వివిధ ప్రవేశపరీక్షలకు పెరిగిన పోటీ..

Fri,May 24, 2019 06:39 AM

COMPETITION INCREASED FOR ENTRANCE TESTS IN TELANGANA


హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి పాలనా కాలంతో పోల్చుకుంటే ఇంజనీరింగ్‌, ఫార్మసీ వంటి వృత్తి విద్యా కోర్సుల్లో విద్యా ప్రమాణాలు మరింత మెరుగయ్యాయి. ఓవైపు కేజీ టూ పీజీ ఉచిత విద్యను అందిస్తూనే.. మరోవైపు ప్రొఫెషనల్‌ కోర్సుల పట్ల ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవతో ఇంజనీరింగ్‌ కాలేజీల్లో నాణ్యత ప్రమాణాలను పెంచడంతో విద్యార్థులకు జీవనోపాధి అవకాశాలు పెరిగాయనే చెప్పాలి. ల్యాబ్‌ పరికరాలు, గ్రంథాలయం, కంప్యూటర్లతో పాటు నాణ్యమైన ఫ్యాకల్టీతో ఉత్తమ విద్యాబోధన వల్ల విద్యార్థుల్లో సబ్జెక్టు పరిజ్ఞానం పెరిగింది. ఉమ్మడి పాలకులు స్వార్థం వల్ల రాష్ట్రం ఇబ్బడిముబ్బడిగా ఇంజనీరింగ్‌ కాలేజీలను ఏర్పాటు చేసి డబ్బులు దండుకోవడంపై పెట్టి దృష్టి.. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలనే విషయాన్ని విస్మరించారు. ఫలితంగా వందలాది మంది విద్యార్థులు ఇతర రాష్ర్టాలకు తరలివెళ్లారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో సొంత రాష్ట్రంలోనే చదివి ఉపాధిని సొంతం చేసుకుంటున్నారు. వీటన్నింటి ఫలితంగా రాష్ట్ర విద్యాశాఖ నిర్వహించే పలు ప్రవేశపరీక్షలకు విద్యార్థులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకుంటున్నారు.

ఇన్నోవేషన్లతో ప్రతిభ వెలుగులోకి..


రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఇన్నోవేషన్‌ హబ్‌లను ఏర్పాటు చేసింది. పలు అంకుర సంస్థలను ప్రోత్సహించి వారికి కావాల్సిన వసతులను కల్పించింది. వీటితో పాటు పలు ఇంజనీరింగ్‌ కాలేజీల్లోనూ ఇన్నోవేషన్‌ హబ్‌లను ఏర్పాటు చేసి విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీశారు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఇప్పటికే వారి వారి స్థాయిల్లో అనేక కొత్త ప్రాజెక్టులను రూపొందించి ఔరా అన్పించారు. ఆయా కాలేజీల విద్యార్థుల మధ్య స్నేహపూర్వక పోటీతో ఇన్నోవేషన్స్‌ను ఆవిష్కరించేలా చేశారు. దీంతో రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ విద్యా ప్రమాణాల మెరుగుకావడంతో పాటు విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలే పరమావధిగా కాకుండా ప్రైవేటు రంగంలో ఏలాంటి అవకాశాలు ఉంటాయి?, ఏలా రాణించగలమనే ధీమాను వ్యక్తం చేస్తూ.. ఇతర రాష్ర్టాల విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

ప్రధానంగా ఎంసెట్‌ ప్రవేశపరీక్షకు గత రెండేండ్ల కంటే దరఖాస్తులు భారీగా పెరిగాయి. మెడిసిన్‌, ఇంజనీరింగ్‌, ఫార్మసీ వంటి కోర్సులకు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలున్నప్పటికీ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టీఎస్‌ ఎంసెట్‌ వైపు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగానే 2017-18 విద్యా సంవత్సరంలో టీఎస్‌ ఎంసెట్‌కు 2,05,395 మంది దరఖాస్తు చేసుకోగా, 2018-19 విద్యా సంవత్సరంలో 2,03,163 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2019-20 విద్యా సంవత్సరానికొచ్చేసరికి ఏకంగా 2,17,434 మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. అయితే ఐసెట్‌, ఎడ్‌సెట్‌ వంటి కోర్సులకు ప్రస్తుత పరిస్థితుల్లో డిమాండ్‌ అంతగా లేదు. అయినా బోధనపరంగా ఉన్నత విద్య పూర్తి చేసిన వారినే బోధకులుగా తీసుకోవడంతో ఎడ్‌సెట్‌ పట్ల ఆసక్తి ఎక్కువ ఉన్నట్టే చెప్పాలి.

2084
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles