బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్

Sun,November 18, 2018 09:39 PM

సూర్యాపేట : సూర్యాపేట బాలికల వసతి గృహంలో ఆహారం పాయిజన్ అవడంతో 50 మందికి పైగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. స్థానిక జేజే నగర్‌లోని బీసీ బాలికల వసతి గృహంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం పప్పుతో భోజనం చేసిన విద్యార్థునులు కొంత మంది కడుపునొప్పితో బాధపడుతుండగా వారిని స్థానిక ప్రైవేటు దవాఖానకు తరలించారు. ఆ తర్వాత కడుపునొప్పితో విద్యార్థినిల సంఖ్య పెరుగుతుండడంతో స్థానికంగా ఉండే ఒక ఆర్‌ఎంపీ వైద్యుడిని తీసుకొచ్చి వసతి గృహానికి తాళం వేసి లోపల వైద్యం చేయించారు.

విషయం తెలుసుకున్న కొంత మంది స్థానికులు, విద్యార్థి సంఘాల నాయకులు గొడవ చేయడంతో పాటు తాళం పగుల కొట్టి లోపలికి వెళ్లారు. విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంటే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అంటూ వార్డెన్ ఉషారాణిని నిలదీశారు. 108కు ఫోన్ చేసి అస్వస్థతకు గురైన విద్యార్థులను సూర్యాపేట ఏరియా దవాఖానకు తరలించారు. తొలుత 21 మంది విద్యార్థినిలను వైద్యశాలకు తరలించి వైద్యం చేయిస్తుండగా మరికొంత మంది విద్యార్థినులు అస్వస్థతకు గురవడంతో వారిని సైతం తరలించారు. సుమారు 50 మందికి పైగా విద్యార్థినులు ఆస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. వారికి చికిత్స మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

గప్ చుప్‌లు తిన్నామని చెప్పండని బెదిరింపు : వసతి గృహానికి తాళం వేసి చికిత్స చేయించిన వసతి గృహం నిర్వాహకురాలు ఉషారాణి రాత్రి భోజనం వల్లే ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పవద్దని విద్యార్థినిలను బెదిరించారని విద్యార్థునులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై వసతి గృహంలో విచారణ చేసి వార్డెన్‌పై చర్యలు తీసుకుంటామని బీసీ సంక్షేమ అధికారిని జ్యోతి తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధికి కృషి చేస్తుంటే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు.

2511
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles