పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

Tue,March 13, 2018 10:17 PM

Complete arrangements for tenth class exams in telangana state

హైదరాబాద్ : తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ జీ కిషన్ తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, ఉదయం 8.45 గంటలకే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష ప్రారంభం అయ్యాక మరో ఐదు నిమిషాల వరకే గ్రేస్ పీరియడ్ ఉంటుందని, ఆ లోపు మాత్రమే లోపలికి అనుమతిస్తామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కిషన్ స్పష్టంచేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 11,103 పాఠశాలల నుంచి 5,38,867 మంది(బాలురు 2,76,388, బాలికలు 2,62,479) పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 5,03,117 మంది, ప్రైవేటు విద్యార్థులు 35,750 మంది ఉన్నట్టు చెప్పారు. ఒకేషనల్ అభ్యర్థులు 20,838 మంది హాజరవుతున్నారని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 2,542 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశామని, హాల్‌టికెట్లు అందని విద్యార్థులు www.bse.telangana.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. వీటిపై ప్రధానోపాధ్యాయుల సంతకం, స్టాంపు వేయించుకొని పరీక్షలకు హాజరుకావాలని తెలిపారు.

పరీక్షలను సజావుగా నిర్వహించడం కోసం 148 ఫ్లయింగ్‌స్క్వాడ్‌లను ఏర్పాటుచేశామని తెలిపారు. పరీక్షలపై సందేహాల నివృత్తి కోసం డీఈవో, ఎంఈవోలను నియమించామని, ప్రభుత్వ పరీక్షల విభాగంలో టోల్‌ఫ్రీ నంబర్(18004257462), కంట్రోల్‌రూం ఏర్పాటుచేశామని వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జవాబు పత్రాలను బయటకు తీసుకెళ్లవద్దని, ఆన్సర్‌షీట్‌పై పేర్లు, సంతకాలు, చిహ్నాలు, నినాదాలు రాయవద్దని సూచించారు. హాల్‌టికెట్ తప్ప ఇతర కాగితాలను పరీక్ష కేంద్రాల్లోకి తేవొద్దని, మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకొని డిబార్ చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ బీ సుధాకర్‌రెడ్డి, విజయభారతి తదితరులు పాల్గొన్నారు.

2332
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles