సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలి

Sat,February 23, 2019 10:28 PM

farmers should concentrate on organic agriculture says mp vinod

- కరీంనగర్‌లో సేంద్రియ వ్యవసాయ కేంద్రం స్థాపనకు కృషి
- కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్

కరీంనగర్: వ్యవసాయంలో మోతాదుకు మించి పురుగుల మందుల వాడకంతో దేశంలో రోజు రోజుకూ దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతున్నాయని, రైతులు సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారిస్తేనే మానవ మనుగడ సాధ్యమవుతుందని కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ సూచించారు. జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్‌లో కృషిభవన్ ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహించిన రాష్ట్ర స్థాయి సేంద్రియ రైతు సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతులు విచ్చలవిడిగా పురుగు మందులను వినియోగిస్తుండడంతో నేల నిస్సారవంతమై తెగుళ్ల బారిన పడి దిగుబడి రాక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.

అలాగే పురుగుల మందులను ఎక్కువగా ఉపయోగిస్తుండడంతో దేశంలో క్యాన్సర్ వ్యాధి పెరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వ్యవసాయరంగంలో జరుగుతున్న పెద్ద కార్యక్రమంగా సేంద్రియ రైతు సమ్మేళనాన్ని చెప్పుకోవచ్చని అభిప్రాయపడ్డారు. జాతీయ సేంద్రియ వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని కరీంనగర్‌లో ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్‌తో కలిసి కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుతో కరీంనగర్ జిల్లా సాగునీటికి హబ్‌గా మారుతుందని చెప్పారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరే లక్ష్యంగా కేసీఆర్ ముందుకు పోతున్నారని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణ 365 రోజులు నీటితో జలకళ సంతరించుకోనుందని చెప్పారు.

వేస్ట్ డీకంపోజర్‌తో విప్లవాత్మక మార్పులు


జాతీయ సేంద్రియ వ్యవసాయ సంచాలకులు, వేస్ట్ డీకంపోజర్ సృష్టికర్త డాక్టర్ కృష్ణ చంద్రన్ మాట్లాడుతూ.. వేస్ట్ డీకంపోజర్ వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకురానుందన్నారు. కేవలం తక్కువ పెట్టుబడితో రైతులు ఎక్కువ దిగుబడులు సాధించే అవకాశం ఏర్పడిందని తెలిపారు. దేశంలోని 5 కోట్ల మంది రైతులు వేస్ట్ డీకంపోజర్ ద్వారా లాభపడుతున్నారని చెప్పారు. అన్ని వ్యవసాయ పంటలకు వేస్ట్ డీకంపోజర్‌ను ఉపయోగించవచ్చని, బంజరు నేలలను సైతం సారవంతం చేసే గుణం దీనికి ఉందని, ఇప్పటికే వీటిని వాడుతున్న రైతులు ఫలితాలు పొందుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వుచ్చిడి మోహన్‌రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ప్రవీణ్, విశ్రాంత వ్యవసాయ అధికారులు సముద్రాల జనార్ధన్‌రావు, సిరికొండ కమలాకర్‌రావు, కంటె చక్రాధర్, జిల్లా వ్యవసాయ అధికారి వాసిరెడ్డి శ్రీధర్‌తో పాటు తెలంగాణ, ఏపీ రాష్ర్టాల నుంచి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

669
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles