ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రతీ మెట్రో స్టేషన్ : కేటీఆర్

Mon,September 24, 2018 01:53 PM

Every metro station made with world class standards says Minister KTR

హైదరాబాద్ : ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రతీ మెట్రో స్టేషన్‌ను తీర్చిదిద్దామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అమీర్‌పేట - ఎల్బీనగర్ మెట్రో రైలు ప్రారంభం సందర్భంగా ఎల్బీనగర్‌లో ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. ప్రపంచంలో అత్యుత్తమ మెట్రోలతో పోటీ పడే విధంగా హైదరాబాద్ మెట్రోను తీర్చిదిద్దామని చెప్పారు. అందరికీ సౌకర్యంగా ఉండేలా ప్రతి మెట్రో స్టేషన్‌ను తీర్చిదిద్దామని తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైలుకు చాలా అవార్డులు వచ్చాయన్నారు. ఐజీబీఎస్ సంస్థ.. హైదరాబాద్ మెట్రోకు ప్లాటినం అవార్డును అందజేసిందని గుర్తు చేశారు కేటీఆర్.

దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రో రైలు మార్గం అందుబాటులోకి వచ్చిందన్నారు. ప్రపంచంలోనే ప్రభుత్వ - ప్రయివేటు భాగస్వామ్యంలో అతిపెద్ద ప్రాజెక్టును చేపట్టామని గుర్తు చేశారు. ప్రాజెక్టుపై ఎల్ అండ్ టీ రూ. 12 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతోనే భూసేకరణ చేశామన్నారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టామని తెలిపారు. పంజాగుట్టలో రద్దీ ఉన్నా.. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. అన్ని రకాల నాణ్యతా ప్రమాణాలు పాటించి మెట్రో స్టేషన్ల నిర్మాణం చేపట్టామని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రయాణికులు నడక ద్వారా మెట్రో స్టేషన్లకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు. ఎప్పటికప్పుడు అధికారులు మెట్రో స్టేషన్లను తనిఖీ చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని కేటీఆర్ ఉద్ఘాటించారు.

2047
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS