టీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్ నేత శేరి గోవర్ధన్ రెడ్డి.. కండువా కప్పి ఆహ్వానించిన ల‌క్ష్మారెడ్డి

Wed,May 16, 2018 08:07 PM

Congress leader govardan reddy joins in trs party in mahabubnagar

మాహబూబ్ నగర్: జడ్చర్ల నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. చేరికలతో ప్రతిపక్షాలకు దడ పుడుతున్నది. తాజాగా రాజపూర్ మండలం ఈదగానిపల్లి గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నేత శేరి గోవర్ధన్ రెడ్డి ఆ పార్టీ కి గుడ్ బై చెప్పారు. ఈదగానిపల్లి గ్రామంలో జరిగిన రైతు బంధు పథకం పాసు పుస్తకాలు-పంటల పెట్టుబడి చెక్కుల పంపిణీ కార్యక్రమం సందర్బంగా ఆయన మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. చెక్కుల పంపిణీ పూర్తయ్యాక, మంత్రిని తన ఇంటికి స్వాగతించిన గోవర్ధన్ రెడ్డి మంత్రి చేతుల మీదుగా గులాబీ కండువా కప్పుకుని టీఆర్‌ఎస్‌లో చేరినట్లు ప్రకటించారు.

ఈ సందర్బంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. 20 ఏళ్ల పాటు ఈదగానిపల్లి గ్రామానికి ఏకగ్రీవంగా సర్పంచ్ గా సేవలు అందించానన్నారు. తన రాజకీయ జీవితమంతా కాంగ్రెస్ లోనే గడిచిందన్నారు. అయితే తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ చేపడుతున్న పథకాలు, నియోజకవర్గంలో మంత్రి లక్ష్మారెడ్డి చేస్తున్న అభివృద్ధి గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. తాను చాలా కాలంగా ప్రభుత్వ పని తీరు నచ్చి కలసి వస్తున్నానని, ఈ రోజు అధికారికంగా చేరామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయానికి కృషి చేస్తానన్నారు.

ఈ సందర్బంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పునర్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రజలు పార్టీలకు అతీతంగా ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారన్నారు. కొన్ని పార్టీల నేతలు మాత్రం ఇంకా పాత చింతకాయ పచ్చడి విధానాలతో మగ్గి పోతున్నారని చెప్పారు. ఇంతగా అభివృద్ధి జరుగుతుంటే, అడ్డుకునే కుయుక్తులకు పాల్పడుతున్నారని చెప్పారు. అభివృద్ధిని అడ్డుకునే పార్టీల్లో ఇంకా ఉంటారా? ప్రజలు కోరుకునే ప్రగతి వైపు వస్తారా అన్నది ఆయా పార్టీల్లో ఉన్నవాళ్లు తేల్చుకోవాలన్నారు. ఇవ్వాళ గోవర్ధన్ రెడ్డి, మొన్న మాదారం లో రహమాన్ లాంటి వాళ్ళను చూసి మారాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మంత్రి వెంట నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ నాయకులు, రాజాపూర్ ఈదగానిపల్లి గ్రామ పార్టీ నేతలు, ప్రజలు, గోవర్ధన్ రెడ్డితో పాటు టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన అనుచరులు పాల్గొన్నారు.

2444
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles