రాష్ట్ర ప్రజలకు డీజీపీ మహేందర్‌రెడ్డి విజ్ఞప్తి

Wed,June 12, 2019 07:14 PM

dgp mahender reddy appeal to People

హైదరాబాద్‌: రాష్ట్రంలో మహిళలు, పిల్లలు, పెద్దలు పెద్ద సంఖ్యలో తప్పిపోతున్నారంటూ జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని డీజీపీ మహేందర్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ట్విట్టర్‌ ద్వారా డీజీపీ స్పందిస్తూ.. మిస్సింగ్‌ కేసుల్లో చాలా వరకు కుటుంబ, ప్రేమ వ్యవహారం, పరీక్షలు తప్పడం వంటి వివిధ కారణాలతో ఇంటిని విడిచి వెళ్తున్నట్లు చెప్పారు. తల్లిదండ్రులపై అలిగి వెళ్లిపోయిన పిల్లలు, పిల్లల సంరక్షణ దొరకని తల్లిదండ్రులు ఇలా పలు రకాలుగా ఉన్నారన్నారు. నమోదైన అన్ని కేసుల్లో 85 శాతానికి పైగా కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. మిగిలిన కేసుల పరిష్కారానికి కూడా పోలీస్‌ శాఖ అన్ని ప్రయత్నాలు చేస్తుందన్నారు. సమాజంలోని అన్ని వర్గాల భద్రతకు కట్టుబడి పోలీసు సిబ్బంది అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు. ప్రజల్లో భయాందోళనలను సృష్టించే విధంగా ఎవరైనా పుకార్లను సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాపింపచేయవద్దన్నారు. అలా ఎవరైనా చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మహిళలు, యువతులు, చిన్నారులు అదృశ్యమైపోతున్నట్లు.. వీరి ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు సరైన చర్యలు తీసుకోవట్లేదని పేర్కొంటూ పలు ప్రచార, ప్రసార సాధనాల్లో ప్రచారం జరిగింది. ఈ అంశాన్ని పోలీస్‌శాఖ తీవ్రంగా ఖండించింది. 2018లో నమోదైన మిస్సింగ్‌ కేసుల్లో 85 శాతం మంది ఆచూకీని కనుగొన్నట్లు డీజీపీ తెలిపారు. వ్యక్తుల అదృశ్యం ఫిర్యాదులపై పోలీసు సిబ్బంది ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేసి దర్యాప్తుకు తక్షణ చర్యలు చేపడుతుందన్నారు. అన్ని పెట్రోలింగ్‌ వాహనాలు, బ్లూ కోట్ల్స్‌, బీట్‌ ఆఫీసర్లు, దర్యాప్తు అధికారులులందరూ తప్పిపోయిన వ్యక్తుల ఫోటోలను కలిగి ఉన్నారన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వారి ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. పోలీస్‌ సిబ్బంది ఫేషియల్‌ రికగ్నైజింగ్‌ సిస్టం(ఎఫ్‌ఆర్‌ఎస్‌)ను ఉపయోగించి వ్యక్తుల గుర్తింపు, ఆచూకీని కనుగొంటున్నట్లు తెలిపారు. ఈ విధమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో తెలంగాణ పోలీస్‌ శాఖ ముందుందన్నారు. అదేవిధంగా అదృశ్యమైన వ్యక్తుల ఆచూకీని కనుగొనేందుకు సీఐడీ ప్రత్యేక వింగ్‌ను కలిగి ఉన్నట్లు చెప్పారు. వాస్తవాలను తెలుసుకోకుండా ఇటువంటి వార్తాలను ప్రచారం చేయడం ద్వారా ప్రజలను ఆందోళనకు గురిచేయొద్దని డీజీపీ పేర్కొన్నారు.9136
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles