క్లిష్టమైనప్పటికీ.. సులువుగా చేసేశారు

Sun,June 16, 2019 06:53 AM

Gandhi hospital Doctors do rare operation

సికింద్రాబాద్ : సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖానలో శనివారం అరుదైన శస్త్ర చికిత్స చేశారు. ఓ మహిళ చేతి నరాలు, రక్త నాళాల మధ్య ఉన్న ప్రమాదకరమైన కణితిని తొలగించారు. గాంధీ దవాఖాన జనరల్ మెడిసిన్ విభాగం నాలుగవ యూనిట్ ప్రొఫెసర్ డాక్టర్ సద్గుణ చారి, అసోసియేట్ డాక్టర్ పల్లం ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం... సిద్ధిపేట్‌కు చెందిన బాలవ్వ (55) గత ఐదేండ్లుగా కుడిచేతి ముంజేతి మడమపై ప్రమాదకరమైన కణితితో బాధపడుతున్నది. ఎన్నో దవాఖానలకు తిరిగినా అక్కడి డాక్టర్లు ససేమిరా ఆపరేషన్ చేయలేమన్నారు. పట్టణాల్లోని కార్పొరేట్, ప్రైవేట్ దవాఖానలు కూడా ముందుకు రాలేదు. నిజామాబాద్‌లోని ప్రభుత్వ దవాఖాన వైద్యులు శస్త్ర చేకిత్స చేసి కణితిని తొలగించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

దాంతో అక్కడి వైద్యులు సిఫారసు మేరకు రెండు రోజుల క్రితం బాలవ్వ సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖానలో చేరింది. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం శనివారం సుమారు గంట సమయం పాటు శ్రమించి ఈ అరుదైన ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు రోగి చేతి నరాలు, రక్త నాళాల నడుమ ప్రమాదకరమైన 10 సెంటిమీటర్ల వ్యాసార్థంలో ఉన్న కణితిని విజయవంతంగా తొలగించారు. ఈ సందర్భంగా డాక్టర్ రంగా అజ్మీరా మాట్లాడుతూ ఈ కణితిని న్యూరో ఫైబ్రోమా అంటారని, దీనిని ఒక సవాలుగా తీసుకొని రోగి నరాలకు, రక్త నాళాలకు ఎటువంటి ప్రమాదం జరుగకుండా కణితిని తొలగించామని వివరించారు. అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించిన వైద్యులు సద్గుణ చారి, పల్లం ప్రవీణ్, రంగా అజ్మీరా, అనస్థీషియా రాజు, పీజీ అనూషలను దవాఖాన అధికారులు అభినందించారు.

2723
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles