టీఆర్‌ఎస్ పార్టీని ఆశీర్వదించండి... సీఎం కేసీఆర్

Fri,September 7, 2018 05:41 PM

cm kcr start election campaign from husnabad

హుస్నాబాద్: హుస్నాబాద్ నియోజకవర్గం వేదికగా సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. సభలో సీఎం మాట్లాడుతూ... వచ్చిన ఆదాయం ప్రజల కోసం వినియోగించినం. జీవన విధ్వంసం జరిగిన ప్రాంతాన్ని బాగు చేయడానికి నోరు కట్టుకుని, కడుపుకట్టుకొని పని చేసినం. శాశ్వత ప్రయోజనాలు చేకూరేలా సంక్షేమ పథకాలను రూపకల్పన చేశాం. రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రైతులకు 24 గంటల కరెంటు ఇస్తే గులాబి కండువ కప్పుకుని టీఆర్‌ఎస్ తరపున ప్రచారం చేస్తా అని జానారెడ్డి అన్నారు. జానారెడ్డి కళ్లకు 24 గంటల కరెంటు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. జానారెడ్డికి కండ్లు కనిపించకుంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంటి వెలుగులో చూపించుకోవాలని హితవు పలికారు. ముదనష్టపు, దరిద్రపుగొట్టు కాంగ్రెస్ పాలనలో 50 ఏండ్లు తెలంగాణ రాష్ట్రం ఎంతగా చితికి పోయామో హుస్నాబాదే నిదర్శనం. కరువుకు మూల కారణమే కాంగ్రెస్.

తెలంగాణ కోసం పేగులు తెగేదాకా మనమే కొట్లాడినం. చావు నోట్లోకి పోయి తెలంగాణ రాష్ట్రం సాధించాను. 2014కు ముందు కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ఎంత నాశనమైందో అందరికీ తెలుసు. కాంగ్రెస్ హయాంలో సాలువారి ఉంటే తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చేది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఏనాడు క్రియాశీలకంగా పనిచేయలేదు. కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వనంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నోరు మెదపలేదు. కళ్యాణలక్ష్మి పథకం పెట్టాలని ఎవరూ దరఖాస్తూ పెట్టలేదు. ఎవరూ కలలో కూడా అనుకోని కార్యక్రమాలు చేపట్టినం. కాంగ్రెస్ పాలనలో పైసలు తినడానికి, పైరవీలు చేయడానికి వారికి సమయం సరిపోలేదు. పెన్షన్ రూ.2వేలు ఇస్తామని హర్రాజ్ పాట పాడినట్లు పాడుతున్న కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలి. ఏనాడైనా పెన్షన్ రూ.వెయ్యి రూపాయలు ఇవ్వాలని మీ బుర్రలకు తట్టిందా. గౌరవెల్లి ప్రాజెక్టుపై మెదడు కరిగించి ఒక టీఎంసీ నుంచి ఎనిమిది టీఎంసీలకు తీసుకొచ్చినం. గౌరవెల్లి ప్రాజెక్టు కింద ప్రజల పొలాలు పారుతాయా... కేసీఆర్ పొలాలు పారుతాయా అని ప్రశ్నించారు. ఢిల్లీ నాయకులను చూడగానే రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల లాగులు తడుస్తాయని ఎద్దేవా చేశారు.

పాలనా పరంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చినం. పాలనా సౌలభ్యం కోసం 31 జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాం. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ మీద అనేక ఆరోపణలు చేశారు. ఒక్క ఆరోపణ అయినా రుజువైందా అని అడిగారు. శాసనసభ రద్దు చేయగానే కాంగ్రెస్ నాయకులు ఆగమాగం అవుతున్నారు. కాంగ్రెస్ నేతలు మాట్లాడేది నెత్తి కాదు. కత్తి కాదు. సంపద పెరిగినా కొద్ది సంక్షేమ పథకాలు విస్తరిస్తాం. ఢిల్లీకి గులాంగిరీ చేద్దామా అధికారం మన చేతుల్లోనే ఉంచుకుందామా అని అడిగారు. తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో ఎన్‌కౌంటర్లు లేవు. ఎరువుల కొరత లేదు. పేకాట క్లబ్బులు లేవు. గుట్కా లేదు. మట్కా లేదు. కాంగ్రెస్ పార్టీ ఖర్మకాలి అధికారంలోకి వస్తే మళ్లీ కరెంటు ఎటమటం అవుతుంది. ఇప్పుడు కరెంటు బాధలు పోయినయి. మత కల్లోలాలు లేవు. అన్ని వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలి. రైతు బంధు పథకం ద్వారా ఎకరాకు రూ. 8వేల పెట్టుబడి సహాయం అందిస్తున్నాం. రైతు బీమా ద్వారా చనిపోయిన రైతు కుటుంబానికి రూ. 5లక్షల ఆర్థిక వెసులుబాట కల్పిస్తున్నాం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్దమన్న ప్రతిపక్షాలు ఇప్పుడు ఎందుకు బయపడుతున్నాయాని ప్రశ్నించారు. హుస్నాబాద్ నుంచి ఒడితెల సతీష్‌కుమార్‌ను ఆశీర్వదించండి. కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్ పార్టీని మళ్లీ అధికారంలోని తీసుకురావాలని కోరారు.

2845
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles