్శనం కాదు. శ్రీమహావిష్ణువు రామునిగా, లక్ష్మీదేవి సీతగా, శేషుడు లక్ష్మణునిగా, శంఖుచక్రాలు భరత, శత్రుఘ్నలుగా అవరాతిక మార్పుతో కనిపిస్తాయి. ఇక్కడ వామంకస్తితజానకి అనే పద్యరీత్యా స్వామి పద్మాసనంగా, అమ్మవారు ఎడమతొడ మీద కూర్చొని, లక్ష్మణుడు నిల్చొని దర్శనమిస్తారు.

శ్రీరంగం ఆలయ వ్యవస్థ...


Godavari Pushkaralu at Bhadrachalam

భక్త రామదాసుగా కీర్తిపొందిన కంచర్లగోపన్న అకుంఠిత భక్తికి నిదర్శనంగా రూపుదిద్దుకున్న ప్రసిద్ధ రామక్షేత్రం భద్రాచలం. శ్రీ రఘునాథ్ భట్టార్ ఆచార్యుల ద్వారా తారకమంత్రోపదేశాన్ని పొంది, శ్రీరామ సాక్షాత్కారం పొందిన భక్తగ్రేసరుడు రామదాసు. శ్రీరంగంలో జరిగే ఉత్సవాల ఆచార వ్యవహారాలను భద్రాద్రిలో ఏర్పాటు చేయాలనే సంకల్పంతో పాంచరాత్రాగమ సిద్ధాంతాలు తెలిసిన ఐదు కుటుంబాలను శ్రీరంగం నుంచి ఇక్కడికి తీసుకొచ్చి శ్రీరంగం ఆలయ వ్యవస్థను యథాతథంగా ఇక్కడ స్థాపించారు. శ్రీరంగనాథుడు ఇక్షాకుల వంశ కులదైవం కావడం వల్ల శ్రీరామచంద్రుడు శ్రీరంగనాథున్ని ఆరా ధించినట్లుగా వాల్మీకి రామాయణంలోనే కాకుండా అనేక గ్రంథాల్లో కూడా ఉండటం వల్ల ఈ రామక్షేత్రానికి శ్రీరంగం ఆదర్శంగా మారింది. దీంతో ఎత్తయిన కొండమీద శ్రీరంగంలో వలే దక్షిణాభిముఖంగా శ్రీరంగనాథున్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆ కొండను ఇప్పటికీ రంగనాయకులగుట్టగానే పిలుస్తారు. శ్రీరంగంలో ఏటా జరిగే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను ఇక్కడ కూడా శ్రీరామదాసు ఏర్పాటు చేశారు.
ఆగమ సిద్ధాంతం ప్రకారం శ్రీరంగంలోవలే భద్రాచలంలో కూడా లక్ష్మీతాయారు సన్నిధిని ఏర్పాటు చేశారు. శ్రీ వైష్ణవ సిద్ధాంతానికి మూల సూత్రమైన భక్తిమార్గానికి ఈ క్షేత్రాన్ని వేదికగా చేసి ఇక్కడ భజన సిద్ధాంతాన్ని ప్రారంభించారు. ఈ భజన సిద్ధాంతమే లక్ష్యంగా తెలుగునాట ఊరూరా రామాలయాలు, భజన సంఘాలు ఏర్పడటానికి కారణం. శ్రీరామవమినాడు జరిగే శ్రీ సీతారాముల కల్యాణం కూడా భద్రాద్రి ఆదర్శంతోనే ఊరూరా నెలకొంది. భద్రాద్రి రాముడు స్వయంబూ కావడం వల్ల రాముని అవతారం రోజు శ్రీరాముని కల్యాణం చేయాలని ఆ నాడు పండితులు నిర్ణయించారు. యస్సావతార సమయ: తాస్య కల్యాణ మాచరేత్ అంటే దేవుని అవతారం రోజునే ఆ దేవుని కల్యాణం చేయాలని పంచరాత్రాగమ సంప్రదాయాన్ని అనుసరించి భద్రాద్రిలో అనాదిగా శ్రీరామనవమి పునర్వసు నక్షత్రం నాడు అభిజి త్‌లగ్నంలో శ్రీ సీతారాముల కల్యాణం జరుగుతోంది. లోకకల్యాణార్థం ఏటా భద్రాచలంలో నిర్వహించే శ్రీ సీతారాముల కల్యాణం తిలకించే భక్తులు సుఖ సంతోషాలతో ధన్యులు కాగలరని బ్రహ్మపురాణం చెబుతోంది.

యోగానంద లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం...


గోదావరి నుంచి రామాల యానికి వెళ్లే మార్గంలో శ్రీ యోగానంద లక్ష్మీ నర్సింహస్వామి దేవాలయం ఉంది. భద్రాచలం యోగానంద లక్ష్మీనర్సింహుడు మానవనిర్మితుడు కాడు. మహర్షి ప్రతిష్టుడు. దైవలోక నిర్మితుడు. ఈ నర్సింహస్వామి ధృవమూర్తి ఇక్కడ లభ్యం కావ డమే అద్భుతానికి సాక్షి భూతంగా నిలిచింది.

గోవింద స్వామి మఠం...


ఈ మఠం గోదావరి తీరాన కల్యాణ మండపానికి ఎదురుగా ఉంది. ఇక్కడ సాధువులు నివసించేవారు. కావునా సాధువుల మఠం అని కూడా అనేవారు. గోవిందస్వామి అనే యోగి పుంగవుడు, రామభక్తుడు జీవసమాధిని పొందిన పవిత్రస్థలం ఈ మఠంలో ఉంది.

కల్యాణ మండపం...


ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి సీతారాముల కల్యాణ మహోత్సవం మహావైభవంగా జరుగుతోంది. లక్షలాది భక్తులు కన్నుల పండువగా దర్శిస్తారు. ఈ కల్యాణ మండపం అద్భుత శిల్పకళాఖండం. అపురూప కమనీయ దృశ్యం. ఇది రామాలయం సమీపంలోనే ఉంది.

వైకుంఠ ద్వారం....


ఆలయ ఉత్తర గోపురం నుంచి కిందకు మెట్లు ఉన్నాయి. అక్కడ ఉత్తర వైకుంఠ ద్వారం ఉంది. 1974వ సంవత్సరంలో ఈ ద్వారం ఏర్పాటు చేశారు. లక్షలాది మంది భక్తులు దర్శించడానికి వీలుగా ద్వారానికి ఎదురుగా విశాలమైన కల్యాణ మండప ప్రాంగణం ఉంది. ప్రతీఏటా వైకుంఠ ఏకాదశినాడు వైకుంఠ రాము డు గరుడవాహనరూరుడై అశేషభక్తికోటికి దర్శనమిస్తాడు.

మిథిలా స్టేడియం...


వైకుంఠ ద్వారానికి అభిముఖంగా మిథిలానగరం (స్టేడియం) ఉంది. వేలాది మంది భక్తులు సీతారాముల కల్యాణం వీక్షించడానికి వీలుగా రూ. 38లక్షల వ్యయంతో ఈ స్టేడియ నిర్మాణం జరిగింది. ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు దీనికి శంకుస్థాపన చేశారు.

శివాలయం...


రామాలయానికి దక్షిణంగా రంగనాయకుల గుట్ట కింద అతి ప్రాచీనమైన శివాలయం ఉంది. రామునిపేరుతో రామలింగేశ్వరస్వామిగా ప్రసిద్ధికె క్కిన ఈ శివమూర్తి యాత్రికులకు దర్శనీయులు. కుసుమ హరినాథబాబా మందిరం.. ఇది కొండమీద ఉంది....శివాలయం నుంచి పైకి మెట్లు ఉన్నాయి. ఆ మందిరంలో కుసుమ కుమారి, హరినాథబాబాల పాలరాతి విగ్రహాల ఉన్నాయి.

రంగనాయక స్వామి ఆలయం...


హరినాథబాబా మందిరం నుంచి మెట్లు ఎక్కి పైకి వెళ్తే రంగనాయక స్వామి దేవాలయం కనపడుతుంది. రంగనాథుడు శేష పర్యం కంపై పవళించి ఉంటాడు. ఇది కూడా రామాలయ పరిధిలోనేదే. ప్రతీ ఏటా కల్యా ణోత్సవాలు, తిరువీధిసేవలు జరిపిస్తారు.

దాసాంజనేయస్వామి...


తాతగుడికి అభిముఖంగా దాసాంజనేయస్వామి ఆలయం ఉంది. శ్రీ సీతారామలక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుడు తిరువీధిసేవకు వేంచేయునప్పుడు, తిరిగి వెళ్లేటప్పుడు తనివితీరా దర్శించుకుంటాడు దాసాంజనే యుడు. ప్రతీ మంగళవారం అనేక మంది భక్తులు ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తుంటారు.

అభయాంజనేయ దేవాలయం


గోదావరి వంతెన దాటగానే రామభక్తులకు అభయాంజనేయస్వామి స్వాగతం పలుకుతుంటాడు. మరో పక్క అయ్యప్పస్వామి ఆలయం కూడా ఉంది.

అభయాంజనేయస్వామి పార్కు..


భద్రాచలం బ్రిడ్జి దాటగానే అక్కడ నిలువెత్తు ఆంజనేయస్వామి భద్రాచలం యాత్రికులకు వచ్చేవారికి ఆహ్వానం పలుకుతున్నట్లు కనిపిస్తుంది. ఈ పార్కునే అభయాంజనేయస్వామి పార్కు అని పిలుస్తారు. ఇక్కడ పిల్లలు...పెద్దలు ఎంతో ఉత్సాహంగా గడుపుతారు.

ఇతర దేవాలయాలు....


పట్టణంలో ఇంకా అనేక దేవాలయాలు కలవు. వెంకటేశ్వర కాలనీలో వేంకటేశ్వర ఆలయం ఉంది. ఇంకా కోదండరామాలయం, గాయత్రి ఆలయం, సాయిబాబా ఆలయం, శివానందస్వామి మందిరం, రాజరాజేశ్వ రదేవాలయం, కనకదుర్గ ఆలయం, ఈశ్వరమ్మ ఆలయం భద్రాద్రి పురవీధుల్లో కనిపిస్తాయి.
రామాయణ రసరమ్య సన్నివేశాల ప్రాంతం

పవిత్ర పావన గోదావరి...


భద్రాద్రి రామునికి పావన గౌతమి భద్రాచలాన్ని పుణ్యక్షేత్రంగానేకాక, పుణ్య తీర్థంగా విలసిల్లజేస్తుంది. గోదావరి తీరాన అందమైన సోపానాలు, సోపానాల మధ్య శుభప్రదాత గోదావరిమాత దర్శనమిస్తుంది. మరి కొన్ని మెట్లు పైకెక్కితే ఆంజనేయస్వామి ఆశీర్వదిస్తూ కనిపిస్తాడు. ఆపైన వల్లి సుబ్రహ్మ ణ్యేశ్వర ఆలయం-అశ్వస్తవృక్షం పవిత్ర భావనను కలిగిస్తాయి. గోదావరిలో పవిత్ర స్నానం చేసిన ప్రతీవారు అశ్వస్తవృక్షానికి ప్రదక్షిణ, నమస్కారాలు చేస్తుంటారు.

కరకట్టతో శోభయమానంగా....


భద్రగిరి కంఠహారంగా గోదావరి కరకట్ట విరాజిల్లుతోంది. రూ.17 కోట్ల వ్యయంతో 1999లో నిర్మించిన ఈ కరకట్టతో రామాలయానికి వరద ముంపు నుంచి విముక్తి లభించింది. గతంలో ప్రతీ వర్షాకాలం ఆలయ పరిసరాలు వరద నీటిలో తేలిఆడేవి. కరకట్ట నిర్మాణం పూర్తయ్యాక స్నానఘట్టాల నిర్మాణం చేయడంతో భక్తులకు ఊరట కలిగింది. ఇది రామాలయ అభివృద్ధిలో కీలకమలుపుగా చెప్పవచ్చు. బాపు గీసిన బొమ్మల ఆధారంగా రామాయణశిల్ప కావ్యాన్ని కరకట్టపై ఏర్పాటు చేశారు. గోదావరి బ్రిడ్జి సెంటర్‌లో దిగిన భక్తులు కాలినడకన ఆలయానికి చేరుకునేలోపు రామాయణం మొత్తం బొమ్మల రూపంలో అవగాహన ఏర్పడుతుంది.

అంబాసత్రం..


రామాలయం ముందర నాలుగైదు మెట్లు దిగి దక్షిణంవైపు దిగితే అంబాసత్రం ఉంటుంది. పమిడి గంటం వెంకటరమణయ్య అనే మహనీయుడు అన్నపూర్ణాదేవిని ప్రతిష్ఠించి అన్నదాన సత్రం నిర్వహించాడు. తూము నర్సింహ దాసుగారు ఆరాధించిన శ్రీ సీతారామలక్ష్మణుల దివ్యమూర్తులను ఇక్కడ దర్శింవచ్చు.

గోవిందరాజ స్వామి ఆలయం...


రాజవీధిలో విశ్రాంతి మండపం నుంచి కొంత దూరం వెళితే గోవిందరాజస్వామి దేవాలయం కనిపిస్తుంది. భద్రాద్రి రాముడు సీతాలక్ష్మణ సమేతుడై తిరువీధిసేవకు బయలుదేరి ఊరేగింపుగా వస్తూ.. దారిపొ డవునా హారతులు అందుకుంటూ ఈ గోవిందరాజస్వామి ఆలయంలో కొద్దిసేపు విశ్రమిస్తాడు.

రామదాసు ధ్యాన మందిరం...


రంగనాయకస్వామి గుట్టపై రామదాసు స్మృతి చిహ్నంగా రామదాసు ధ్యాన మందిరం నిర్మించారు. రామదాసు శిలావిగ్రహం ద్వారంలో దర్శనమిస్తుంది. విశాలమైన ధ్యాన మందిరం ఒక అపురూప కట్టడం. మందిరపు గోడలన్నీ రామదాసు కీర్తనలు, దాశరథి శతకాలతో చెక్కబడిన శిలా ఫలకాలతో నిండిఉన్నాయి. భద్రాద్రి పురవీశేషాల్లో ఇది తప్పక దర్శించవల్సిన కట్ట డం. ఈ ప్రదేశంలోనే కుటీరం నిర్మించుకోని రామదాసు శేషజీవితాన్ని గడిపినట్లు ప్రచారం.

3112
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles