రాకపోకలు ఆగలేదు.. కనిపించని సమ్మె ప్రభావం..

Thu,October 10, 2019 10:00 AM

హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె ప్రభావం నగరంలో పెద్దగా కన్పించలేదు. సమ్మె ప్రభావాన్నికనబడనీయకుండా అధికార యంత్రాంగం ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ అధికారులు చేతులెత్తేయడంతో రవాణాశాఖ అధికారులు రంగంలోకి దిగి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. ఒక పక్క సమ్మెను వ్యతిరేకిస్తున్నట్లు వ్యవహరిస్తూనే అంతర్గతంగా చాలా మంది అధికారులు సమ్మెకు మద్దతు ఇస్తుండటంతో ప్రభుత్వం రవాణాశాఖ అధికారులకు బాధ్యతలు అప్పగించింది. అందులో భాగంగా అధికారులు ప్రైవేటు వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులను తిప్పేందుకు ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లను తాత్కాలికంగా నియమించుకొని బస్సులను నడిపిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ పరిధిలో 3,519 బస్సులు ప్రతి రోజు తిరుగుతూ 35 లక్షల మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చుతున్నాయి.


ఐతే సమ్మె ప్రారంభమై ఐదు రోజులవుతున్నప్పటికీ నగరంలో ఎటువంటి ప్రభావం లేకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 29 డిపోల నుంచి బస్సులను ఆపరేట్ చేస్తున్నారు. దీనికోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లుతో సమన్వయం చేసుకుంటూ హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ పాండురంగనాయక్, రంగారెడ్డిజిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ప్రవీణ్‌రావు, మేడ్చల్ జిల్లా డిస్ట్రిక్ట్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్ (డీటీఓ) కిషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఖైరతాబాద్ ఆర్‌టీవోలు రాంచందర్, దుర్గప్రసాద్, తిరుమలగిరి ఆర్‌టీవో శ్రీనివాసరెడ్డి, మెహిదీపట్నం ఆర్‌టీవో సీపీ వెంకటేశ్వర్లు, బండ్లగూడ ఆర్‌టీవో సదానందం మలక్‌పేట ఆర్‌టీవో సుభాష్ చంద్రారెడ్డి, నాగోల్ ఆర్‌టీవో సురేశ్‌రెడ్డితోపాటు డీటీవో మేడ్చల్ ఆర్‌టీఓ కిషన్, ఉప్పల్ ఆర్‌టీవో రవీందర్ గౌడ్, రంగారెడ్డి జిల్లా పరిధిలో డీటీసీ ప్రవీణ్‌రావుతోపాటు మన్నెగూడ ఆర్‌టీవో రఘునందన్ గౌడ్ ఆధ్వర్యంలో ఎంవీఐలు, ఏఎంవీఐలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు కలిసి వాహనాలు, డ్రైవర్ల సమీకరణ, డ్రైవింగ్ టెస్టింగ్ వంటి బాధ్యతలు తీసుకున్నారు.

దసరా పండుగ సందర్భంగా పూర్తిస్థాయిలో బాధ్యతలు తీసుకొని ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూశారు. ఆర్టీసీ, రవాణాశాఖ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ అవసరమైన వాహనాలను డిమాండ్ మేర అందుబాటులో ఉంచుతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది ఉన్నప్పటికీ నగర ప్రయాణికులకు ఎటువంటి ప్రయాణ ఇబ్బందులు లేవు. గ్రేటర్ పరిధిలోని 29 డిపోల్లో ప్రతి డిపో నుంచి బస్సులు నడుస్తున్నాయి. వీటితోపాటు సెట్విన్ కూడా రంగంలోకి దిగడంతో ఎటువంటి ఇబ్బందులు కనబడటం లేదు. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులతోపాటు, మ్యాక్సీ క్యాబ్‌లు, సెట్విన్ బస్సులతోపాటు ఆటో రిక్షాలు, ప్రైవేటు వాహనాలు తిరుగడంతో సమ్మె ప్రభావమే కనబడటం లేదు. నగరంలో ఉన్న అరకోటికి పైగా వాహనాలలో గ్రేటర్‌లో 1.3 లక్షల ఆటోరిక్షాలు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. వీటితోపాటు వ్యక్తిగత వాహనాలలో ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. దీనికితోడు ఎంఎంటీఎస్, మెట్రోరైళ్లలో ప్రయాణికులు తమ అవసరాల కోసం ప్రయాణించారు.

1449
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles