గిఫ్ట్ వచ్చిందంటూ.. దోచేస్తున్నారు..

Thu,March 28, 2019 05:51 AM

fraud name of gift in hyderabad

హైదరాబాద్ : ఇప్పటి వరకు కొత్త కొత్త వెబ్‌సైట్ల పేర్లు చెప్పి దోచుకునే సైబర్ క్రిమినల్స్.. తాజాగా ఆన్‌లైన్ దిగ్గజం ఆమెజాన్ పేరుతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఇక్కడ అమాయకులే కాదు..ఉన్నత చదువులు చదివినవారు మోసపోతున్నారు. ఆమెజాన్ నుంచి చాలమంది ఆన్‌లైన్‌లో వివిధ రకాల వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. కొనుగోలు దారుల డేటాను సంపాదిస్తున్న సైబర్ నేరగాళ్లు... తరుచూ ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేవారు కాకుండా రెండు, మూడు నెలలకోసారి చేసేవారినే లక్ష్యంగా చేసుకుని ఫోన్‌లు, మెసేజ్‌లు పంపిస్తుంటారు. మీరు ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేయడంతో కంపెనీ నుంచి గిఫ్ట్ ఓచర్ వచ్చిందంటూ నమ్మిస్తారు. మేం పంపించే మెసేజ్‌లో ఉండే లింక్‌ను క్లిక్ చేస్తే.. మీకు గిఫ్ట్ ఓచర్స్‌తో కొనుగోలు చేసేందుకు ఉన్న వస్తువులు, వాటి ధరలు ఉంటాయంటూ సూచిస్తారు. ఆ లింక్ క్లిక్ చేయగానే ఫోన్లు, టీవీ లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఆఫర్‌లో ఉన్నట్లు ఆ పేజీలో సూచిస్తాయి.

ఆ పేజీలో వస్తువును సెలక్ట్ చేసుకోవాలని సూచిస్తారు. కొన్ని సందర్భాల్లో లింక్‌ను పంపించకుండా సెల్‌ఫోన్‌కు గిఫ్ట్ ఓచర్‌కు సంబంధించిన వస్తువుల వివరాలను మెసేజ్ పంపిస్తారు. ఆ గిఫ్ట్‌లు మీకు రావాలంటే తక్కువగా రూ. 5000 వేల విలువైన వస్తువులు కొనాలంటూ నిబంధన విధిస్తారు. గిఫ్ట్ సుమారు రూ. 50 వేలకుపైగానే ఉండడంతో రూ. 5 వేల విలువైన వస్తువులు కొనేందుకు బాధితులు ముందుకు వస్తారు. అయితే డబ్బును గూగుల్ పే ద్వారా చెల్లించాలంటూ సూచించి, గూగుల్ పే ఫోన్ నంబర్‌ను పంపిస్తారు. ఆ డబ్బు పంపించిన తరువాత మీ గిఫ్ట్ ఓచర్‌కు సంబంధించిన డబ్బు మీ ఖాతాలోకి వచ్చేస్తాయి.

అయితే దానికి జీఎస్టీ చెల్లించాలంటూ రూ. 11,999 ధర సూచిస్తూ చెల్లించాలని సూచిస్తారు. జాతీయ బ్యాంకులు కాకుండా, ప్రైవేట్ బ్యాంకులు అయితే ఇంకో రూ.10 ఎక్కువగా చెల్లించాలంటారు. ఇలా జీస్టీ డబ్బులు చెల్లించిన వెంటనే.. మీ డబ్బు క్రెడిట్ కాలేదు.. మరోసారి చెల్లించండి అంటారు. ఈ డబ్బులన్నీ మీ కు వస్తాయంటూ నమ్మిస్తారు. రెండోసారి చెల్లించగానే మరో వెబ్ లింక్‌ను పంపిస్తారు. అందులో బ్యాంకు వివరాలు పొందుపరచాలంటూ సూచిస్తారు. బ్యాంకు వివరాలు అందులో పొందుపరిచిన వెంటనే ఓటీపీ వస్తుందని, దానిని తమకు చెప్పాలంటూ సూచిస్తారు. ఓటీపీ చెప్పగానే ఆ బ్యాంకు ఖాతాల్లో నుంచి నగదును అపహరించేస్తుంటారు.

ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు..


* ప్రైవేట్ ఉద్యోగి ఓమర్ అహ్మద్ రూ. 1200తో ఆమెజాన్‌లో బ్లూటూత్ హెడ్‌సెట్ కొన్నాడు. నెల రోజుల తరువాత ఆమెజాన్ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ ఒకరు ఫోన్ చేశారు. మీకు గిఫ్ట్ వచ్చిందంటూ మాట్లాడుతూ.. ఆమెజాన్ గిఫ్ట్ ఓచర్‌కు మీ పేరు సెలెక్ట్ అయ్యిందంటూ నమ్మించారు. ఐదు ఛాన్స్‌లు ఉన్నాయి.. అందులో ఎదైనా ఒక గిఫ్ట్‌ను ఎంచుకోండంటూ సూచించా రు. దీంతో ఐ ఫోన్ 7ను బాధితుడు ఎంచుకున్నాడు. ఈ గిఫ్ట్ మీకు పంపించాలంటే కనీసం రూ. 5వేల షాపింగ్ చేయాలంటూ సూచిస్తూ ఒక లింక్‌ను పంపించా రు. అందులో వస్తువును సెలక్ట్ చేసుకున్న తరువాత ... ఆ డబ్బును గూగుల్ పే ద్వారా చెల్లించాడు. తరువాత మీరు కొన్న వస్తువు ట్యాక్స్ ఫ్రీ ప్రొడెక్ట్ కావడంతో జీస్టీ రూ.11,999 చెల్లించాలంటూ సూచించగా ఆ డబ్బును చెల్లించాడు. జీస్టీ డబ్బు రాలేదని, మరోసారి చెల్లించాలంటూ సూచించడంతో పాటు ప్రైవేట్ బ్యాంకుకు మరో రూ.10 అదనంగా చెల్లించాలని సూచించారు. మీరు చెల్లించే డబ్బంతా తిరిగి వాపస్ వచ్చేస్తుందంటూ మొత్తం రూ. 76 వేలు సైబర్ చీటర్లు కొట్టేశారు.

* ఓ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న అభినందన్ అనే వ్యక్తికి ఆమెజాన్.కామ్ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ గత నెలలో గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. మీకు రూ. 70 వేల విలువైన గిఫ్ట్ ఓచర్ వచ్చింది, అది తీసుకోవాలంటే రూ. 4 వేల విలువైన వస్తువును కొనుగోలు చేయాలంటూ నమ్మించారు. ఆ వస్తువును కొని, డబ్బును గూగుల్ పేతో చెల్లించిన అనంతరం, గిఫ్ట్ ఓచర్, కొన్న వస్తువు పంపించాలంటే జీస్టీ చెల్లించాలంటూ బోల్తా కొట్టించి రెండు దఫాలుగా రూ. 11,999 చొప్పున వసూలు చేశారు. ఇలా మొత్తం సుమారు రూ. 50 వేల వరకు వసూలు చేశారు.

1870
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles