సైబర్ క్రైమ్‌కు వాట్సాప్ ద్వారా చెక్!

Tue,October 3, 2017 07:43 AM

cyberabad cyber crime police whatsapp awareness

హైదరాబాద్ : సైబర్ మాయగాళ్ల బారిన అమాయకులు చిక్కకుండా ఉండేందుకు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు తాజాగా వాట్సాప్‌పై ఆధారపడుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా తో పాటు ఇతర కార్యక్రమాలను వేదికగా చేసుకుని అవగాహన ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. అయినా ప్రజల్లో మార్పు రాకపోవడం పోలీసులను కొంత అసంతృప్తికి గురి చేస్తోంది. దీంతో తమ వంతు ప్రయత్నంగా ప్రజలను సైబర్ నేరగాళ్ల మాయలో పడకుండా ఉండేందుకు పోలీసుల హెచ్చరిక అంటూ వాట్సాప్‌లో సైబర్‌క్రైం నివారణ చిట్కాలను వైరల్ చేసున్నారు.

తాజాగా ప్రతి రోజు బ్యాంకు అధికారుల పేర్లతో వస్తున్న ఫోన్ కాల్స్, ఇక్కడి వారి డెబిట్, క్రెడిట్ కార్టులను విదేశాల్లో క్లోనింగ్ చేస్తుండడం, కార్డుల అప్‌డేట్ పేరుతో వస్తున్న ఫోన్ కాల్స్‌కు సుమారు ప్రతి రోజు సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్‌ల పరిధిలో 15 మంది వరకు మోసపోతున్నారు. వేల రూపాయల నగదు ప్రతి రోజు సైబర్ మోసగాళ్ల ఖాతాలో పడుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండడం.... ఇప్పుడు యుద్ధప్రాతిపదికన అవసరాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో వారి విధుల్లో మరో ప్రయత్నంగా పలు సూచనలను రూపొందించి వాటిని వాట్సా ప్ వైరల్‌గా ప్రచారం చేస్తున్నారు.

వాట్సాప్‌లో పోలీసుల సూచనలు
ఇటీవల వచ్చిన ఫిర్యాదులను విశ్లేషించిన పోలీసులు సైబర్ నేరగాళ్లుగా అనుమానిస్తున్న యువకులు ఎక్కువగా ఢిల్లీ, ముంబై, జార్ఖండ్, బీహార్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి బ్యాంకు మేనేజర్లుగా ఫోన్‌లు చేస్తూ ఖాతాదారులను బురిడీ కొట్టిస్తున్నారని తెలుస్తోంది.

* మీకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బ్యాంకు మేనేజరంటూ ఫోన్ చేసి మీ ఖాతా వివరాలు అడిగితే చెప్పొద్దు.
* సైబర్ నేరగాళ్లు ఆంగ్లం లేదా హిందీలో మాట్లాడుతారు.. మన భాష తెలుగు కావడంతో బ్యాంకుకు సంబంధించిన అధికారులు తెలుగులో మాట్లాడుతారు. అది గుర్తు పెట్టుకోవాలి. వారి మాట్లాడే తీరును పసిగట్టి అనుమానించి నిలదీయాలి.
* గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంకు వివరాలు అడిగితే...వివరాలను స్వయంగా బ్యాంకు కార్యాలయానికి వచ్చి చెప్పుతామని స్పష్టంగా చెప్పండి.
* అప్రమత్తంగా లేకుంటే... మీ వివరాలను తీసుకుని వాటి ద్వారా ఆన్‌లైన్ షాపింగ్ చేసి లేదామీ ఖాతా నుంచి నగదును తమ ఖాతాల్లోకి మళ్లించుకుంటారు.
* అలర్ట్‌గా ఉండి కష్టపడి సంపాదించిన సొమ్మును జాగ్రత్తగా కాపాడుకోండి.
* సైబర్ మాయగాళ్ల మాటలకు 70 శాతం మంది చదువుకున్న వారే మోసపోతుండడం మరింతగా బాధిస్తుంది.
* అనుమానం రాగానే వెంటనే ఫోన్ కట్ చేయాలి లేదా వెంటనే పోలీసులను అప్రమత్తం చేయాలి లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
ఈ చిట్కాలను మీరు చదివి మర్చిపోకుండా వాట్సాప్‌లో మరికొంత మందికి షేర్ చేసి అందర్నీ అప్రమత్తం చేయండంటూ సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కోరుతున్నారు. దీంతో సైబర్ క్రైమ్స్‌పై పోలీసుల సూచన ఇప్పుడు వాట్సాప్‌లో వైరల్‌గా మారుతోంది.

1001
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles