కాంగ్రెస్‌లో నిరసన సెగలు..పార్టీ జెండా దిమ్మె ధ్వంసం

Fri,November 16, 2018 07:11 AM

congress leader karthik reddy protest in Rajendranagar

శంషాబాద్: కాంగ్రెస్‌లో నిరసన సెగలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. రాజేంద్రనగర్ టికెట్ ఆశించి మాజీ హోం మంత్రి సబితారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి భంగపడ్డారు. ఈ నేపథ్యంలో గురువారం శంషాబాద్‌లోని బేగం ఫంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాజేంద్రనగర్, శంషాబాద్ మండలాలతో పాటు నియోజకవర్గానికి చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, ఇతర కీలక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై చర్చించారు. పలువురు నేతలు అధిష్టానం తీరుపై మండిపడ్డారు. అనంతరం మూకుమ్మడిగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు పట్టణంలో నిరసన ర్యాలీ జరిపారు. అంబేద్కర్ చౌరస్తాలోని కాంగ్రెస్ జెండా దిమ్మెను కూల్చివేశారు. కాంగ్రెస్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. పార్టీ సీనియర్ నాయకుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

గెలువలేని వ్యక్తికి టికెట్ ఇచ్చారు..


మహాకూటమి వాస్తవ ఒప్పందాలను తుంగలో తొక్కి స్వార్థపరమైన వక్రబుద్ధితో కాంగ్రెస్‌కు టికెట్ ఇవ్వకుండా తమకు అన్యాయం చేశారని, దీనికి తామంతా సమర్పించిన రాజీనామాలను ఆమోదిస్తారా...? బీఫారమ్స్ ఇస్తారా అంటూ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీకి కార్తీక్‌రెడ్డి సవాలు విసిరారు. పార్టీ అధిష్టానం తీరును నిరసిస్తూ తనతో పాటు పార్టీ శ్రేణులు మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు. టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ అమ్ముడు పోయి ఏ మాత్రం గెలువలేని వ్యక్తికి టికెట్ కట్టబెట్టారని, కాంగ్రెస్‌కు ఇస్తే గెలుస్తుందని టికెట్ ఇవ్వకుండా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, జడ్పీటీసీ సతీశ్, మాజీ అధ్యక్షుడు వేణుగౌడ్, మాజీ ఎంపీపీ మురళీధర్‌రెడ్డి, శంషాబాద్ సర్పంచ్ సిద్ధేశ్వర్, ఎంపీపీ ఎల్లయ్య, జ్ఞానేశ్వర్, అశోక్, శంకర్‌రెడ్డి, రమణరెడ్డి పాల్గొన్నారు.

2161
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles