సీపీఐకి ఐదారు సీట్లు ఇవ్వకపోతే మాదారి మాదే.. మీదారి మీదే!

Mon,October 15, 2018 09:42 PM

cpi leader sambashivarao ultimatum to congress party in wyra road show

కాంగ్రెస్‌కు అల్టిమేటమ్ జారీ చేసిన సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
ఖమ్మం: ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో మహాకూటమి నుంచి సీపీఐ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా ఐదారు సీట్లు ఇవ్వకపోతే మాదారి మాదే, మీదారి మీదే అని మహాకూటమిలోని కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలకు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అల్టిమేటర్‌ను జారీ చేశారు. మహాకూటమిలో సీట్ల కోసం విబేధాలు తారాస్థాయికి చేరడంతో సీపీఐ ఆధ్వర్యంలో వైరా నియోజకవర్గంలోని కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామం నుంచి జూలురుపాడు వరకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం బైక్ ర్యాలీలతో రోడ్‌షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిధిగా హాజరై రోడ్‌షోలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వైరాలోని మధిర క్రాస్ రోడ్డులో జరిగిన రోడ్‌షోలో కూనంనేని సాంబశివరావు ప్రసంగిస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం కావాలా, సీపీఐకు ఇవ్వాల్సిన సీట్లు కావాలా అంటూ ప్రశ్నించారు. మహాకూటమిలో భాగంగా ఉన్న సీపీఐ వైరాలో రోడ్‌షో నిర్వహించడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా బహిరంగంగా ప్రకటించకుండా రోడ్‌షో ప్రచార వాహనంపై కొత్తగూడెంకు చెందిన బానోత్ విజయను ఉంచి ప్రచారం చేశారు. బానోత్ విజయనే వైరా నియోజకవర్గ సీపీఐ అభ్యర్ధి అని పరోక్షంగా ప్రజలకు తెలిపేందుకే ఈ రోడ్‌షో నిర్వహించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, నాయకులు యర్రా బాబు, దొండపాటి రమేష్, అడపా రామకోటయ్య, పోటు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

2686
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles