ఒకే కుటుంబం నుంచి నాలుగు సార్లు సర్పంచ్

Sun,January 20, 2019 09:00 PM

Four times sarpanch from a single family

గుడిహత్నూర్: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సోయంగూడ గ్రామానికి చెందిన సోయం బొజ్జు కుటుంబ సభ్యులు కొన్నేళ్లుగా గ్రామాన్ని పాలించారు. గతంలో ఉమ్రి(బి) గ్రామ సర్పంచ్‌గా సోయం బొజ్జు రెండుసార్లు పనిచేశారు. మహిళా రిజర్వేషన్ రావడంతో ఆయన భార్య సుగుణ బాయి 2013లో సర్పంచ్‌గా గెలుపొందారు. ప్రస్తుతం ఉమ్రి(బి) గ్రామం నుంచి సోయంగూడ విడిపోయి ప్రత్యేక గ్రామ పంచాయతీగా మారింది. దీంతో ఈ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సుగుణ బాయి మరోసారి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. సోయం బొజ్జు కుటుంబానికి రాజకీయ అనుభవం ఉండగా.. గ్రామంలోనూ మంచి పేరుంది.

ఆ పంచాయతీ ఎస్టీ మహిళకు రిజర్వు చేయడంతో గ్రామస్తులు ఎన్నికల జోలికి వెళ్లకుండా సోయంగూడ సర్పంచ్‌గా సోయం సుగుణబాయిని మరోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ పంచాయతీలో నున్న నలుగురు వార్డు సభ్యులైన వెడ్మారావు బాయి, సోయం తుర్పుబాయి, సోయం రాములు, వెర్మేత గణపతిని ఏకగ్రీవంగా ఎన్నుకొని గ్రామస్తులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉమ్రి(బి) పంచాయతీలో 2001లో సోయం బొజ్జు సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. మళ్లీ 2006లో రెండోసారి ఆయనకే సర్పంచ్‌గా పనిచేసే అవకాశం దక్కింది.

2013లో ఉమ్రి గ్రామ పంచాయతీని మహిళకు రిజర్వు చేయడంతో ఆయనకు అవకాశం లభించలేదు. దీంతో బొజ్జు తన భార్య సోయం సుగుణబాయిని సర్పంచ్ బరిలో నిలబెట్టుకొని గెలిపించుకున్నాడు. ఇలా ఒకే కుటుంబం నుంచి మూడు సార్లు సర్పంచ్ పదవులను దక్కించుకున్నారు. ఉమ్రి గ్రామపంచాయతీలోనున్న సోయంగూడ, సూర్యగూడను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. సోయంగూడ గ్రామపంచాయతీ ఎస్టీ మహిళకు కేటాయించడంతో ఆ పంచాయతీకి మళ్లీ సోయం సుగుణబాయిని సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఆ కుటుంబానికి నాల్గోసారి సర్పంచ్‌గా పనిచేసే అదృష్టం కలిసొచ్చింది.

3754
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles