కాంగ్రెస్‌లో డబ్బులు ఇస్తేనే టిక్కెటా..

Sat,November 17, 2018 09:00 PM

congres rebel vijayarama rao fires on uttam kumar reddy

- టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై కాంగ్రెస్ రెబల్ అభ్యర్ధి విజయరామారావు మండిపాటు
స్టేషన్‌ ఘన్‌పూర్‌: కాంగ్రెస్ పార్టీలో డబ్బులు ఇస్తేనే టిక్కెట్ ఇస్తారా..? ప్రజల్లో ఆదరణ ఉండి డబ్బులు లేనివారి పరిస్ధితి ఏమిటి? అని మాజీ మంత్రి డాక్టర్ గుండె విజయరామారావు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ప్రశ్నించారు. స్టేషన్‌ఘన్‌ఫూర్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా శనివారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జీగా ఉన్న తనకు టిక్కెట్ కేటాయించకపోవడంపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు.

గత ఐదేళ్లుగా నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడి, కార్యకర్తల కష్టసుఖాల్లో, ప్రజల సమస్యలపై పార్టీ పరంగా కొట్లాడినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం నియోజకవర్గంలో 270 బూతుల్లో కమిటీలను, మండల, పార్టీ అనుబంధ కమిటీలను వేసినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రతీ కార్యక్రమాన్ని నియోజక వర్గంలో ప్రజల సహకారంతో నిర్వహించినట్లు తెలిపారు. ఐదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఉనికిని క్షేత్రస్ధాయిలో కాపాడిన తనను పరిగణలోకి తీసుకోవాల్సిన నైతిక బాధ్యత అధిష్టానానికి ఉందన్నారు.

పార్టీలో సభ్యత్వం, ప్రజలతో సంబంధం లేని వాళ్లను, చీకటి వ్యాపారాలు, చీకటి ఒప్పందాలు పెట్టుకునే వారికి ఇవాళ కాంగ్రెస్ టిక్కెట్ కేటాయించడంలో ఆంతర్యమేమిటని, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమాధానం చెప్పాలని, లేదా క్షేత్రస్థాయిలో సమావేశం నిర్వహించి అసలు విషయాలను చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌లో ప్యారాచుట్ నేతలకు టిక్కెట్లు కేటాయించారని ఆయన తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉత్తుత్తి వాళ్లను ఎంపిక చేస్తే రేపటి ఎన్నికల్లో తగు మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హితవు పలికారు.

1944
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles