అవినీతిపై యుద్ధమే : సీఎం కేసీఆర్

Fri,April 21, 2017 05:08 PM

కల్తీ విత్తనాలమ్మే వారిపై ఉక్కుపాదం మోపుతాం
ప్రైవేటు ఆస్పత్రుల, పాఠశాలల ఆగడాలపై చర్యలు
కాంగ్రెస్, టీడీపీ హయాంలో రాష్ర్ట ఖజానాకు గండీ
చిత్తశుద్ధితో టీఆర్ఎస్ పాలన
అవినీతికి చోటివ్వం.. అవినీతిపై యుద్ధం చేస్తున్నాం


హైదరాబాద్ : అవినీతి రహిత తెలంగాణే లక్ష్యమని, అవినీతిపై యుద్ధం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రైతే రాజుగా తమ పాలన ఉంటుందన్నారు. కల్తీ విత్తనాలు అమ్మే వారిపై ఉక్కు పాదం మోపుతాం, కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. టీఆర్‌ఎస్ ప్లీనరీ ముగింపు ఉపన్యాసం సందర్భంగా సీఎం ప్రసంగించారు. కల్తీ విత్తనాల వల్ల రైతు ఎంత నష్టపోయిండో.. అంత మొత్తం ఆ కంపెనీ చెల్లించే విధంగా చట్టం కూడా తీసుకుని వస్తామని స్పష్టం చేశారు. వరంగల్ సభ అయిపోయిన తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి కల్తీ విత్తనాలపై చర్చిస్తామని చెప్పారు సీఎం. ఇప్పటికే కల్తీ విత్తనాలు అమ్మిన నలుగురిపై వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చర్యలు తీసుకుని పీడీ యాక్ట్ పెట్టారని తెలిపారు. ఆ నలుగురు ఇప్పుడు జైల్లో ఉన్నారు. కాబట్టి ఎవరూ కూడా కల్తీ విత్తనాలను అమ్మి రైతులను చెడగొట్టొద్దని సూచించారు.

ప్రైవేటు ఆస్పత్రులు చేసే రాక్షస విషయంలో, ప్రైవేటు యాజమాన్యాలు సతాయించే ఫీజుల విషయంలో కూడా మంత్రిమండలి ఆలోచించి చర్యలు తీసుకునే విధంగా ప్రణాళికలు రచిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఆడపిల్లలు డిగ్రీ చదువుకోవాలంటే పట్టణానికి రావాలన్నారు. ఈ క్రమంలో వారికి అద్దెకు రూమ్‌లు ఇవ్వడం లేదన్నారు. ఈ విషయంలో తక్షణమే స్పందించి ఎస్సీ, ఎస్టీ అమ్మాయిల ఉన్నత విద్య కోసం 30 రెసిడెన్షియల్ కళాశాలలు స్థాపించడం జరిగిందని తెలిపారు. దీంతో ఎస్సీ, ఎస్టీ అమ్మాయిలు సంతోషంగా ఉన్నారని స్పష్టం చేశారు. గిరిజన మహిళలకు కూడా కళాశాలలు స్థాపించబోతున్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా మంచి పద్ధతితో ముందుకు పోతున్నామని స్పష్టం చేశారు.
TRS PLENARY 2017 Photo Gallery
టీడీపీ, కాంగ్రెస్ హయాంలో రాజకీయ నాయకత్వం రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయానికి గండీ కొట్టింది. ఇప్పుడిప్పుడే రాష్ట్ర ఖజానాను పెంచుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో.. ఇసుక వ్యాపారంలో రూ. 20 కోట్లు ఉన్న ఆదాయం మరుసటి ఏడాదికి రూ. 10 కోట్లకు పడిపోయింది. ఆ మరుసటి ఏడాదికి రూ. 5 కోట్లకు పడిపోయింది. కాంగ్రెస్ పాలన సమయం ముగిసే నాటికి రూ. 5 లక్షలకు పడిపోయింది. అంటే వారి పాలన ఎలా ఉన్నదో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రూ. 20 కోట్లు ఉన్న ఆదాయం రూ. 40 కోట్లకు పోవాల్సింది పోయి.. రూ. 5 లక్షలకు పడిపోయిందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఇసుక వ్యాపారంలో రూ. 460 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. రూ. 5 లక్షల ఆదాయం నుంచి రూ. 460 కోట్లకు ఆదాయం చేరిందంటే.. ఎవరి పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. చిత్తశుద్ధి ఉంటే ప్రతి పనిలో విజయం ఉంటుందన్నారు.

టీఆర్‌ఎస్ పార్టీ ఉద్యమ స్ఫూర్తితో ఉండే పార్టీ కనుక.. అవినీతి రహిత తెలంగాణ కోసం పాటుపడుతున్నామని స్పష్టం చేశారు. తమ పాలనలో అవినీతికి చోటు లేదన్నారు. అవినీతి మీద యుద్ధం చేస్తున్నాం. అవినీతి రహితంగా పని చేస్తున్నాం. ప్రభుత్వం శాఖల మీద ఆరోపణలు చేస్తే.. చేసిన వారిపై కేసులు పెట్టాలని సంబంధిత మంత్రులకు తెలియజేస్తున్నానని తెలిపారు. 100 శాతం రాష్ర్ట ప్రజల మనోభిష్టం మేరకు ప్రభుత్వం పాలనను సాగిస్తున్నదని ఉద్ఘాటించారు. భవిష్యత్ లో సంక్షేమ పథకాల అమలుపై మంత్రివర్గంతో చర్చించి మంచి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. తనను మరోసారి పార్టీ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందకు మరోసారి మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సభను ముగిస్తున్నానని సీఎం ప్రకటించారు.

ఏడు తీర్మానాలు ఆమోదం
టీఆర్ఎస్ ప్లీనరీలో ఏడు తీర్మానాలు ఆమోదం పొందాయి. పలు అంశాలపై పలువురు నేతలు తీర్మానాలను ప్రవేశపెట్టి వివరించగా.. ఇంకొంత మంది నేతలు ఆ తీర్మానాలను బలపరిచి ఆమోదించారు.
1. సంక్షేమంలో స్వర్ణయుగం
2. నీటి పారుదల, వ్యవసాయ రంగాల్లో నూతన అధ్యాయం
3. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం - వృత్తి పనులకు ప్రోత్సాహం
4. విద్యుత్ రంగంలో విజయం - పెట్టుబడుల ఆకర్షణ
5. వినూత్న విధానాలు - ప్రగతి కాముక పథకాలు
6. తాగునీటి వ్యథ తీర్చే మిషన్ భగీరథ
7. సామాజిక రుగ్మతలపై సమరం

1041

More News

మరిన్ని వార్తలు...