పైసా ఖర్చు లేకుండానే బోన్ క్యాన్సర్‌కు చికిత్స

Wed,April 20, 2016 07:07 AM

free Bone cancer treatment in MNJ Hospital Hyderabad

సర్కారు దవాఖాన అనగానే ప్రతి ఒక్కరిలో చిన్నచూపు. అక్కడికెళ్తే ప్రాణాలు నిలుస్తాయో లేదోననే ఆందోళన. కానీ, ఈ మధ్యకాలంలో ప్రభుత్వ వైద్యశాలలు కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా వైద్యసేవలు అందిస్తున్నాయి. కొన్ని కార్పొరేట్ వైద్యశాలల్లో రోగులను పీల్చి పిప్పి చేసి.. చివరకు చేతులెత్తేసి సర్కారు దవాఖానలకు రెఫర్ చేస్తుంటారు. ఆ పేషంట్లను సైతం ప్రభుత్వ ఆస్పత్రులు అక్కున చేర్చుకుని ప్రాణభిక్ష పెడుతున్నాయి. ఇలా సర్కారు దవాఖాన ల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని చెప్పడానికి ఉదాహరణగా నిలుస్తోంది ఎంఎన్‌జే క్యాన్సర్ వైద్యశాల. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు అందించే చికిత్స ఎంతో వ్యయంతో కూడుకున్నది. ఇలాంటి ఖరీదైన శస్త్రచికిత్సలను నగరంలోని ఎంఎన్‌జే ప్రాంతీయ క్యాన్సర్ దవాఖాన పైసా ఖర్చు లేకుండా నిర్వహిస్తోంది.

ప్రాస్థసిస్ పద్ధతి ద్వారా...
సాధారణంగా ఎముకకు క్యాన్సర్ సోకితే ఆ ఎముకతోపాటు క్యాన్సర్ కారకానికి గురైన అవయవాలను సైతం తొలగిస్తారు. అంతేకాకుండా ప్రభావిత శరీర భాగాలకు కీమో, రేడియేషన్ చికిత్సలు చేయడం వల్ల అవి కూడా దెబ్బతింటాయి. ఇది సాధారణంగా ఎముక క్యాన్సర్ రోగులకు జరిపే చికిత్స. దీనివల్ల రోగులు పలు దుష్ప్రభావాలకు గురికావడమే కాకుండా అవయవాలను కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలా ఎంతో మంది బాధితులు అవయవాలను కోల్పోయి అవిటితనంతో బాధపడుతున్నారు. రోగుల వ్యథపై పరిశోధనలు జరిపిన వైద్య శాస్త్రవేతలు ప్రాస్థసిస్ పద్ధతి ద్వారా లింబ్ కన్జర్వేషన్ సర్జరీ ఆధునిక వైద్య విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ విధానాన్ని మొట్టమొదట చెన్నైలోని అడయార్ క్యాన్సర్ ఆసుపత్రిలో ప్రయోగించారు. ఈ ఆసుపత్రి క్యాన్సర్ చికిత్సలకు దేశంలోనే పేరున్న దవాఖాన. ఆ తరువాత నగరంలోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో ప్రారంభించారు.

ఐదేళ్లలో 100 సర్జరీలు
ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో ఐదేళ్ల నుంచి ప్రాస్థసిస్ పద్ధతిలో లింబ్ కన్జర్వేషన్ సర్జరీలు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి డైరెక్టర్ డా. జయలత వివరించారు. అంకాలజీ విభాగం అధిపతి ప్రముఖ అంకాలజీ శస్త్రచికిత్స నిపుణులు డా.శ్రీనివాసులు ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. దేశంలో ఇలాంటి ఆధునిక పద్ధతిలో శస్త్రచికిత్సలు జరుపుతున్న ఆసుపత్రుల్లో చెన్నైలోని అడయార్ తర్వాత రెండోది ఎంఎన్‌జే ఆసుపత్రేనని అన్నారు. ఈ శస్త్రచికిత్స కార్పొరేట్ వైద్యశాలల్లో కూడా లేదని, ఒకటి రెండు ఆసుపత్రుల్లో ఉన్నా.. రూ. లక్షల్లో ఖర్చవుతుందన్నారు. ఎంఎన్‌జేలో మాత్రం పైసా ఖర్చు లేకుండా ఐదేళ్ల నుంచి ఇప్పటి వరకు 100 ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసినట్లు డైరెక్టర్ వివరించారు.

దశల వారీగా చికిత్స
అవయవాలను తొలగించకుండా చేసే శస్త్రచికిత్సను లింబ్ కన్జర్వేషన్ సర్జరీ అంటా రు. కాళ్లు, చేతులు, ఇతర భాగాల్లోని ఎ ముకకు క్యాన్సర్ సోకినప్పుడు కీమోథెరపీ ద్వారా ముందుగా వ్యాధి తీవ్రతను తగ్గిస్తారు. ఇది మొదటి దశ చికిత్స.దీనివల్ల వ్యాధి ఇతర భాగాలకు వ్యాపించదు. వ్యాధి తీవ్రత కూడా తగ్గుతుంది. ఉదాహరణకు ఓ కాలులోని ఎముకకు క్యాన్సర్ సోకితే.. వ్యాధి తీవ్రతను కీమోథెరపీతో తగ్గిస్తారు. ఫలితంగా వ్యాధి కాళ్లలోని ఎముకలో కొంత భాగానికే పరిమితమవుతుంది. ఎముకలోని ఏభాగంలో క్యాన్సర్ కారకం ఉంటుందో అంతభాగం మాత్రమే ఎముకను కట్ చేసి తొలగిస్తారు. తొలగించిన స్థానంలో ప్రత్యేక లోహంతో తయారు చేసిన రాడ్‌ను అమరుస్తారు. దీనివల్ల క్యాన్సర్‌కు గురైన కాలు చికిత్స తర్వాత యథావిధిగా పనిచేస్తుంది. ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. తొలగించిన ఎముకల స్థానంలో వినియోగించే రాడ్‌లను నగరంలోని మిధాని సంస్థలో తయారు చేయిస్తున్నాం. అధునాతన విధానంతో రోగులకు పునర్జజన్మ లభిస్తుంది.
- శ్రీనివాసులు, అంకాలజీ శస్త్రచికిత్సల విభాగం అధిపతి

3941
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles