దస్తావేజుల డిజిటలైజేషన్

Tue,August 20, 2019 07:50 AM

Digitization of documents

హైదరాబాద్: వంద సంవత్సరాలకుపైగా దుమ్ముపట్టి చిరిగిపోతున్న స్థిరాస్తులకు సంబంధించిన దస్తావేజులకు ఎట్టకేలకు మోక్షం లభించనున్నది. రిజిస్ట్రేషనశాఖలో 1860 నుంచి 1999 వరకు మాన్యువల్‌గా (చేతిరాత) ఉన్న స్థిరాస్తుల దస్తావేజులను డిజిటలైజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు విడుదల చేసింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ రికార్డుల డిజిటలైజేషన్ బాధ్యతను తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్‌కు అప్పగించగా, టెండర్లను ఆహ్వానించింది. వాస్తవానికి బ్రిటీష్ కాలం1860 నుంచి స్థిరాస్తులకు సంబంధించి దస్తావేజుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ అధికారికంగా జరుగుతున్నది. చేతిరాత ద్వారా దస్తావేజులను తయారుచేసి రిజిస్ట్రేషన్‌చేసేవారు. రెండు కాపీలను అమ్మకందారులకు, కొనుగోలుదారులకు ఇచ్చి మరోకాపీని రికార్డులలో భద్రపరిచేవారు. ఈ ప్రక్రియ 1999 వరకు కొనసాగింది. అదే సంవత్సరం ప్రభుత్వ శాఖల్లో మొదట రిజిస్ట్రేషన్‌శాఖలోనే కంప్యూటరీకరణ మొదలైంది. అప్పటి నుంచి రిజిస్ట్రేషన్‌శాఖను కంప్యూటర్ ఎయిడెడ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (కార్డ్)గా కూడా వ్యవహరిస్తున్నారు.

అంతకుపూర్వం 139 సంవత్సరాల నుంచి ఉన్న మాన్యువల్ దస్తావేజులను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంచేశాయి. లక్షల్లో ఉన్న పాత దస్తావేజులు బూజుపట్టి , శిథిలమై దీనావస్థకు చేరాయి. చేతిరాతతో ఉన్న కొన్ని ట్యాంపరింగ్ అవుతున్నాయని తరుచూ ఆరోపణలు వచ్చాయి. కొన్ని రికార్డులు గల్లంతైన సందర్భాలూ ఉన్నాయి. ఈ క్రమంలో 2005లో ప్రయోగాత్మకంగా హైదరాబాద్ జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అప్పటి జిల్లా రిజిస్ట్రార్, ప్రస్తుత జాయింట్ కమిషనర్ వేముల శ్రీనివాసులు ఆధ్వర్యంలో రికార్డుల డిజిటలైజేషన్ జరిగింది. సుమారు ఆరువేల రికార్డులను డిజిటలైజ్ చేశారు. ఈ తర్వాత రాష్టంలోని అన్ని కార్యాలయాల్లో రికార్డులను డిజిటలైజ్ చేయాలనే ప్రతిపాదన వచ్చినప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల డిజిటలైజేషన్ కోసం రూ. 20 కోట్లు మంజూరు చేసింది. దీనిపై ప్రస్తుత కమిషనర్ తోగర్ల చిరంజీవులు కసరత్తు జరిపి డిజిటలైజేషన్ బాధ్యతను టీఎస్‌టీఎస్‌కు అప్పగించారు. మరో రెండురోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తవుతుందని సమాచారం.

756
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles