కాలానికనుగుణంగా రాజకీయ పార్టీలు మారాలి: మంత్రి కడియం

Fri,May 19, 2017 03:31 PM

Deputy Chief Minister Kadiyam Srihari participate 128th birth anniversary of  Ho Chi Minh

హైదరాబాద్ : ఆలిండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వియత్నాం జాతిపిత హోచిమిన్ 128వ జయంతి ఉత్సవాల్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... మారుతున్న కాలానికనుగుణంగా రాజకీయ పార్టీలు మారాలని, ప్రజల అవసరాల మేరకే పనిచేయాలని అన్నారు. పార్టీలను ప్రజలు ఆదరించడం లేదంటే ఆ పార్టీ నాయకుల్లోనో, సిద్ధాంతాల్లోనో ఏదో లోపం ఉన్నట్లు గుర్తించాలని పేర్కొన్నారు.

వియత్నాంలో మంచి అభివృద్ధి జరుగుతుంది. అక్కడ ఏకపార్టీ కమ్యూనిస్టు వ్యవస్థ ఉంది. ఈ దేశాన్ని మన ముఖ్యమంత్రి కేసిఆర్ చూసి వస్తే మంచిదన్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాటలకు కడియం వేదిక మీదే బదులిచ్చారు. వియత్నాం గెరిల్లా పోరాటాల ద్వారా హోచిమన్ నాయకత్వంలో స్వాతంత్ర్యాన్ని సాధించిందని, భారతదేశం అహింసా విధానంలో గాంధీజీ నేతృత్వంలో స్వాతంత్ర్యం సాధించిందన్నారు. అదే అహింసా విధానంలోనే తెలంగాణ ప్రజల సమిష్టి పోరాటాలతో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామ‌ని తెలిపారు.

వియత్నాం స్వాంతంత్ర్యం పొంది 72 సంవత్సరాలు అవుతుంటే..తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చి మూడేళ్లు మాత్రమే అయింది. ఇప్పుడే వియత్నాం అభివృద్ధితో తెలంగాణ పోల్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. మంచి విధానాలు ఎక్కడున్నా అక్కడికి వెళ్లి చూసిరావడం మంచిదే . నార్వే, డెన్మార్క్, స్వీడన్ లు కూడా మంచి అభివృద్ధి సాధిస్తున్నాయని పేర్కొన్నారు.

ప్రజలకు మేలు చేసే కమ్యూనిజం ఆలోచనలు ప్రతి ఒక్కరిలో ఉండాలి కానీ, కమ్యూనిస్టు పార్టీలోనే ఉండాలనేది కరెక్టు కాదు. ఏ పార్టీలో ఉన్నా ప్రజల సమస్యలను పరిష్కరించే నాయకత్వం కావాలి. ముఖ్యంగా ప్రజల మద్దతు లేకుండా పార్టీలకు మనుగడ ఉండదని, అలాంటప్పుడు ఆ పార్టీల్లో ఏదో లోపం ఉందని గుర్తించాల్సిందిగా సలహా ఇచ్చారు. తాను బిఎస్సీ చదువుతున్న సమయంలో 1969 నుంచి 1975 వరకు హాస్టళ్లలోకి రాత్రులు వచ్చి వియాత్నం యుద్ధం గురించి క్లాసులు చెప్పేవారని, అర్ధరాత్రి చెప్పే క్లాసుల్లో అది సరిగ్గా అర్థం కాకపోయేదన్నారు. విప్లవాల వైపు మళ్లించే విధంగా ఆ క్లాసులు ఉండేవని గుర్తు చేసుకున్నారు.

భారతదేశ ప్రజలు శాంతి కాముకులు. కనీస మౌలిక వసతులు లేకున్నా కూడా శాంతియుతంగానే ఉంటున్నారు. వారి అవసరాలు గుర్తించి వాటిని తీర్చాల్సిన బాధ్యత పాలకుదేన‌ని తెలిపారు. వియత్నాం జాతిపిత హోచిమిన్ జీవితచరిత్రపై రాసిన ఈ పుస్తకం బాగుందని, ఈతరం యువతకు ఇది ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు. ఈ పుస్తకాన్ని ప్రభుత్వం తరపున కొనుగోలు చేయించి గ్రంథాలయాల్లో పెట్టే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్ల‌డించారు.

ఈ ఉత్సవాలకు ఎమ్మెల్సీ యాదవరెడ్డి ఆలిండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్, తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా అధ్యక్షత వహించగా..వియత్నాం అంబాసిడర్ తన్ సిన్ తాన్ , సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఆలిండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ సభ్యులు హాజరయ్యారు.

731
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles