గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఐదుగురు అరెస్టు

Mon,March 25, 2019 09:55 PM

హైదరాబాద్ : గంజాయికి బానిసగా మారి దాన్నే వృత్తిగా మార్చుకున్న ఐదుగురు విద్యార్థులు కటకటాల పాలయ్యారు. గంజాయి విక్రయాలకు పాల్పడుతూ ఆబ్కారీ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. హైదరాబాద్ జిల్లా ఆబ్కారీ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఈఎస్ నంద్యాల అంజిరెడ్డి కథనం ప్రకారం...కేపీహెచ్‌బీకి చెందిన ఆర్.చంద్రశేఖర్ వర్మ అలియాస్ చందూ(19) బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన లీలా కృష్ణా డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. నిజాంపేట, 7హిల్స్‌కు చెందిన క్రాంతి కుమార్ ఐటీఐ చదువుతున్నాడు.


కూకట్‌పల్లి, ప్రజాసిటీ ప్రాంతానికి శ్రీకాంత్ బీటెక్‌లో డీటెండై బీబీఏ కోర్సు చదువుతున్నారు. అదే ప్రాంతానికి చెందిన నాగరాజు పదవతరగతి ఫెయిలయ్యాడు. వీరందరూ మొదట గంజాయిని వినియోగిస్తూ దానికి బానిసగా మారారు. అనంతరం డబ్బుకోసం గంజాయి విక్రయాన్నే వృత్తిగా మార్చుకున్నారు. ఈ క్రమంలో చంద్రశేఖర్ వర్మ, లీలా కృష్ణా, క్రాంతి కుమార్, అనుదీప్‌లు విశాఖపట్నం, అరకు నుంచి గంజాయిని నగరానికి తీసుకువచ్చి నాగరాజు, శ్రీకాంత్‌లకు సరఫరా చేస్తుండగా వారు నగరంలోని ఆయా ప్రాంతాల్లో విద్యార్థులకు విక్రయిస్తున్నారు.

ఈ క్రమంలోనే సోమవారం నాగరాజు, శ్రీకాంత్‌లు ఎర్రగడ్డ, ప్రేమ్‌నగర్‌లో గంజాయి విక్రయాలకు పాల్పడుతుండగా సమాచారం అందుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిందితులను అరెస్టు చేశారు. విచారణలో వారిచ్చిన సమాచారం మేరకు మిగిలిన ముగ్గురు నిందితులను కూకట్‌పల్లిలో అరెస్టు చేశారు. నిందితుల వద్దనుంచి 3.01కిలోల గంజాయి, ఐదు సెల్‌ఫోన్‌లు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును అమీర్‌పేట ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు. జిల్లా డీసీ వివేకానందరెడ్డి ఆదేశాల మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఈఎస్ నంద్యాల అంజిరెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ దాడుల్లో ఇన్‌స్పెక్టర్‌లు ఇ.చంద్రకుమార్, ఎస్‌ఐలు నజీహుస్సేన్, నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

876
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles