ప్రతి ఊరు నుంచి ఒక ట్రాక్టర్ సభకు తరలి రావాలి: కడియం

Thu,August 30, 2018 06:32 PM

deputy cm kadiyam srihari participated in narsampet plenary meeting

నర్సంపేట: ప్రతి ఊరు నుంచి ఒక ట్రాక్టర్ సెప్టెంబర్ 2న జరిగే ప్రగతి నివేదన సభకు తరలిరావాలని మంత్రి కడియం శ్రీహరి అన్నారు. అందరూ సెప్టెంబర్ 1నే సభకు చేరుకోవాలని.. 2వ తేదీన ట్రాక్టర్ రోడ్ మీదికి తీసుకొస్తే కేసు అవుతుందని మంత్రి అన్నారు. వాహనం ఎక్కిన ప్రతి ఒక్కరి వివరాలు తీసుకోవాలన్నారు. వారి బాధ్యతలు తీసుకోవాలన్నారు. వచ్చిన ప్రతి ట్రాక్టర్, బస్సు, వాహనం సభ వరకు రావాలన్నారు. సభలో జనం కనపడాలి.. ఎవరికీ ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాలని.. వచ్చిన వారిని అంతే బాధ్యతతో తిరిగి ఇంటికి చేర్చాని.. సభను విజయవంతం చేసి చరిత్ర సృష్టించాలని మంత్రి కడియం శ్రీహరి కోరారు. నర్సంపేట నియోజక వర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి కడియం శ్రీహరి పాల్గొని ఈసందర్భంగా ప్రసంగించారు.

"సెప్టెంబర్ 2న రంగారెడ్డి జిల్లా, కొంగర కలాన్ వద్ద 25 లక్షల మందితో ప్రగతి నివేదన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఈ సభతో దేశంలో చరిత్ర సృష్టించిన వాళ్ళం అవుతాం. దేశంలో ఏ పార్టీ కూడా ఇంత పెద్ద ఎత్తున సభ పెట్టలేదు. గతంలో కూడా పెద్ద సభలు పెట్టిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీదే. మళ్ళీ తన రికార్డులను తనే తిరగరాసుకోనుంది. ఎక్కడికి వెళ్లినా సభకు రావడానికి జనం నుంచి గొప్ప స్పందన ఉంది. వచ్చే ప్రజలందరికీ వాహనాలు సమకూర్చే పరిస్థితి మాకు లేదు. ఇంత గొప్పగా ప్రజలు పార్టీ కోసం తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు.

ముఖ్యమంత్రి గా కేసీఆర్ పాలన చేపట్టి 4 సంవత్సరాల 3 నెలల కాలంలో చేపట్టిన పథకాలు దేశంలో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ప్రధాని పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తుంది. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ గోడవల్లో మునిగి తెలుతున్నది. దీన్ని బట్టి తెలంగాణ అభివృద్ధి సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎలా ఉందో అర్థమవుతుంది. ఉద్యమ సమయంలో రైతు ఆత్మహత్యలను చూసిన సీఎం కేసీఆర్ అధికారంలోకి వస్తే వారి రుణాలు మాఫీ చేస్తానని చెప్పి, పాలన చేపట్టిన తర్వాత 4 విడతల్లో 17 వేల కోట్ల రూపాయలు రైతు రుణాలు మాఫీ చేశారు.

ఆనాడు కరెంట్ కోతలతో అనేక కష్టాలు పడ్డాము. తెలంగాణ వస్తే ఇక్కడ కరెంట్ ఉండదు, చీకట్లు ఉంటాయని నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కానీ 6 గంటలు కూడా రాని కరెంట్ నుంచి నేడు 24 గంటలు ఉచిత నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామంటే ఇదొక అద్భుతం కాదా? సీఎం కేసీఆర్ చేసి చూపిన అద్భుతం ఇది. ఈపని కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ఎందుకు చేయలేదు. తెలంగాణలో ఇప్పుడు 24 గంటలు కరెంట్ రావడం సాధారణం అయ్యింది. దేశంలో కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారా? మరి తెలంగాణలో ఇస్తుంటే సంతోషించక విమర్శలు చేస్తారా?

అంతెందుకు గత పాలనలో యూరియా బస్తా కోసం ఉప్పలయ్య అనే రైతు షాప్ మూసేస్తే ఇక దొరకదేమోనని భయపడి పరుగెత్తితే.. గుండెపోటు వచ్చి చనిపోయారు. మేం ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా చేస్తే ఇంకా మాపై కేసులు ఉన్నాయి. కానీ ఈ 4 ఏళ్లలో ఎప్పుడైనా ఈ పరిస్థితి ఉందా? రైతులకు ఎన్ని ఎరువులు, విత్తనాలు కావాలో ఆలోచించి ముందే తెచ్చి పెడుతున్నారు సీఎం కేసీఆర్. దేశంలో రైతుకు పంట పెట్టుబడి అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. కొంతమంది 4000 రూపాయలు ఏ మూలకు చాలుతాయి అంటారు. అవును చాలకపోవచ్చు కానీ ఆమాత్రం కూడా రైతుకు ఇస్తుంది కూడా తెలంగాణ ప్రభుత్వమే.

పెట్టుబడి మాత్రమే కాదు రైతు దురదృష్టవశాత్తు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడకుండా 5 లక్షల బీమా కల్పిస్తున్న ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇందు కోసం రైతు తరపున ఏటా 2271 ప్రీమియం చెల్లిస్తున్నాం. చనిపోతే 10 రోజుల్లో బీమా మొత్తం కుటుంబానికి అందిస్తున్నాం. కాంగ్రెస్ వాళ్లు ఎప్పుడైనా ఇలాంటి మంచి పనులు చేశారా? రైతులకు ఒక్క నర్సంపేటలో సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 450 ట్రాక్టర్లు ఇచ్చారు. ఒక ఎమ్మెల్యే కూడా ఇన్ని ట్రాక్టర్లు తెచ్చుకోలేదు. ఎప్పుడైనా ఇన్ని ట్రాక్టర్లు సబ్సిడీపై గతంలో వచ్చాయా? కాంగ్రెస్ నేతల కళ్ళకు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడంలేదు. కంటివెలుగు కింద పరీక్షలు చేసుకొని అయినా జరిగే అభివృద్ధి చూడాలి అని సలహా ఇస్తున్నా.

ఓడిపోతామని టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్తుంది అంటున్నారు. ఎవరైనా ఓడిపోయేవాళ్ళు ఎన్నికలకు వెళ్తారా? మీకు గెలుస్తామనే నమ్మకం ఉంటే ఎన్నికలు వస్తే ఇంకా ముందే అధికారంలోకి మీరే వస్తారు కదా? మరి ముందస్తు అంటే ఎందుకు మీ లాగులు, పంచెలు తడుస్తున్నాయి. ఈ సభ తర్వాత కాంగ్రెస్ వాళ్లకి అభ్యర్థులు కూడా దొరకరు. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే దోపిడీ చేశారు. దోచుకున్నారు. కేసులలో ఇరుక్కున్నారు. ఇలాంటి దొంగలకు మళ్ళీ అధికారం ఇవ్వాలా?

కాంగ్రెసులో జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డి.కె.అరుణ, మొన్ననే చేరిన రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి దామోదర రాజనర్సిహ్మ.. ఇంకా చాలామంది ముఖ్యమంత్రి అవుతామంటారు. తెలంగాణలో ఒక్కరే సీఎం అవుతారు. మరి ఇంతమంది ఎక్కడ సీఎంలు అవుతారు. కనీసం ఎమ్మెల్యేగా గెలుస్తారా వీళ్ళు? ముందస్తు ఎన్నికలు అని సీఎం కేసీఆర్ చెప్పారా? ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఎన్నికలకు మేం భయపడం. కాంగ్రెస్ కు ఈ భయం ఉంది.

మొన్న కూడా సుదర్శన్ రెడ్డి 20 కోట్ల రూపాయలను మున్సిపాలిటీ కోసం కొట్లాడి తెచ్చారు. సరైన వ్యక్తిని ఎన్నుకోక ఈ నర్సంపేట ఎంత నష్టపోయింది. ఇంకా నష్టపోవాలా? గతంలో చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకోవాలి. సీఎం కేసీఆర్ చెప్పే వంద గెలిచే నియోజకవర్గాల్లో నర్సంపేట మొదటిది కావాలి. అభివృద్ధి చేసే సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే కావాలి.." అని మంత్రి కడియం తెలిపారు. ఈ సమావేశంలో సివిల్ సప్లై కార్పోరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ విప్ బోడెకుంటి వెంకటేశ్వర్లు, పార్టీ పరిశీలకులు గద్దల నర్సింగ్, యాదగిరి, స్థానిక నేతలు పాల్గొన్నారు.

3533
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles