నేడు సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన

Fri,August 24, 2018 09:16 AM

CMKCR to visit Delhi today

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో కలిసి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ర్టానికి సంబంధించి కేంద్రప్రభుత్వం వద్ద పెండింగులో ఉన్న అంశాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు, ఇతర కేంద్ర మంత్రులతో సీఎం చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు విన్నవించినా.. కేంద్రం నుంచి ఆశించిన స్పందన రావడంలేదని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. తానే స్వయంగా వెళ్ళి అవసరమైతే ఢిల్లీలో రెండు, మూడు రోజులుండి.. ప్రధాని, ఇతర మంత్రులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. ముఖ్యంగా.. తెలంగాణలో కొత్తగా ఏర్పాటుచేసుకున్న జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదం లభించాల్సి ఉంది. కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం లభించకపోవడంతో పంచాయతీ కార్యదర్శుల నియామకంతోపాటు మరికొన్ని నియామకాల్లో జాప్యం జరుగుతున్నది. జోనల్ వ్యవస్థకు వెంటనే ఆమోదముద్ర వేయించే విషయంలో ప్రధాని చొరవ చూపాలని ముఖ్యమంత్రి కోరనున్నారు.

జోనల్ వ్యవస్థతోపాటు తెలంగాణ రాష్ర్టానికి రావాల్సిన అదనపు ఎఫ్‌ఆర్‌బీఎం నిధుల విడుదల, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఇవ్వాల్సిన రూ.450 కోట్ల నిధుల విడుదల, మహిళా సంఘాలు, రైతులకు ఇచ్చే రుణాలపై ఇచ్చే వడ్డీ రాయితీలో కేంద్ర ప్రభుత్వ వాటా విడుదల, హైకోర్టు విభజన, రీజనల్ రింగ్ రోడ్డుకు నిధులు, సెక్రటేరియట్ నిర్మాణానికి రక్షణశాఖ స్థలాల కేటాయింపు తదితర అంశాలపై ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులతో మాట్లాడి రావాలని సీఎం నిర్ణయించారు. ఈసారి రాష్ర్టానికి సంబంధించిన అంశాలపై కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యాన్ని ప్రధాని వద్ద ప్రస్తావించాలని సీఎం భావిస్తున్నారు. ముఖ్యమంత్రి వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు ఢిల్లీకి వెళ్తారు.

1037
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles