కాంగ్రెస్,బాబుతో తెలంగాణకు ముప్పు

Tue,September 25, 2018 09:40 PM

congress, tdp alliance danger for telangana

బాల్కొండ: ఎన్నో త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ర్టానికి కాంగ్రెస్ పార్టీ, టీడీపీ అధినేత చంద్రబాబుతో ముప్పు ఉందని మిషన్ భగీరథ వైస్ చైర్మన్, బాల్కొండ తాజా మాజీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్ బాల్కొండ మండలంలోని వన్నెల్ (బి), కిసాన్‌నగర్ గ్రామాల్లో మంగళవారం పలు అభివృద్ధి పనులకు బాల్కొండ ఎంపీపీ అర్గుల రాధతో కలిసి ఆయన హాజరయ్యారు.మండలంలోని వన్నెల్(బి), కిసాన్‌నగర్ గ్రామాల్లో ప్రశాంత్‌రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కిసాన్‌నగర్‌లో మహిళలు బోనాలతో స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సీఎం కేసీఆర్ కృషి ఎంతో ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న చంద్రబాబునాయుడితో ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జతకట్టి మళ్లీ తెలంగాణకు అన్యాయం చేయడానికి ఓడిగట్టిందన్నారు. వీరి విషయంలో తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఇచ్చిన తెలంగాణను వెనక్కి నెట్టిన చంద్రబాబుకు తెలంగాణలో స్థానం లేకుండా చేయాలన్నారు. బాల్కొండ నియోజక వర్గంలో పద్మశాలీల అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానని అన్నారు. రైతుబీమా, రైతబంధు, ఆసరా పింఛన్లు, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ఒంటరి మహిళలకు పింఛన్ ఇచ్చి ఆదుకున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఒకప్పుడు దొడ్డు బియ్యం, నీళ్లచారుతో చదువులు సాగించిన బడుగు,బలహీన విద్యార్థులు.. నేడు అనేక గురుకులాల ద్వారా కార్పొరేట్ విద్యను పొందుతున్నారని, మంచి ఆహారం తింటున్నారన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఎంతో మంది పేదలకు మేలు చేస్తుందన్నారు. నియోజకవర్గంలో సీడీఎఫ్ నిధులతో కల్యాణ మండపాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు.

3546
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles