
జగిత్యాల: నీరు సమృద్దిగా లభిస్తే రైతులు పది మందికి అన్నం పెడతారని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ వద్ద రోళ్లవాగు ప్రాజెక్టు శంకుస్థాపన పనుల్లో మంత్రి ఈటల పాల్గొన్నారు. అనంతరం ధర్మపురిలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇరిగేషన్ ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని.. ప్రతి ఎకరాకు నీరు ఇచ్చేందుకు సీఎం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఉద్యమ కాలంలోనే ధర్మపురిలో సీఎం కేసీఆర్ గోదావరి పుష్కరాలను నిర్వహించారని గుర్తుచేశారు. గత ప్రభుత్వాలు వ్యవసాయానికి 6 గంటలు కూడా కరెంటు ఇవ్వలేదన్నారు. కానీ ప్రస్తుతం వ్యవసాయానికి 24 గంటలు కరెంటు ఇవ్వడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఆడబిడ్డల కష్టాలను తీర్చడానికే సీఎం మిషన్ భగీరథ చేపట్టినట్లు పేర్కొన్నారు.