పోచారం ఆధ్వర్యంలో వ్యవసాయాభివృద్ధి: సీఎం కేసీఆర్

Fri,January 18, 2019 11:41 AM

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ సభాపతిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. స్పీకర్ గా పోచారం ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఆనందదాయకమైన విషయమన్నారు. స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేసిన కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.సభాపతి ఎన్నికను అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఒప్పుకోవడం హర్షణీయమన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి అనేక మెట్లు అధిగమిస్తూ ఆరు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. వ్యవసాయ శాఖ మంత్రిగా పోచారం హయాంలో తెలంగాణలో వ్యవసాయం బాగా అభివృద్ధి చెందింది. పోచారం ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రిగా పోచారం చేసిన సమయాన్ని నేను మరిచిపోలేను. పోచారం వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో మంచి పనులు జరిగాయి. రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి కూడా ప్రశంసించింది.

పోచారం కాలుమోపిన వేళా విశేషం బాగుంది..కాబట్టే వ్యవసాయంలో అద్భుత ఫలితాలు వచ్చాయని సీఎం కేసీఆర్ తెలిపారు. రైతు బంధు పథకం లాంటి పథకాన్ని ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నరు. వ్యవసాయ రంగంలో రాష్ట్రం ఇంత అభివృద్ధి సాధించిందంటే ఆ ఘనత వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పోచారం శ్రీనివాస్ రెడ్డిదే. పోచారం పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి 1977లో సింగిల్ విండో ఛైర్మన్ గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. బాన్సువాడ ఉప ఎన్నికలో అఖండమైన మెజార్టీతో గెలుపొందారు. అందుకే పోచారం శ్రీనివాస్ రెడ్డి లక్ష్మీపుత్రడని మేము పిలుచుకుంటమన్నారు.

పోచారం వ్యవసాయ యాంత్రీకరణ, అధునాతన వ్యవసాయ పద్దతులు ప్రవేశపెట్టారు. ఇటీవలే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నాతో స్వయంగా చెప్పారు. రైతు బంధు పథకాన్ని కాలియా అనే పేరుతో మా రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నమని నవీన్ పట్నాయక్ చెప్పారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా అక్కడ ఈ కార్యక్రమాన్నిచేపట్టారు. మిగితా చాలా రాష్ట్రాలు ఈ అంశాన్ని పరిశీలిస్తున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో గొప్ప సేవలు అందించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజ్యాంగ అత్యున్నత స్థానంలో బాధ్యతలు స్వీకరించడం పట్ల పోచారం గ్రామస్థులు సంబురాలు చేసుకున్నరని సీఎం కేసీఆర్ అన్నారు.

1239
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles