ముందుకు సాగని కేసులు!

Thu,February 21, 2019 07:01 AM

హైదరాబాద్: ఆర్థిక నేరాలకు సంబంధించిన ప్రధాన కేసులను సీసీఎస్...ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్)కు పంపిస్తున్నారు. గత రెండేళ్లుగా సీసీఎస్ నుంచి వెళ్లిన కేసులపై ఈడీలో కేసులు నమోదయ్యాయి. అయితే అక్కడ కేసుల దర్యాప్తు మాత్రం ముందుకు సాగడంలేదు. ఇటీవల దేశ హీరా గ్రూప్స్ అధినేత నౌహీరా షేక్ అరెస్ట్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సీసీఎస్ పోలీసులు మొదటగా అరెస్ట్ చేశారు. ఆ తరువాత మహారాష్ట్ర, ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి తిరిగి సైబరాబాద్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొని విచారించారు. తిరిగి హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఆమెను మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. చాంద్రాయణగట్టలో నమోదైన కేసు సీసీఎస్‌కు బదిలీ కావడంతో, ఈ కేసులో ఆమెను సీసీఎస్ పోలీసులు మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. భారీ స్థాయిలో ఆర్థిక నేరాలకు పాల్పడిన కేసుల్లో దర్యాప్తును పూర్తి చేసుకుంటూ సీసీఎస్ పోలీసులు న్యాయస్థానాల్లో చార్జీషీట్లు దాఖలు చేస్తున్నారు. కేసుల తీవ్రత మేరకు ఆయా కేసులను ఈడీ, ఆదాయపన్ను శాఖలకు సీసీఎస్ పోలీసులు రెఫర్ చేస్తున్నారు. దీంతో ఆయా విభాగాలు కూడా దర్యాప్తు చేస్తున్నాయి. రెండేళ్ల కాలంలో సీసీఎస్ నుంచి 5 కేసుల వరకు ఈడీకి సిఫారస్ చేశారు. వీటిపై ఈడీ కేసు నమోదు చేయడం వరకే పరిమితమయ్యింది.
బ్యాంకు ఖాతాల సేకరణలో పోలీస్...
హీరా గ్రూప్స్‌లో నిబంధనలకు విరుద్ధంగా లక్షలాది మంది నుంచి డిపాజిట్లు సేకరించి, వారిని మోసం చేసిందనే ఆరోపణలను సంస్థ నిర్వాహకురాలు నౌహీరా ఎదుర్కొంటుంది. ఈ కేసు దర్యాప్తులో సుమారు 1.8 లక్షల మంది డిపాజిట్‌దారులు, సుమారు రూ.6 వేల కోట్ల వరకు డిపాజిట్లు చేసినట్లు, హీరా గ్రూప్స్‌కు సంబంధించిన 14 సంస్థలు, ఈ సంస్థల పేర్లపై 250 బ్యాంకు ఖాతాలను పోలీసులు సేకరించారు. సుమారు పదేండ్లకుపైగా ఈ సంస్థల ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలను ఆయా బ్యాంకు ఖాతాలను పరిశీలించేందుకు సీసీఎస్ పోలీసులు కసరత్తు చేస్తున్నారు. అయితే లక్షలాది మంది బాధితులు దేశ వ్యాప్తంగా ఉండ డం, బ్యాంకు ఖాతాలు వివిధ రాష్ర్టాల్లో ఉండడంతో పూర్తి సమాచారాన్ని వీలైనంత వేగంగా సేకరించడంలో సీసీఎస్ పోలీసులకు సాధ్యపడడం లేదు. హీరా గ్రూప్స్ వెనుక అజ్ఞాత వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అది... ఉగ్రవాదులు, మాఫియా, ఇంకెవరో అయి ఉండవచ్చని భావిస్తున్నారు. వీటన్నింటినీ తేల్చాలంటే అంతర్జాతీయ స్థాయి బ్యాంకు లావాదేవీలను కూడా పరిశీలించాల్సి ఉంది. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తులో సీసీఎస్ పోలీసులు ఎంతో కీలకమైన సమాచారాన్ని సేకరించారు. వివిధ రాష్ర్టాల పోలీసులు, దర్యాప్తు సంస్థలకు ఈ సమాచారా న్ని సీసీఎస్ పోలీసులు షేర్ చేస్తున్నారు. అయితే సీసీఎస్ పోలీసులకు ఇతర రాష్ర్టాల్లోని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి సమాచారం రావడం ఆలస్యమవుతున్నది. నౌహీరాపై సీరియస్ ఫ్రాడ్ ఇన్విస్టిగేషన్ ఆఫీస్(ఎస్‌ఎఫ్‌ఐఓ)లోను కేసు నమోదయ్యింది. కేవ లం నౌహీరా బ్యాంకు ఖాతాలకు సంబంధించిన పూర్తి స్పష్టత రావాలంటేనే కనీసం ఆరు నెలల స మయం పడుతుందని ఎస్‌ఎఫ్‌ఐఓ పేర్కొంటుంది.
కదలికలేని కేసులు!
2016, నవంబర్ 8న రాత్రి భారత ప్రధాని నరేంద్రమోడీ డీమానిటైజేషన్ ప్రకటన విడుదల చేశారు. దీంతో ముసద్దీలాల్ జ్యువెలర్స్ తమ వద్ద ఉన్న సుమారు వంద కోట్ల రూపాయలను అడ్డదారిలో వైట్‌గా మార్చేందుకు ప్రయత్నించారు. ప్రకటన వెలువడిన తరువాత బంగారం విక్రయాలు సాగించామంటూ ఆదాయపన్ను శాఖను బురిడీ కొట్టించే ప్రయత్నం చేయడంతో ఈ కేసు దర్యాప్తు సీసీఎస్ పోలీసులకు వచ్చింది. ఈ కేసులో బ్లాక్‌ను, వైట్‌గా ముసద్దీలాల్ యాజమాన్యం చేసిందంటూ నిర్థారించి, న్యాయస్థానంలో సీసీఎస్ పోలీసులు చార్జిషీట్ కూడా వేశారు. రూ. వంద కోట్ల వరకు చీటింగ్ జరగడంతో ఈ కేసును ఈడీకి సిఫారస్ చేయడంతో, అక్కడ కేసు నమోదయ్యింది. ఈడీలో కేసు న మోదై సంవత్సరంన్నరకుపైగా కావస్తున్నా.. ఈ కేసులో ఒక్క అడుగు కూడా ముందుపడలేదని తెలుస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ భూములకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి, వాటి ద్వారా ఆయా స్థలాలను వివాదంలోకి నెట్టి, సెటిల్‌మెంట్లకు పాల్పడ్డాడని ఆరోపణలతో అరెస్టయిన ఓ న్యాయవాది కేసును కూడా ఈడీకి సిఫారస్ చేశారు. అలాగే ఒక నిర్మాణ సంస్థపై కూడా ఈడీలో కేసు నమోదయినట్లు సమాచారం. అయితే ఈ కేసుల్లో ఎలాంటి కదలిక లేదని తెలుస్తున్నది.

626
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles