మొబైల్ చేతబట్టి ఇంటింటికెళ్లి ఆర్థికసర్వే షురూ

Mon,September 16, 2019 06:21 AM

హైదరాబాద్ : దేశ ప్రజల ఆర్థిక కార్యకలాపాలు, ఆదాయ మార్గాలు, స్థితిగతులను తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 7వ ఆర్థిక సర్వే గ్రేటర్‌లో లాంఛనంగా ప్రారంభమయ్యింది. తొలుత పైలట్‌ ప్రాజెక్ట్‌గా సికింద్రాబాద్‌ నియోజకవర్గంలోని సీతాఫల్‌మండి డివిజన్‌లో ఈ సర్వేను ప్రారంభించారు.


ఆదివారం సీతాఫల్‌మండిలోని మల్టీపర్సస్‌ కమ్యూనిటీ హాల్‌లో ఎన్యుమరేటర్ల సమావేశం నిర్వహించి, ఆర్థిక సర్వేను ప్రారంభించారు. సీఎన్‌సీవైస్‌ ప్రెసిడెంట్‌ రాధాకిశోర్‌, తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ (టిటా) వ్యవస్థాపక అధ్యక్షుడు సందీప్‌కుమార్‌ మక్తాల స్థానిక కార్పొరేటర్‌ సామల హేమ ఇంట్లో నుంచి సర్వేను ప్రారంభించారు. ఎన్యుమరేటర్లంతా ఇంటింటికీ వెళ్లి కుటుంబసభ్యుల వివరాలు, వారి ఆదా యం, వ్యాపారం, ఉద్యోగం తదితర వివరాలను సేకరించారు. పైలట్‌ ప్రాజెక్ట్‌గా చేపట్టిన ఈ సర్వే ముగిసిన తర్వాత, నెలాఖరులోగా గ్రేటర్‌ వ్యాప్తంగా ఆర్థికసర్వే చేపట్టనున్నారు.

ఆరేండ్లకోమారు..


ప్రజల ఆర్థిక స్థితిగతులను తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆరేండ్ల కోమారు ఆర్థిక సర్వేను నిర్వహిస్తున్నది. కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు శాఖ ఆధ్వర్యంలో ఈ సర్వేను నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా సర్వే ప్రతినిధులు ఇంటింటికీ వెళ్లి వారి ఆదాయమార్గాలు, భౌగోళికంగా ఆదాయ పంపిణీ, పనివాళ్లు, యజమానులెందరు, ఏఏ రంగాల్లో ఎంత మంది ఉపాధి పొందుతున్నారన్న అంశాలపై కుటుంబాల వారిగా ఆర్థిక స్థితిగతులను తెలుసుకుంటారు. పేదరికం, నిరుద్యోగం, సేవలు, ఉత్పత్తి, వ్యాపారాల స్థితిగతులను ఈ సర్వేలో భాగంగా సేకరిస్తారు. ఈ సర్వే ఫలితాల ఆదారంగా సంక్షేమ పథకాల రూపకల్పనను చేపడుతారు. సర్వే కోసం గ్రేటర్‌ను మొత్తంగా 573 ఇన్వెస్టిగేషన్‌ యూనిట్లుగా విభజించారు. ఒక్కో ఐవీ యూనిట్‌లో 5 - 10 వేల ఇండ్లు ఉండనున్నాయి. సర్వే సిబ్బంది.. మొబైల్స్‌ను చేతబట్టుకుని ఇంటింటికీ వెళ్లి ఆర్థిక సర్వేను నిర్వహించనున్నారు. సర్వేలో రెసిడెన్షియల్‌, కమర్షియల్‌, రెసిడెన్షియల్‌/కమర్షియల్‌ మూడు కేటగిరిలుగా విభజించారు.

కాగిత రహితంగా..


2013 వరకు నిర్వహించిన ఆర్థిక సర్వేలన్నీ పేపర్‌ ఆధారితంగా నిర్వహించగా, తాజాగా నిర్వహించే సర్వేను ఆన్‌లైన్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా నిర్వహించనున్నారు. ఈ యాప్‌ను ఎవరు పడితే వారు డౌన్‌లోడ్‌ చేసుకోరాదు. కేవలం ఎంపికైన ఎన్యుమరేటర్లు మాత్రమే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రాతపరీక్ష నిర్వహించి ఎన్యుమరేటర్లను ఎంపికచేశారు. ఇది వరకు ప్రభుత్వ ఉద్యోగులు, వీఆర్‌వోలు, టీచర్లు ఈ సర్వేను నిర్వహించగా, తాజాగా ఔట్‌సోర్సింగ్‌ సంస్థలకు అవకాశం కల్పించారు. గ్రేటర్‌లో తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ (టిటా)కు ఈ సర్వే బాధ్యతలు అప్పగించారు. గతంలో సమాచార సేకరణ ఏడాది కాలం పాటు కొనసాగేది. కానిప్పుడు కాగితరహితంగా మొబైల్‌ యాప్‌తో 3 -4 మాసాల్లోనే సమాచార సేకరణ, క్రోడీకరణను పూర్తిచేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

1533
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles