అమెరికా ట్రేడింగ్ కంపెనీలో పెట్టుబడి పేరుతో మోసం

Mon,May 20, 2019 06:27 AM

fraud by name of America Trading Company in hyderabad

ఐదుగురు వ్యక్తులపై బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్ : అమెరికాకు చెందిన ట్రేడింగ్ కంపెనీలో పెట్టుబడి పెడితే ప్రతిరోజు డాలర్లతోపాటు ఏడాది తరువాత పెట్టిన పెట్టుబడి రెండింతలు వస్తుందని నమ్మించి లక్షలాది రూపాయలు మోసం చేసిన ఐదుగురు వ్యక్తులపై బోయిన్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రాజేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నందగిరి కోటాల గ్రామానికి చెందిన నాగమళ్ల వెంకటేశంతోపాటు కరీంనగర్ జిల్లాలోని ఇతర ప్రాంతాలకు చెందిన గర్దాస్ రమేశ్, సుదగోని సత్తయ్యగౌడ్, చందుపట్ల శ్రీనివాస్, కుంచాల హరిగౌడ్ ముఠాగా ఏర్పడ్డారు.

సులభంగా డబ్బు సంపాదించాలని పరిచయం ఉన్న వారిని కలిసి అమెరికాకు చెందిన ఓ ట్రేడింగ్ కంపెనీలో రూ.3 లక్షల 80వేలు పెట్టుబడి పెడితే ప్రతి రోజు 45 డాలర్ల చొప్పున 223 రోజులు కంపెనీ చెల్లిస్తుందని, ఏడాది తరువాత పెట్టిన పెట్టుబడికి రెండింతలు లాభం వస్తుందని నమ్మబలికారు. ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం నగరంలోని బోయిన్‌పల్లిలో ఉందని చెప్పారు. సంస్థకు సంబంధించిన సర్టిఫికెట్ కూడా వారికి చూపించారు. గతేడాది కరీంనగర్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో పలువురి వద్ద డబ్బులు వసూలు చేశారు.

అనంతరం ముఖం చాటేయడంతో బాధితులు బోయిన్‌పల్లిలో ఉన్నట్లు తెలుసుకుని ముఠా సభ్యులపై కరీంనగర్ జిల్లా మానకొండూరుకు చెందిన ప్రైవేట్ ఉద్యోగి వంగాల కరుణాకర్‌తో పాటు మరో 20 మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వివిధ సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. త్వరలో వీరిని అరెస్ట్ చేస్తామని, మోసం చేసిన ఐదుగురిపై ఇదివరకే సంగారెడ్డి, మియాపూర్, చిక్కడపల్లి, సిద్ధిపేటతోపాటు తదితర ప్రాంతాల్లో ఒక్కొక్కరిపై 8 నుంచి పది కేసులు నమోదైనట్లు సీఐ రాజేశ్ తెలిపారు.

753
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles