సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు : డిప్యూటీ స్పీకర్

Mon,February 25, 2019 12:08 PM

Deputy Speaker Padmarao Goud speaks in Telangana Assembly

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన సికింద్రాబాద్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్.. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మిగతా సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. శాసనసభలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ మాట్లాడుతూ.. శాసనసభ సభా నాయకులు సీఎం కేసీఆర్, సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రతిపక్ష నాయకులు, శాసనసభ్యులు.. తెలంగాణ రెండో శాసనసభకు నన్ను ఉప సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థకు చట్టసభలే పట్టుగొమ్మలు. ప్రజాస్వామ్యంలో అత్యున్నత స్థానాన్ని కలిగిన శాసనసభకు గౌరవ ఉప సభాపతిగా ఎన్నికైన తర్వాత సభలో నిష్పక్షపాతంగా, ప్రజలకు ఉపయోగపడే చర్చలు ఈ సభలో చోటు చేసుకోవాలని ఇందుకోసం సభ్యులందరికీ సముచిత అవకాశాలు కల్పించాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం.

చట్ట సభలు ఎక్కడైతో స్ఫూర్తివంతంగా, ఉపయుక్తమైన చర్చలు చేస్తూ ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు నెలవులుగా ఉంటాయో అక్కడ ఆయా సమాజాలు అద్భుతమైన అభివృద్ధిని, ఫలితాలను ఆవిష్కరించుకుంటున్నాయి. ఉప సభాపతిగా ఎన్నికయ్యేందుకు మీరంతా ఏ విధంగా సహకరించారో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా శాసనసభలో నా కర్తవ్యాన్ని నిర్వహించేందుకు ఇదే సహకారాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.

వర్తమాన తరానికే కాకుండా భావితరాల వారికి స్ఫూర్తివంతంగా సభా కార్యక్రమాలు నిర్వహించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. మన శాసనసభ ప్రతిష్టను ఇనుమడింపజేసేందుకు ఉప సభాపతిగా నా ఎన్నికను అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవం చేసి మంచి సంప్రదాయాన్ని నెలకొల్పినందుకు మరొక్కసారి సభలోని ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్యంలో అధికారపక్షవారమైనా, ప్రతిపక్షవారమైనా మన అంతిమ లక్ష్యం ఉన్నతమైన మానవీయ విలువలను పెంపొందించడమే కాబట్టి మనమంతా కలిసి పని చేయగలిగితే అద్భుతమైన ఫలితాలను సాధించగల్గుతాం.

మన శాసనసభకు దేశంలోనే ఒక ప్రత్యేకత ఉంది. అర్థవంతమైన చర్చలు జరుగుతాయని, చక్కటి పంథాలో సభ నిర్వహణ జరుగుతుందని మన శాసనసభకు కీర్తి, ప్రతిష్ఠ ఉంది. ఈ ప్రతిష్ఠతను మరింతగా ఇనుమడింపజేసేందుకు మీ అందరి సహకారం తీసుకొని మీరు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి సభా గౌరవం మరింతగా పెరిగేందుకు కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. ప్రజాస్వామ్య విలువలను పెంపొందిస్తూ మంచి సంప్రదాయాలకు శ్రీకారం చుడుతూ మన శాసనసభ ఇతర శాసనసభలకు మార్గదర్శకంగా నిలిచేలా మనమంతా కలిసి పని చేద్దామని కోరుకుంటున్నాను.

అదే విధంగా ఈ సభా కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయడంలో ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా ప్రముఖపాత్ర వహించాల్సి ఉంటుంది. కనుక పత్రికా ప్రతినిధులందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నన్ను ఉప సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మరొక్కసారి సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు.

1462
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles