హస్తకళలను ఆకాశానికెత్తిన ‘దివ డిజైన్ ఫౌండేషన్‌'

Fri,May 24, 2019 06:58 AM

DIVA DESIGN FOUNDATION PROMOTES HANDICRAFTS


హైదరాబాద్ : ‘దివ డిజైన్‌ ఫౌండేషన్‌' అనే స్వచ్ఛంద సేవా సంస్థ దేశంలో అంతరించిపోతున్న పలు రకాల హస్తకళలను తిరిగి బతికించుకునేందుకు ఎంతగానో శ్రమిస్తున్నది. వారి ఆధ్వర్యంలో హ్యాండీ క్రాఫ్ట్స్‌, హ్యాండ్లూమ్స్‌, ట్రైబల్‌ ఆర్ట్‌ , క్రాఫ్ట్‌, గ్రామీణ సాంకేతికత, ఇంకా ఇతర లలిత కళలపై వివిధ రకాలుగా వర్క్స్‌ చేపడుతున్నారు. హస్తకళలను బతికించుకునే నేపథ్యంలో దివ డిజైన్‌ ఫౌండేషన్‌ ‘క్రాఫ్ట్‌ కుటీర్‌' షో రూమ్‌ను స్థాపించింది. ఫౌండేషన్‌ ట్రస్టీతో కలుపుకొని పదిమంది సభ్యులు కలిగి ఉంది. వివిధ ప్రాంతాల్లో ఆరుగురు వలంటీర్లు ఉన్నారు. ఒక ప్రాజెక్టు కో ఆర్డినేటర్‌, డిజైనింగ్‌ సభ్యులు నలుగురు, ఇద్దరు ఫీల్డ్‌ సిబ్బంది పని చేస్తున్నారు.


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నలుమూలలా ఎక్కడ హస్తకళలు విలసిల్లాయో తెలుసుకొని.. ఆ కళాకారులతో ‘మాకు వివిధ రకాల డిజైన్లలో కళాత్మక వస్తు సామగ్రి అవసరముందని’ కొంత పనిని అప్పగించి, వారికి భృతి కల్పిస్తూ, కళలను ప్రోత్సహిస్తున్నారు. ఇలా ఆదిలాబాద్‌, నిర్మల్‌, పోచంపల్లి, పెంబర్తి, విశాఖపట్నం, చేర్యాల్‌, బీదర్‌, కడప, ముంబయి, అరకు, శ్రీకాకుళం తదితర ప్రాంతాల్లో పేరు గాంచిన కళలకు సంబంధించి కళాకారులకు పని కల్పిస్తున్నారు. అక్కడి నుంచి వచ్చిన పలు రకాల కళాత్మక సామగ్రిని బేగంపేటలోని ‘ది ప్లాజా’ హోటల్‌లోని ‘క్రాఫ్ట్స్‌ కుటీర్‌'లో ప్రదర్శనకు ఉంచుతున్నారు.

హస్తకళలు..


హస్తకళల్లో చేనేత, చిత్రలేఖనం - పెయింటింగ్‌, గ్రామీణ సాంకేతికత, గిరిజన కళ, లలిత కళలు ప్రధానంగా వస్తాయి. కాటన్‌ లేదా సిల్క్‌ నేపథ్యంలో నేసిన వస్ర్తాలు ఇక్కడ లభ్యమవుతున్నాయి. చేనేత వస్ర్తాలు వినియోగదారులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. మిషనరీ వస్త్రం కంటే వినియోగదారులు చేనేతకే ప్రస్తుతం ప్రాధాన్యం ఇస్తున్నారు. చిత్రలేఖనం - పెయింటింగ్‌లకు సంబంధించి నిర్మల్‌ డ్రాయింగ్స్‌, పెయింటింగ్స్‌, చేర్యాల్‌ నకాశీ పెయింటింగ్స్‌, మధుబని పెయింటింగ్స్‌, ముంబయి (వర్లీ) పెయింటింగ్స్‌ క్రాఫ్ట్స్‌ కుటీర్‌లో లభ్యమవుతున్నాయి.

కళాభిమానులు, కళాకారులు ఎక్కడెక్కడికో వెళ్లకుండా గ్రామీణ సాంకేతికత - ఉడ్‌ క్రాఫ్ట్స్‌, గిరిజన కళల్లో భాగంగా వెదురు, కేన్‌ బుట్టలు, వెదురు బ్యాగులు, అలంకరణ ప్రాయంగా ఉండే పడవలు, కిరోసిన్‌ పోసుకుని వెలిగించుకునే దీపాలు, ఆదిలాబాద్‌ డ్వాక్రా వారి లోహ శిల్పాలు, ఏటి కొప్పాక - కైలాస పట్నం, లేఖర్‌ క్రాఫ్ట్స్‌, కడప దగ్గరలోని ఉన్ని పెంట (కాపర్‌, బ్రాస్‌తో తయారైన) లోహపు వర్క్స్‌, బీదర్‌కు చెందిన బిద్రీ వర్క్స్‌ నగరంలోనే లభిస్తున్నాయి. ఉడ్‌, మెటల్‌ క్రాఫ్ట్స్‌ వినియోగదారులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.

సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్‌ నుంచి...


సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్‌ వారికి పని కల్పించి, వారి నుంచి కాటన్‌, సిల్క్‌ నేపథ్యంలో తయారైన వస్ర్తాలను కొనుగోలు చేసి వాటిని కుటీర్‌లో వినియోగదారుల నిమిత్తం ప్రదర్శిస్తున్నారు. అంతే కాకుండా కలంకారికి సంబంధించిన ప్రింట్‌ వర్క్స్‌లో బెడ్‌ షీట్స్‌, ఇతర వస్ర్తాలు కూడా లభ్యమవుతున్నాయి.

డిజైనింగ్‌ సంస్థల నుంచి ఇంటర్న్‌షిప్‌ కోసం


నగర వ్యాప్తంగా వెలిసిన పలు డిజైనింగ్‌ సంస్థలైన ఎన్‌ఐడీ (నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైనింగ్‌), ఐఐసీడీ (ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ క్రాఫ్ట్‌ డిజైనింగ్‌), ఎన్‌ఐఎఫ్‌టీ (నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ) లకు చెందిన విద్యార్థులు వారి ఇంటర్న్‌షిప్‌ కోసం ‘దివ డిజైన్‌ ఫౌండేషన్‌' పరిధిలోకి వచ్చి ఎంతో మంది పని చేస్తున్నారు. వారికి కావాల్సిన పలు అంశాలపై విద్యార్థులు అవగాహనను మెరుగుపర్చుకుంటూ డిజైనింగ్‌లో ముందడుగు వేస్తున్నారు.

బస్తీ పిల్లలకూ పాఠాలు...


‘దివ డిజైన్‌ ఫౌండేషన్‌' ఆధ్వర్యంలో నగరంలోని పలు బస్తీల్లోని పిల్లలకు చిత్రలేఖనం, పెయింటింగ్‌, పలు రకాల క్రాఫ్ట్స్‌కు సంబంధించి తర్ఫీదునిస్తూ, వారిని ఆయా కళల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఒక్కో బస్తీలో 15 నుంచి 20 మంది పిల్లలను ఎంపిక చేసి ఆయా కళల్లో పోటీలు నిర్వహించి, సర్టిఫికెట్లు, బహుమతులు అందజేస్తున్నది. రేపటి తరానికి తెలియకుండా పోతున్నాయన్న ఈ కళలను ఫౌండేషన్‌ నిర్వాహకులు వారికి తెలియజేస్తూ వాటిపై ఆకర్షణ, ఆదరణను కల్పిస్తున్నారు.

‘దివ డిజైన్‌ ఫౌండేషన్‌' డిజైనర్లు...


‘దివ డిజైన్‌ ఫౌండేషన్‌'లోని డిజైనర్లు వారి కళాకారులతో కొత్త డిజైన్లలో శిక్షణ ఇస్తారు. మార్కెట్‌ ధోరణిని ఆకర్షిస్తున్న అప్‌గ్రేడ్‌ టెక్నాలజీని వారు వినియోగిస్తున్నారు. కళాకారులు తయారు చేసిన పలు రకాల ఎగ్జిబిట్స్‌ను ఉత్పత్తులను సేకరించి టూరిజం ప్లాజాలోని క్రాఫ్ట్‌ కుటీర్‌లో ఉంచుతున్నారు.

330
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles