కిక్కుకూ లెక్కుండాలి

Sat,January 12, 2019 08:43 AM

excise department surveillance on liquor distribution over panchayat elections in rangareddy dist

రంగారెడ్డి: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడానికి మద్యం పంపిణీ చేయకుండా నిరోధించడానికి మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ అధికారులు నిఘా పెట్టారు. ముందస్తు ఎన్నికల తరహాలో మద్యం వ్యాపారుల నుంచి రోజువారి లెక్కలను సేకరిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ పూర్తి అయ్యింది. రెండవ విడత నామినేషన్ల పూర్తి కానుంది. మూడో విడత ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ వెలువడనుంది.

ఈ నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. గతేడాది మద్యం వ్యాపారులు గతేడాది ఇదే నెలలో ఎంత మేర మద్యం విక్రయించారో అంతే మొత్తంలో మద్యం విక్రయిస్తున్నారా లేక ఎక్కువగా విక్రయిస్తున్నారా తేల్చడానికి ఎక్సైజ్ అధికారులు రంగంలోకి దిగారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1182 పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 558, వికారాబాద్ జిల్లాలో 563, మేడ్చల్ జిల్లాలో 61 గ్రామ పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ సాగుతున్నది. తొలి విడత పోలింగ్ ఈనెల 21, రెండో విడత 25న, మూడో విడత 30న జరుగనుంది. సర్పంచ్ స్థానాలకు, వార్డు స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ గెలుపు కోసం ఓటర్లకు మద్యం, మాంసంతో విందు ఏర్పాటు చేయడం కొనసాగుతుందని ఎన్నికల సంఘం అధికారులు భావిస్తున్నారు.

మద్యం అమ్మకాలను నియంత్రిస్తే ఎన్నికలను పారదర్శంగా నిర్వహించవచ్చని భావించిన ఎన్నికల సంఘం, మద్యం అమ్మకాలపై నిఘా ఉంచాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించింది. రోజు వారీ అమ్మకాలకంటే ఎక్కువ మద్యం విక్రయిస్తే వ్యాపారులు అందుకు తగిన కారణాలను ఎన్నికల సంఘానికి నివేదించాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం ఆదేశాలను ఎక్సైజ్ అధికారులు పాటిస్తూ మద్యం వ్యాపారులతో సమన్వయం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 412 మద్యం దుకాణాలు ఉన్నాయి. మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లోనే అధికంగా మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాల పరిధిలో ఎంత మద్యం విక్రయిస్తున్నారు. ఎవరైనా నాయకులు కొనుగోలు చేస్తున్నారా.. లేక సాధారణ ప్రజలే మద్యం కొనుగోలు చేస్తున్నారా అనే అనేక అంశాలపై ఎక్సైజ్ అధికారులు వివరాలను సేకరిస్తున్నారు. మూడు విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు మద్యం అమ్మకాలపై నిఘా పటిష్టంగా ఉండనుంది.

1560
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles