భాగ్యనగరంలో యూరప్ ఫిల్మ్ ఫెస్టివల్

Tue,August 20, 2019 06:42 AM

Europe Film Festival starts in Hyderabad from tomorrow

హైదరాబాద్: ప్రతిష్ఠాత్మకమైన యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు భాగ్యనగరం వేదికకానుంది. 22 యూరప్ దేశాలకు చెందిన 22 సినిమాలు నగరంలో ప్రదర్శనకు సిద్ధమయ్యాయి. ఈనెల 21 నుంచి 31 వరకు అమీర్‌పేటలోని సారథి స్టూడియోలో ఉచితంగా సినిమాలు వీక్షించే అవకాశం ప్రేక్షకులకు దక్కనుంది. హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్, తెలంగాణ టూరిజం, యూరోపియన్ ఎంబసీ, భారత సమాచార మంత్రిత్వశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. ఈమేరకు ఫిలింనగర్‌లోని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌హాల్‌లో తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సి.కల్యాణ్, రచయిత, దర్శకుడు పరచూరి వెంకటేశ్వరరావు ఫిల్మ్ ఫెస్టివల్ పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు. సినిమానే లైఫ్‌గా బతికే వారికి ఈ ఫెస్టివల్ ఒక గైడ్‌గా నిలవనుంది. ఎలాంటి సినిమాలు చేయాలి? స్క్రిప్ట్ ఎలా రాసుకోవాలి? సన్నివేశాలు ఎలా పండించాలి? మొత్తంగా ప్రపంచ సినిమా ఎలా ఉంటుంది? అందుకు మనం ఇంకేం చేయాలి? తదితర ప్రశ్నలకు ఈ ఫెస్టివల్‌లో సమాధానాలు దొరుకుతాయి. రోమాంటిక్ కామెడీ, డ్రామా, సెటైర్, ఫ్యామిలీ డ్రామా, సోషియో పొలిటికల్ థ్రిల్లర్ తదితర అంశాలను కథావస్తువుగా ఎంచుకుని దర్శకులు తీసిన గొప్ప సినిమాలను ఈ ఫెస్టివల్‌లో ప్రదర్శిస్తారు.
ఒక్కో దేశం నుంచి ఒక్కో సినిమా..
స్విట్జర్లాండ్, స్వీడన్, రొమానియా, స్లొవకియా, పోర్చుగల్, డెన్మార్క్, ఫిన్లాండ్, జర్మనీ, గ్రీస్, హంగేరీ, ఐర్లాండ్, ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, లిథియానా, మాల్టా, నెదర్లాండ్స్, సైప్రస్, చెక్ రిపబ్లిక్ దేశాలకు చెందిన సినిమాలు ప్రేక్షకుల ముందుకురానున్నాయి. అవార్డు విన్నింగ్ చిత్రాలను ఒక్కో దేశం నుంచి ఒక్కో సినిమాను ఎంపిక చేశారు. ఈ ఫెస్టివల్ ఢిల్లీ, గోవా, పూణె, పాండిచ్చెరీ, బెంగళూరు, కోల్‌కత్తా, ముంబయి వంటి నగరాల్లో ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు హైదరాబాద్ వేదికగా యూరప్ సినిమాలు చూసే అవకాశం దక్కింది. సాధారణంగా ఇతర దేశాలకు చెందిన సినిమాలు మన దృష్టికి రావటం చాలా తక్కువ. కానీ ఇప్పుడు యూరప్ సినిమాలన్నీ ప్రేక్షకుల కళ్లముందుకు రాబోతుండటం విశేషం.
సమయం ఇలా..
ప్రతిరోజు రెండు సినిమాలు ప్రదర్శిస్తారు. సాయంత్రం 6 గంటలకు సినిమా ప్రదర్శన ఉంటుంది. రాత్రి 8 గంటలకు మరో సినిమా చూడొ చ్చు. సినిమాలన్నీ ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో ప్రదర్శించడం జరుగుతుంది. 18 ఏళ్ల వయస్సు నిండిన వారికే ప్రవేశం, థియేటర్‌కు మొదట వచ్చిన వారికే ప్రాధాన్యం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. అంతేకాదు సిని మా కథాంశాల కోసం euffindia.com వెబ్‌సైట్‌ను సంప్రదించొచ్చు. అయితే ఆగస్టు 23, 25, 31 రోజుల్లో ప్రేక్షకులు సాయంత్రం 4 గంటల వరకు స్టూడియోకు చేరుకోవాలని నిర్వాహకులు తెలిపారు. ఆ రోజుల్లో సినిమాలు తొందరగా ప్రదర్శనకు ఉంటాయని సూచించారు.
ప్రతి సినిమా ఆలోచన రేకెత్తించేలా..
ప్రతి చిత్రం ప్రేక్షకుల మదిలో నిలిచిపోయేలా ఉంటుంది. ఒక్కో స్టోరీ ఆద్యంతం అద్భుతంగా సాగే సినిమాలను ఎంపిక చేశారు. ఆస్ట్రియాలో సక్సెస్ సాధించిన ైస్టెక్స్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. సెయిలింగ్ ట్రిప్‌కు వెళ్లిన ఓ డాక్టర్.. నడి సముద్రంలో తుఫాన్‌తో ఎదురైన ప్రమాదాలను ఏ విధంగా ఎదుర్కొంటుందో దర్శకుడు వాల్ఫ్‌గ్యాంగ్ ఫిషర్ అద్భుతంగా తెరకెక్కించిన సినిమా వీక్షణకు ఉంది. ఇక రిపబ్లిక్ దేశానికి చెందిన మరో సినిమా టెండర్ వేవ్స్.. ఒక యువకుడిపై తల్లిదండ్రులు ఎలాంటి ఆశలు పెట్టుకుంటారు? వాటిని నెరవేర్చడానికి ఆ కొడుకు ఏంచేస్తాడనే దిశగా దర్శకుడు జిరి వెజోయెలెక్ తీసిన సినిమా నేటితరం యువకులకు, తల్లిదండ్రులకు మంచి సందేశాన్ని ఇచ్చేలా ఉంటుంది. ఫిన్‌లాండ్‌కు చెందిన లాఫ్ ఆర్ డై సినిమా సివిల్ వార్ నేపథ్యంలో సాగనుంది. ఫ్రాన్స్‌కు చెందిన మరో మూవీ హోప్ సినిమాను దర్శకుడు బోరిస్‌లోజ్కిన్ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను మైమరిపించేలా ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు సహారఎడారి నుంచి వారు కళలు కన్న ప్రపంచాన్ని వెతుక్కుం టూ వెళ్లే సన్నివేశాలను అబ్బురపరిచేలా తీశారు. గ్రీస్ దేశపు సినిమా లిటిల్ ఇంగ్ల్లాండ్‌లో లవ్‌స్టోరీ, ఫ్యామిలీ డ్రామా ఉండనుంది. ఇలా అనేక సినిమాలు ఫిమేల్ ప్లెసర్స్, డ్రిఫ్టర్స్, బ్యాక్‌స్టేజ్, బిసైడ్ మీ, డైమాంటినో, ఆఫ్ టైమ్ అండ్ ద సీ, ఏషెస్ ఇన్ ద స్నో, రిటర్న్ ఆఫ్ సెర్జియంట్ ల్యాపి న్స్, బ్లాక్-47, ద ట్రూప్, మి అండ్ కామిన్‌స్కీ, ద చార్మర్, రోస్‌మేరీ, బబుల్‌గమ్, కింగ్ ఆఫ్ ద బెలల్‌గియన్స్ సినిమాలు ఉంచారు.

347
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles