
నిర్మల్ : జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు పర్యావరణానికి, పక్షులకు హానికలిగించే ప్లాస్టిక్, నైలాన్ చైనా మాంజాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు అటవీ శాఖ అధికారులు పట్టణంలో తనిఖీలు నిర్వహించారు. ప్లాస్టిక్, నైలాన్ చైనా మాం జాల తయారీ, అమ్మకాలు, నిల్వ, సరఫరాచేయరాదని సూచించారు. వీటితోపాటు సంక్రాంతి సందర్భంగా పతంగులను ఎగుర వేసేందుకు పదునైన దారాలను వాడరాదని, గాజు, ఇనుము వంటి వస్తువులను దారాలకు కట్టి ఎగురవేయరాదని వ్యాపారులకు తెలిపారు. పర్యావరణానికి, పక్షులకు తీవ్రమైన హాని కలుగుతున్నదని పేర్కొన్నారు. నూలుపోగులతో తయారైన దారాలను మాత్రమే పతంగులు ఎగురవేసేందుకు ఉపయోగించాలని సూచించారు. ప్లాస్టిక్, నైలాన్ చైనా మాంజా వాడకం చట్టవిరుద్ధమని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పర్యావరణ పరిరక్షణ చట్టం సెక్షన్ 15 కింద కేసు నమోదు చేశారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఐదేండ్ల జైలుశిక్షకానీ, లక్ష వరకు జరిమానాకానీ, లేదా రెండూ విధిస్తామని అధికారులు హెచ్చరించారు.