ఎర్రబెల్లి దయాకర్‌రావు అను నేను..

Tue,February 19, 2019 12:00 PM

Errabelli Dayaker Rao take Oath as Minister

పూర్తి పేరు : ఎర్రబెల్లి దయాకర్‌ రావు
తండ్రి : ఎర్రబెల్లి జగన్నాథరావు
తల్లి : ఎర్రబెల్లి ఆదిలక్ష్మి
భార్య : ఉషాదయాకర్‌రావు
కుమారులు : ఎర్రబెల్లి ప్రేమ్‌ చందర్‌రావు
స్వగ్రామం : పర్వతగిరి, వరంగల్‌ రూరల్‌ జిల్లా
పుట్టిన తేది : 04-07-1956
విద్యార్హతలు : ఇంటర్మీడియట్‌
చేపట్టిన శాఖ : పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్


హైదరాబాద్ : సుదీర్ఘ రాజకీయ అనుభవం.. అలుపెరుగని విజయం ఆయన సొంతం.. దాదాపు మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయనకు ఇవ్వాళ నడిచివచ్చిన అవకాశం. ఓటమినెరుగని నాయకుడిగా ప్రజాజీవితంలో పెనవేసుకున్న ఆయన.. అందరి తలలో నాలుకలా మెదలటమే కాదు ఉమ్మడి జిల్లాలో మాస్‌ లీడర్‌గా తనకు తాను నిరూపించుకున్నారు. ఆయనే ఎర్రబెల్లి దయాకర్‌రావు. పాలకుర్తి నియోజకర్గ ఎమ్మెల్యే. తన చిరకాల స్వప్నం ‘ఎర్రబెల్లి దయాకర్‌రావు అను నేను’ అంటూ ఆయన మంగళవారం ఉదయం 11.30 నిమిషాలకు రాజ్‌భవన్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

తను నమ్ముకున్న నియోజకర్గ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసే స్వభావం, ఏ పార్టీలో ఉన్నా సరే రాష్ట్రంలోనే అభివృద్ది చెందిన నియోజకవర్గంగా మలచుకోవడంలో ఆయనది విలక్షణ శైలి. అంతేకాదు పార్టీ ఏదైనా నాయకుల మధ్య సఖ్యత, సమన్వయం కుదర్చడంలో ఆయన తనకంటూ ప్రత్యేకను సంతరించుకున్నారు. డబుల్‌ హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఆయన సొంతం చేసుకున్నారు. ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మంత్రి పదవి ఖాయం అని రెండు నెలలుగా జరుగుతున్న ప్రచారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫోన్‌కాల్‌తో అక్షరరూపం దాల్చింది. ఆయన రాజకీయ అనుభవం, కలుపుగోలుతనం, చిత్తశుద్ధి, పార్టీ విధేయత వంటి సానుకూల అంశాలు ఆయనకు కలిసి వచ్చాయని చెప్పవచ్చు.

రాజకీయ ప్రస్థానం
1983 నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీల కార్యకర్తగా పనిచేయడంతో పాటు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా, జిల్లా ప్రథమ కన్వీనర్‌గా పనిచేసి వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు తీసుకున్నారు. 1985, 1989 సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో పొత్తు కారణంగా వన్నాల శ్రీరాములు, టీ రాజేశ్వర్‌రావు గెలుపులో కీలక పాత్ర పోషించారు. 1994లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ వర్ధన్నపేట అభ్యర్థిగా పోటీ చేసిన దయాకర్‌రావు భారీ మెజార్టీతో విజయం సాధించారు. అలాగే 1999, 2004 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో కూడా వరుస విజయాలు సాధించి హాట్రిక్‌ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. చెన్నూరు నియోజకవర్గం నుంచి పాలకుర్తి నియోజకవర్గంగా మారినా ఆయన గెలుపులో ఎక్కడి నుంచైనా మార్పుండదని నిరూపించుకున్నారు. ఎమ్మెల్యేగా డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించిన నాయకుడిగా జిల్లాలో ఎర్రబెల్లి రికార్డు సృష్టించారు.

ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వామి..!
అప్యాయతతో కూడిన పలకరింపు.. ప్రతీ గ్రామంలో కనీసం 100 మందికి తగ్గకుండా పేర్లుపెట్టి పిలిచే పరిచయాలు. ఎవరికి ఆపద వచ్చినా అక్కున చేర్చుకొనే మనస్తత్వంతో ఎర్రబెల్లి దయాకర్‌రావు తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు. 15 సంవత్సరాలపాటు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా కొనసాగిన ఎర్రబెల్లి దయాకర్‌రావు వద్దకు వెళ్లిన ప్రతిఒక్కరికీ సహకారం అందించడంతో ప్రజల హృదయాల్లో నిలిచిపోయాడు. దీంతో పార్టీలకు అతీతంగా అన్నివర్గాల ప్రజలు ఆయనను దయన్నగా పిలుస్తారు.

ఫోరం సారధిగా..
విద్యార్థిదశ నుంచి తెలంగాణ కోసం పనిచేస్తున్న దయాకరావుకు తెలంగాణ పట్ల స్పష్టమైన అవగాహన ఉండటంతోపాటు అధినేత చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడిగా ఉండటం లాంటి అంశాలు తెలంగాణ తెలుగుదేశం ఫోరం కన్వీనర్‌గా సారధ్య బాధ్యతలు చేపట్టడానికి ఎంతగానో ఉపకరించాయి. అందరితో కలుపుగోలుగా ఉండటంలో ఆయనకు ఆయనే సాటి. పార్టీలో తెలంగాణ గురించి మొదట మాట్లాడింది దయాకరావు, నాగం జనార్ధన్‌రెడ్డి తెలంగాణ కోసం బాగా మాట్లాడేవాళ్లు. ఫోరం కన్వీనర్‌ బాధ్యతలు ‘నేను మోయలేను’ అని మొదట్లో తప్పుకుందామని చూసినా ఎమ్మెల్యేలంతా దయాకరరావు పేరు చెప్పారు. దీంతో దయాకరరావు పార్టీ టీఫోరంకు నాయకత్వం వహించారు. ఫోరం నాయకుడిగా ఉన్నకాలంలో ఆంధ్రా, రాయలసీమలో ఉన్ననాయకులు తెలంగాణను వ్యతిరేకిస్తూ వచ్చారు. ‘వాళ్లను మేం ఒప్పిస్తం.. మీరు ఒప్పుకోండి’ అంటూ పార్టీ అధినేత చంద్రబాబును ఒప్పించి రెండు ప్రాంతాల నాయకుల్ని ఒప్పించడంలో ఎర్రబెల్లి కీలక పాత్ర పోషించారు.

అఖిలపక్షం ముందుకు...
కేంద్రం తెలంగాణ విషయంలో రెండుసార్లు నిర్వహించిన అఖిలపక్ష సమావేశాలకు వరంగల్‌ జిల్లా నుంచి ఇద్దరు నాయకులైన రేవూరి ప్రకాశరెడ్డి, మాజీ మంత్రి కడియం శ్రీహరిని హాజరయ్యేలా చేసిన ప్రయత్నంలో ఎర్రబెల్లి భాగస్వామ్యం తక్కువేం కాదు.

1969 ఉద్యమంలో...
ప్రత్యేక తెలంగాణ కోసం మహోజ్వలంగా ఉద్యమం సాగుతున్న కాలం అది. ఆనాడు తెలంగాణలో పుట్టిన ప్రతీబిడ్డా తెలంగాణ కోసం ఇవ్వాటి లాగే ఉద్యమిస్తున్నకాలం. విద్యార్థిగా ఉన్న ఆయన అనేక ఆందోళనల్లో పాల్గొన్నారు. ఆనాడు అల్లర్లలో ఉద్యమకారులు దుర్గా టాకీస్‌ను తగులబెట్టారు. ఈ కేసులో దయాకర్‌రావు సైతం ఉన్నారు. అయితే అప్పుడు చిన్నవయసులో ఉండడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయలేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే దుర్గాటాకీస్‌ను తగులబెట్టి తిరిగివస్తుండగా చిన్నపిల్లవాడుగా ఉన్న దయాకర్‌రావు ఆ మంటల్లో కాలిపోయేవారేనట. అప్పుడు దయాకర్‌రావు క్లాస్‌మేట్‌ అయిన సమ్మయ్య దయాకర్‌రావును బయటకు గుంజుకొచ్చిండని ఆయన స్వయంగా తన మిత్రులతో నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటారు. అంతేకాదు అదే స్ఫూర్తితో పర్వతగిరిలో ఒక రోజు నిరాహారదీక్ష సైతం ఆనాడు విద్యార్థిగా ఉన్నప్పుడే తెలంగాణ కోసం ఉద్యమించానని ఆయన చెబుతుంటారు.

వరంగల్‌ ఎంపీగా..
జిల్లా తెలుగుదేశం పార్టీలో ముగ్గురు ఎంపీలను గెలిపించడంలో ఎర్రబెల్లి దయాకరరావుది ప్రత్యేకమైన పాత్ర. వరంగల్‌ డాక్టర్‌ టీ కల్పనాదేవి, అజ్మీరా చందూలాల్‌, బోడకుంటి వెంకటేశ్వర్లు ఈ ముగ్గురిని పార్లమెంట్‌కు పంపడంలో ఎర్రబెల్లిది ప్రత్యేమైన ప్రస్థానం. వరంగల్‌కు ఎంపీలను గెలిపించడంలోనే కాదు తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 2008లో ఉప ఎన్నికలు వచ్చాయి. అప్పుడు వరంగల్‌ ఎంపీగా రవీంద్రనాయక్‌ ఉండీ తెలంగాణ కోసం రాజీనామా చేశారు. టీడీపీ నుంచి ఎవరు ఆయనమీద పోటీచేయాలి అని ఆలోచించినప్పుడు, ఎవరూ ముందుకు రాకపోయేసరికి చంద్రబాబు జిల్లా వ్యాప్తంగా పట్టున్న నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావే కనుక ఆయననే బరిలో నిలిపారు. 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి నాయకుడిగా దయాకర్‌రావును వరంగల్‌ లోకసభ పరిధిలో ఓటర్లు గెలిపించారు.

వరంగల్ డీసీసీబీ చైర్మన్ గా
జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు చైర్మన్‌గా ఎర్రబెల్లి దయాకరరావు 1987లో ఎన్నికయ్యారు. పర్వతగిరి మండలం కల్లెడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ఏకగ్రీవంగా ఎన్నికై డీసీసీబీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో సెక్షన్‌ 11 నుంచి బ్యాంకును గట్టెక్కించి డీసీసీబీని దారికి తెచ్చిన రికార్డు ఆయన సొంతం. బ్యాంకుకు లోన్‌ అర్హతను సాధించారు.

గెలవడమే కాదు గెలిపించడంలోనూ...
ఎర్రబెల్లి దయాకర్‌రావు తొలిసారి మినహా గెలవడంలో ఆయన తరువాతే ఎవరైనా అన్నంతగా గుర్తింపు పొందారు. పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే 1983 సంవత్సరంలో వర్ధ్దన్నపేట నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి, నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో తెలుగుదేశం పార్టీ ఎంపీపీలను గెలిపించి విజయబావుటా ఎగురవేశారు. అదే సంవత్సరం అంతకుముందు జరిగిన సాధారణ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గంలో తొలిసారి శాసనసభ ఎన్నికల్లో ఓటమిచెందినా కుంగిపోకుండా ధైర్యంగా ప్రజల పక్షాన నిలిచి పార్టీ అభివృద్ధికి క్రియాశీలకంగా పనిచేశారు. అప్పటి నుంచి మొదలైన ఆయన ప్రస్థానం 1997లో 35 మంది జెడ్పీటీసీలను గెలిపించి వరంగల్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంలో దయాకర్‌రావు విశేష కృషి చేశారు. 2000 సంవత్సరంలో వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో మిత్రపక్షమైన బీజేపీ మేయర్‌ అభ్యర్థిని గెలిపించారు. 2001 సంవత్సరంలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో వర్ధ్దన్నపేట నియోజకవర్గంలోని మొత్తం 4 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 50 జెడ్పీటీసీలకు గానూ 21 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను, 2 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి మెజారిటీ లేకున్నా చాకచక్యంగా జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి టీడీపీకి దక్కేలా కృషి చేశారు.

ఆవిర్భావ కన్వీనర్‌ నుంచి...
1982లో స్వర్టీయ ఎన్టీఆర్‌ స్థాపింపిన తెలుగుదేశం పార్టీలో దయాకర్‌రావు వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు. పార్టీకి ఆనాడు ఎటువంటి జెండా ఉండాలో, రాష్ట్ర ప్రజల మెప్పును పొందడానికి పార్టీ జెండా విధివిధానాల రూపకల్పన కమిటీలో ఎర్రబెల్లి దయాకర్‌రావు ఒకరు కావడం విశేషం. ఆరోజుల్లోనే 20వేల మందితో వరంగల్‌లో నిర్వహించిన సభకు దయాకర్‌రావు అధ్యక్షత వహించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా తెలుగుదేశం పార్టీకి ఆయనే ప్రథమ కన్వీనర్‌. ఆ తరువాత ఆయనే కమిటీ వేసి ఆయన జిల్లా పార్టీ కార్యదర్శిగా ఉంటూ వర్ధ్దన్నపేట నియోజకవర్గ బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. అనతికాలంలోనే దయాకర్‌రావు (1983) శ్రీకాకుళం జిల్లా పార్టీకి పరిశీలకుడిగా పనిచేశారు. సుదీర్ఘకాలం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. పార్టీ అనుబంధ రామదండుకు ఆయన 1997లో మహానాడుకు దయాకర్‌రావు కన్వీనర్‌గా పనిచేశారు.

టీఆర్ఎస్ లో చేరిననాడే మంత్రి పదవి వద్దన్న నాయకుడు
ఎర్రబెల్లి దయాకర్‌రావు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ విధి విధానాలను చిత్తశుద్ధితో అమలుచేస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎమ్మెల్యేగా వర్ధ్దన్నపేట, పాలకుర్తి నియోజకవర్గాల నుంచి పోటీచేసి గెలిచినా సొంత ఇమేజ్‌ ఉన్న ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొలువుదీరింది. అప్పుడే ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని అభాసుపాలు చేయాలని చంద్రబాబు కుట్రలు పన్నుతున్న కాలంలో ఆయన సహించలేకపోయారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీ పెత్తనం అవసరమా అని భావించారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. తానొక్కడు పార్టీ మారితే లాభం లేదని భావించి కొద్దిమంది మినహా దాదాపు తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేరేలా కృషి చేశారు. ఆయన టీఆర్‌ఎస్‌లో చేరే సమయంలో సీఎం కేసీఆర్‌ ‘దయాకర్‌రావుకు మంత్రి పదవి ఆఫర్‌' చేశారు. కానీ ఎర్రబెల్లి మాత్రం నేను టీడీపీ నుంచి పోటీచేసి గెలిచాను.. కాబట్టి నాకు మంత్రి పదవి వద్దు. నాకున్న ఇమేజ్‌ పోతుంది. నేను టీఆర్‌ఎస్‌ టికెట్‌పై మళ్లీ గెలిచాకే మంత్రి పదవి ఇవ్వండి’ అని పేర్కొన్నారు. దీనిపై సీఎం కేసీఆరే స్వయంగా పాలకుర్తి నియోజకవర్గ పర్యటనలో బమ్మెర (పోతన సమాధి) గ్రామంలో జరిగిన సభలో పేర్కొనడం విశేషం. సీఎం కేసీఆర్‌ స్వయంగా పేర్కొనే దాకా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడంలో దయాకర్‌రావు విశ్వసనీయతకు
నిదర్శనం.

4144
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles